Breaking News

31/10/2019

భద్రాచలం ఏజెన్సీలో డెంగీ విజృంభణ

ఖమ్మం, అక్టోబర్ 31, (way2newstv.in)
భద్రాచలం ఏజెన్సీలో డెంగీ విజృంభిస్తోంది. ఏజెన్సీలోని ఆరు మండలాల్లో నెలన్నర రోజుల్లో సుమారు వంద మందికిపైగా విషజ్వరాలతో మృతిచెందారు. ఒక్కో గూడెంలో ఇద్దరి నుంచి ఆరుగురు వరకు చనిపోయారు. కానీ ఈ మరణాలను అధికారులు డెంగీ మరణాలుగా గుర్తించడం లేదు” అని మానవ హక్కుల వేదిక నాయకులు ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆరు ఏజెన్సీ మండలాల్లో మానవ హక్కుల వేదిక నాయకుల కూడిన ప్రతినిధి బృందం పర్యటించింది. విషజ్వరం, తీవ్ర అస్వస్థత కారణంగా మరణించిన 30 మందికి చెందిలన కుటుంబాల నుంచి వివరాలు సేకరించింది. ఆస్పత్రి రికార్డులను, బాధితులు చెప్పిన విషయాలను విశ్లేషించి రూపొందించిన నివేదికను వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వేమన వసంత లక్ష్మి, ఎస్‌‌‌‌.జీవన్‌‌‌‌ కుమార్‌‌‌‌  విడుదల చేశారు.
భద్రాచలం ఏజెన్సీలో డెంగీ విజృంభణ

డెంగీ కేసుల్లో హైదరాబాద్‌‌‌‌ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండో స్థానంలో ఉంది. ఈ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో వసతుల కొరత, ఆదివాసుల్లో పేదరికం, అవగాహన లేమితో రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే మరణాల రేటు ఎక్కువగా ఉంది. అశ్వారావుపేట మండలం దురదపాడులో నెలన్నరలో జ్వరాలతో ఆరుగురు చనిపోయినట్లు మానవ హక్కుల వేదిక సభ్యులు గుర్తించారు. మణుగూరు మండలంలోని కొత్త మల్లేపల్లి గ్రామంలో 60 కుటుంబాలు ఉండగా, నెల రోజుల్లో వ్యవధిలో ఆరుగురు చనిపోయారు. వీరంతా మణుగూరు ప్రభుత్వాస్పత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చినవారేనని, డాక్టర్లు ఏ టెస్టులు చేయకుండా కొన్ని మందు గోళీలు ఇచ్చి పంపినట్లు పరిశీలనలో వెల్లడైంది. కొత్తమామిళ్లవారిపాలెంలో తండ్రీకొడుకులు జ్వరంతో బాధపడుతూ మూడు రోజుల వ్యవధిలో మృతిచెందారు. ములకలపల్లి మండలం ముత్యాలపాడు గ్రామంలో డెంగీ బారినపడిన ఏడేళ్ల చిన్నారి కూరం దీపాలిని బతికించుకునేందుకు ఆమె తండ్రి రూ.1.20 లక్షలు ఖర్చు చేసినా పాప దక్కలేదు.ఏజెన్సీలో మరణాలు పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదని వేమన వసంత లక్ష్మి, ఎస్‌‌‌‌.జీవన్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లాలో ఐదు ఏరియా ఆస్పత్రులు ఉండగా కొత్తగూడెం, భద్రాచలంలో మాత్రమే డెంగీ టెస్ట్‌‌‌‌లు చేస్తున్నారని, అది కూడా ఇన్‌‌‌‌పేషెంట్లకు మాత్రమే చేస్తున్నారని తెలిపారు. మిగతా ఏరియా ఆస్ప్రతులు, పీహెచ్‌‌‌‌సీల్లో కనీసం కంప్లీట్‌‌‌‌ బ్లడ్‌‌‌‌ పిక్చర్‌‌‌‌(సీబీపీ) చేయడానికి కూడా వసతులు లేకపోవడాన్ని తమ బృందం గుర్తించినట్లు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం డెంగీ నిర్ధారణకు ఏజెన్సీలోని అన్ని ఆస్పత్రుల్లో ల్యాబ్‌‌‌‌లు ఏర్పాటు చేయాలని, పూర్తి స్థాయిలో వైద్యం అందేలా డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని, మొబైల్‌‌‌‌ హాస్పిటళ్లను ఏర్పాటు చేయాలని కోరారు.

No comments:

Post a Comment