వరంగల్, జనవరి 3, (way2newstv.in)
తెలంగాణలో ప్రైవేటు వ్యవసాయ కళాశాల ఏర్పాటుపై ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే వ్యవసాయశాఖ, జయశంకర్ వ్యవసాయ వర్సిటీలు ఒక నివేదికను రూపకల్పన చేయాలని నిర్ణయించాయి. వ్యవసాయ, ఉద్యాన తదితర అనుబంధ రంగాల కోర్సులకు భారీ డిమాండ్ ఉంది. అయితే ప్రభుత్వ వ్యవసాయ కాలేజీల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో అనేకమంది పంజాబ్, మహారాష్ట్ర సహా ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ ప్రైవేటులో చదువుతున్నారు. దీంతో మన రాష్ట్రంలోనే ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాన్ని అక్కడి ప్రభుత్వం తీసుకుంది.
ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజీలు...
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆరు వ్యవసాయ కళాశాలల్లో బిఎస్‌సి ఆనర్స్ అగ్రికల్చర్‌లో 432 సాధారణ సీట్లు, 75 పేమెంట్ సీట్లు ఉన్నాయి. కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రెండు కళాశాలల్లో బిఎస్‌సి ఆనర్స్ హార్టీకల్చర్‌లో 130 సాధారణ సీట్లు, 20 పేమెంట్ సీట్లు, ఇక పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విద్యాలయం పరిధిలోని మూడు కళాశాలల్లో బివిఎస్‌సి అండ్ యానిమల్ హజ్బెండరీలో 158 సీట్లు, అలాగే వనపర్తి జిల్లా పెబ్బేరు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముత్తుకూర్లలోని ఫిషరీస్ సైన్స్ కళాశాలల్లోని బిఎఫ్‌ఎస్‌సిలో (తెలంగాణ కోటా) 36 సీట్లలో ప్రవేశానికి అవకాశముంది. ఈ ఏడాది బిఎస్‌సి ఆనర్స్ అగ్రికల్చర్‌లో 25 సీట్లు ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్ కోటా కింద భర్తీకి అవకాశం కల్పించారు. ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు ఫీజు రూ. 34 లక్షలు, పేమెంట్ సీట్లకు రూ. 14 లక్షల చొప్పున వసూలు చేయాలని యూనివర్సిటీ ఈ ఏడాది నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంటర్ బైపిసి పూర్తయిన విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఫిషరీస్ సైన్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.ఇప్పటికే ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం తెలంగాణలో అమల్లోకి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఒక నివేదికను సమర్పించి, యూనివర్సిటీ యాక్ట్‌ను సవరించుకోవడం ద్వారా ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతించవచ్చునని జయశంకర్ వర్సిటీ ఉన్నతాధికారులు తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కూడా ప్రైవేటు వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు ప్రై వేటు వ్యవసాయ కాలేజీల ఏర్పాటుకు ముందుకువచ్చినప్పటికీ, ప్రైవేటు కాలేజీల ఏర్పాటుపై విధానపరమైన నిర్ణ యం తీసుకోనందున వాటిని తిరస్కరించారు.రాష్ట్రంలో ఈ ఏడాది బైపిసి వార్షిక పరీక్షలో పాసైనవారు 62 వేల మంది ఉన్నారు. వారు కాకుండా గతంలో ఫెయిల్ అయి పరీక్ష రాసినవారు, అడ్వాన్స్ సప్లమెంటరీ రాసిన విద్యార్థులు మరో 40 వేల మంది ఉన్నారు. అంటే లక్ష మందికిపైగా బైపిసి పూర్తి చేశారు. వారిలో చాలామంది సాధారణ బిఎస్‌సి డిగ్రీకి బదులు ఎంబిబిఎస్, బిడిఎస్ తదితర మెడికల్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్‌లో 4,670 సీట్లు, డెంటల్‌లో 1140 సీట్లు, ఆయుర్వేద, హోమియో, యునాని కోర్సుల్లో 655 సీట్లున్నాయి. అంటే అన్ని మెడికల్ సీట్ల సంఖ్య 6,465 ఉన్నాయి. మెడికల్‌లో సీట్లు రానివారిలో వేలాదిమంది వ్యవసాయ కోర్సులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా సీట్లు రానివారంతా ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు వ్యవసాయ కోర్సులు చదువుతున్నారు.
No comments:
Post a Comment