Breaking News

04/09/2018

అంతుపట్టని కేసీఆర్ వ్యూహాలు డిఫెన్స్ లో పడిన ప్రతిపక్షాలు

హైద్రాబాద్, సెప్టెంబర్ 4 (way2newstv.in) 
ఆయన అసాధ్యుడు. అంతుచిక్కడు. రాచరికంలో చాణక్యుడు. సమయాను కూల నిర్ణయాల్లో నేర్పరి. వ్యవహారనైపుణ్యంలో శ్రీకృష్ణుడు. ఎవరైనా కింగ్ గా ఉంటారు. లేదా కింగ్ మేకర్ గా హవా చలాయిస్తారు. కానీ రెండు పాత్రలు పోషించడం అరుదు. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతూ ప్రతి ఎత్తుగడను కొత్త పంథాలో వినూత్నం చేయడమే కేసీఆర్ శైలి. సాహసం ఆయన వైఖరి. భద్రమైన స్థానంలో కూర్చుని కూడా రిస్కు చేయడం ఆయన నైజం. భారతదేశంలోనే అతిపెద్ద బహిరంగసభ పేరిట తలపెట్టిన ప్రగతి నివేదన పలు కొత్త కోణాలను ఆవిష్కరించబోతోంది. అందులోనూ రాజకీయ వ్యూహం దాగి ఉంది. భారత చరిత్రలో పెద్ద సభ అనడం అతిశయోక్తి కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భారీ సభ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతుపట్టని కేసీఆర్ వ్యూహాలు
డిఫెన్స్ లో పడిన ప్రతిపక్షాలు

దీని వెనక ఉన్న అంచనాలు, ఆ తర్వాత తీసుకోబోయే నిర్ణయాలు, పర్యవసానాలు అన్నీ అనూహ్యమే. అదే కేసీఆర్ స్పెషాలిటీ.సమయం, సందర్భం చూసి గురి పెట్టాలి. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. ఆ విషయం కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే తెలంగాణకు ముందస్తు అనడంలోనే చతురత తొంగి చూస్తుంది. ‘ఎమ్మెల్యే ముందస్తు ఎన్నికలకు కష్టపడాలి. వారికి ఎంపీ అభ్యర్థులు అండగా నిలవాలి. పార్టీలో,ప్రభుత్వంలో గుర్తింపు తెచ్చుకుని పదవులు రాబట్టుకోవాలంటే ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించుకోవాలి. ఇలా ద్విముఖ వ్యూహంతో రెండు ఎన్నికలను విడదీసేస్తున్నారు. అటు ఎంఐఎం ను జో కొట్టాలి. ఇటు బీజేపీతో జత కట్టాలనీ చూస్తున్నారు. ఇది అనితర సాధ్యం. రెండు పడవలపై ఒకేసారి ప్రయాణం చేయడం భౌతికంగా కష్టం. కానీ రాజకీయాల్లో సాధ్యమని నిరూపించాలని యత్నిస్తున్నారు కేసీఆర్. పరస్పర విరుద్ధమైన శక్తులు రెంటితోనూ చెలిమి చేస్తూ ఇద్దరూ తనను కావాలని కోరుకొనేలా చేయడానికి చాలా నేర్పరితనం కావాలి. దానిని సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నో శక్తియుక్తులుండాలి. ఆ సామర్థ్యం నూటికి నూరుపాళ్లు పుణికిపుచ్చుకోవడంతోనే కేసీఆర్ రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు. ఉద్యమం మొదలు ప్రభుత్వాధికారం వరకూ తానే ఏకైక కేంద్రంగా నిలవగలుగుతున్నారు.కేసీఆర్ ఎత్తుగడలకే కాదు. ఒక విషయాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లి అందరి దృష్టి దానిపైనే నిలచేలా చేయడంలోనూ నేర్పరి. ప్రత్యర్థి పైచేయి సాధిస్తాడనే సందర్బంలో పక్కదారి పట్టించడంలోనూ చతురుడే. రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా తెలంగాణలో ప్రజలు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. అందుకే రాష్ట్ర అసెంబ్లీ రద్దు అవుతుందన్నంత ఉత్కంఠ కు తెర లేపారు. కీలకమైన నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు కేసీఆర్. సాయంత్రం పూట గంటకు పైగా మీడియాతో మాట్టాడారు. పాపం ఢిల్లీ నుంచి వచ్చి రెండురోజులపాటు ప్రజల్లో తిరిగిన రాహుల్ పర్యటన పేలవంగా తేలిపోయింది. అప్పుడే ముందస్తు ఎన్నిక సాధికారికంగా ముందుకొచ్చింది. ఒక అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆయన ఏవిధంగా వ్యవహరిస్తారనేందుకు ఇదో పెద్ద ఉదాహరణ. అలాగే ప్రగతి నివేదన సభను తలపెట్టారు. ఇది పతాకస్థాయి శీర్షికలను ఎలాగూ ఆకర్షిస్తుంది. కానీ ప్రజలకు ఆసక్తి కలిగించడమెలా? అన్నది ముఖ్యం. అందుకే సభలో ఏదో జరగబోతోంది. కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారన్న ఉత్కంఠ రేకెత్తించాలి. అందుకే అంతటి పెద్ద సభకు ముందు కేబినెట్ సమావేశాన్ని తలపెట్టారు. దీంతో అందరి దృష్టి ప్రగతి నివేదన సభ వైపు మరలక తప్పని అనివార్యతను కల్పించారు. కేవలం టీఆర్ఎస్ సానుభూతిపరులే కాదు. రాష్ట్రం మొత్తం ఎదురుచూసే ఘట్టంగా మార్చేశారు.ఇంతకీ శాసనసభను రద్దు చేస్తారా? లేదా? ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారై పోయినట్లేనా? అన్నది ఇంకా సస్పెన్సే. ఆ ముడివిడిపోతే పెద్దగా మజా ఉండదు. అందుకే ఇంకా ఆటాడుతూనే ఉన్నారు కేసీఆర్. నన్ను పట్టుకో చూద్దామన్నట్లుగా ఎత్తుపైఎత్తుల చదరంగం సాగిస్తూనే ఉన్నారు. ప్రత్యర్థులకు పట్టు దొరకడం లేదు. ఉత్కంఠకు కనీసం ప్రగతి నివేదన సభలోనైనా తెర వేస్తారా? అంటే వేచి చూడాల్సిందే. కానీ వ్యూహప్రతివ్యూహాల ఎత్తుగడల్లో అతనింకా అంతుచిక్కని చంద్రుడే.

No comments:

Post a Comment