Breaking News

29/07/2019

సౌకర్యాలెక్కడ..? (తూర్పుగోదావరి)

కాకినాడ, జూలై 29 (way2newstv.in):
జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. సరైన భవన వసతి లేకపోవడం, తాగునీటి సమస్య, మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటం..అపరిశుభ్రత నడుమ వంట తయారీ వంటి సమస్యలతో విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. హాస్టళ్లలో ఈ సమస్యల పరిష్కారంలో యంత్రాంగం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుండటం విద్యార్థులకు ప్రతిబంధకంగా మారుతోంది.జిల్లాలో ఎస్సీ హాస్టళ్లు 88 ఉండగా వీటిలో 9,194 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీటిలో 50 బాలురు, 38 బాలికల వసతి గృహాలున్నాయి. నాలుగు హాస్టళ్లను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి 42 హాస్టళ్లు ఉండగా వాటిలో 16 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మొత్తం 3,500 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు కలిపి మొత్తం 104 ఉన్నాయి. 
సౌకర్యాలెక్కడ..? (తూర్పుగోదావరి)

వీటిలో సుమారు 20 వేల మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. రాజోలులోని బాలుర హాస్టల్‌ గదుల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థ ప్రమాదకరంగాతయారైంది. తీగలు బయటకు రావడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.పెద్దాపురం, తుని, కోరుకొండలోని వసతిగృహాల భవనాలు శిథిల స్థితికి చేరాయి. కోరుకొండలో భవనం స్లాబు పెచ్చులూడి ఇనుప ఊసలు బయటకు వచ్చేశాయి. దీంతో స్లాబు ఎప్పుడు కూలిపోతుందోన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. రామచంద్రపురంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌ భవనం కూడా ప్రమాదకరంగా ఉంది. కాకినాడ గ్రామీణంలోని వెంకటాపురం బాలయోగి గురుకులంలో కొన్ని మరుగుదొడ్లకు తలుపులు లేవు. పిఠాపురం, రాజవొమ్మంగిలలోని బాలుర వసతిగృహాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రంపచోడవరంలోని ఆశ్రమ పాఠశాలలో తరగతి గదుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ 300 మంది విద్యార్థులు ఉండగా అక్కడ నాలుగు గదుల్లోనే ఆశ్రయం పొందాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితిలో స్థానిక జూనియర్‌ కళాశాలకు చెందిన గదుల్లో కొందరు విద్యార్థులకు బస ఏర్పాటు చేశారు. అమలాపురం మండలం జనుపల్లెలోని వసతి గృహం వరండా కిందకు దిగబడిపోతోంది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లోని హాస్టళ్లలో కనీస వసతులు కరవై విద్యార్థులు తల్లడిల్లుతున్నారు.

No comments:

Post a Comment