Breaking News

29/07/2019

ఇసుక తుఫాన్ (విజయనగరం)

విజయనగరం, జూలై 29  (way2newstv.in): 
జిల్లాలో ఇసుక కొరత వేధిస్తోంది. ప్రస్తుతం భవన నిర్మాణాలకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో నిర్మాణాలన్నీ పడకేశాయి ఈ రంగంపై ఆధారపడుతున్న వేలాది కార్మికులకు ఉపాధి కొరవడుతోంది. కొరత నేపథ్యంలో ఇసుక ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్యులు భారం భరించలేక ఇంటి నిర్మాణ పనులను అర్ధంతరంగా నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తోంది. మొత్తంగా భవన నిర్మాణ రంగం నిస్తేజంగా మారింది. శృంగవరపుకోట నియోజకవర్గంలో 80 శాతం వరకు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఒడిశా నుంచి ఇసుకను తెచ్చి దానికి స్థానికంగా గెడ్డల్లో దొరికిన ఇసుకను కలిపి ట్రాక్టర్‌ రూ.4-5 వేలు  చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ట్రాక్టర్‌ రూ.5వేలు పలుకుతుంది. స్థానికంగా గెడ్డలు, వాగుల నుంచే రాత్రివేళల్లో తరలించి ఇలా అమ్మకాలు చేస్తున్నారు. నెల్లిమర్లలో ,ఎద్దుల బళ్లతో ఇసుకను తెచ్చి గుట్టుగా అమ్ముతున్నారు.
ఇసుక తుఫాన్ (విజయనగరం)

ఒక్కో బండి రూ.500 వరకు పలుకుతోంది.ఇసుక కొరత.. నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేలాది కార్మికులకు ఉపాధి కొరవడుతోంది. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో విల్లాలు, బహుళ అంతస్తుల భవనాల పనులు సాగుతున్నాయి. గ్రామాల్లో వేల సంఖ్యలో ఇళ్లు నిర్మాణాల్లో ఉన్నాయి. వీటికి వేలటన్నుల ఇసుక అవసరముంటుంది. వర్షాకాలం రాకముందే  ఈపనులన్నీ పూర్తి చేయాలని అనుకుంటున్న నిర్మాణ దారులకు ఇప్పుడు నిరాశ ఎదురవుతోంది. ఇది వరకు జిల్లాలోని చంపావతి, వేగావతి, గోస్తనీ, సువర్ణముఖి, నాగావళి నదుల్లో రీచ్‌లు నుంచి ఇసుక సరఫరా ఉండేది. ప్రస్తుతం వీటిని ప్రభుత్వం నిలిపివేసింది. నూతన విధానాన్ని ఖరారు చేసి, కొత్తగా రీచ్‌లను గుర్తించి సరఫరా చేయాలని భావిస్తోంది. తాజాగా నెలకొన్న ఇసుక కొరతను అదునుగా తీసుకుని కొందరు రాత్రి వేళల్లో చాటుమాటుగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది వరకు రూ.1000 ఉన్న ట్రాక్టర్‌ ఇసుక ధర ఇప్పుడు రూ.4వేలు నుంచి రూ.5 వేలు వరకు పలుకుతుంది. రీచ్‌లు కాకుండా గెడ్డలు, వాగుల్లో ఉన్న ఇసుకను గుట్టుగా తరలించి అమ్మకాలతో సొమ్ము చేసుకుంటున్నారు. ఎడ్ల బళ్లతో ఇసుకను తెచ్చిన ఇసుకను బండి రూ.500 చొప్పున అమ్ముతున్నారు. ఇసుకపై నూతన విధానం అమల్లోకి వచ్చేంతవరకు భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. భవనిర్మాణదారులు ఏరీచ్‌ నుంచి ఇసుకను పొందాలనుకుంటున్నారో సంబంధిత మండల తహసీల్దారుకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. నిర్మాణదారునిది సొంత గృహమైతే సంబంధిత పంచాయతీ కార్యదర్శి నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన పత్రం, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద నిర్మిస్తున్న గృహమైతే సంబంధింత గృహ నిర్మాణ శాఖ ఏఈ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని దరఖాస్తుతో జతచేయాలి. వీటిని తహసీల్దార్లు పరిశీలించి సంబంధిత రెవెన్యూ డివిజన్‌ అధికారులకు పంపుతారు. ఆర్డీవో అనుమతిచ్చిన తర్వాత కేటాయించిన రీచ్‌లో ఇసుకను పొందే అవకాశం దరఖాస్తుదారునికి ఉంటుంది. ఇసుకకు ఆర్డీవో అనుమతిచ్చే విషయంలో తొలుత ప్రభుత్వ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తారు. పేదలకు సంబంధించిన గృహ నిర్మాణాలకు రెండో ప్రాధాన్యత ఉంటుంది. ఆ తరువాత మిగతా నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. ఈవిధంగా ఇసుకను పొందడం సుదీర్ఘ ప్రక్రియ కావడంతో సకాలంలో అందడం లేదని నిర్మాణదారులు చెబుతున్నారు. ఇసుక రీచ్‌లు లేని మండలాల్లో కొందరు తహసీల్దార్లు వచ్చిన దరఖాస్తులపై స్పందించడం లేదు. మా పరిధిలో రీచ్‌ల్లేవని చెబుతూ దరఖాస్తులు స్వీకరించడం లేదని నిర్మాణదారులు చెబుతున్నారు.ఇసుక కొరత ప్రభావం జిల్లాలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులపై తీవ్రంగా పడుతుంది. జిల్లాలో 40 వేలకు పైగానే కార్మికులు భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం ఇసుక సరఫరా నిలిచిపోయి భవన నిర్మాణ పనులన్నీ ఆగిపోవడంతో ఈ కార్మికులంతా ఉపాధి లేక వీధిన పడ్డారు. తాపీమేస్త్రీలు, కూలీలు అంతా పనుల్లేక ఖాళీగా ఉంటున్నారు. తమకు ఉపాధిని దూరం చేసిన ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతూ పార్వతీపురం, సీతానగరంలో ఇటీవల భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం పనుల్లేక ఇంటి వద్ద ఖాళీగా కూర్చోలేక చిన్నపాటి పనులను వెతుక్కుంటున్నట్టు భవన నిర్మాణ కార్మికులు చెబుతున్నారు.

No comments:

Post a Comment