Breaking News

29/07/2019

అంతా ఆన్ లైన్.. (విజయవాడ)

విజయవాడ, జూలై 29 (way2newstv.in - Swamy  Naidu): 
రైతుబజార్‌ నిర్వహణలో నూతన సర్కారు సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టనుంది. అక్రమాల అడ్డుకట్టకు ఆన్‌లైన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ధరల వివరాలను రాజధాని నుంచే పర్యవేక్షణ చేయనున్నట్టు మార్కెటింగ్‌శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దుకాణాలకు గుర్తింపు పత్రాలు జారీచేసే ప్రక్రియలో సరికొత్త మార్గదర్శకాలను జారీచేసినట్టు పేర్కొంటున్నాయి. ఈ ప్రభుత్వం రైతుబజార్‌లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.  రాజధాని ప్రాంత పరిధిలో గుంటూరు జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 21 రైతుబజార్లు ఉన్నట్టు మార్కెటింగ్‌శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్‌ ధర కంటే తక్కువకే రైతుబజార్‌ ద్వారా అందరికీ కూరగాయలు అందించాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ఈ వ్యవస్థ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. 
అంతా ఆన్ లైన్.. (విజయవాడ)

ఆయా మండలాల్లో రైతులు కూరగాయ పైర్లను సాగుచేసే భూముల వివరాలతో పాటు అక్కడ పండుతున్న పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఎంతమంది రైతులు సాగు చేస్తున్నారు..? ఏమేరకు దిగుబడులు వస్తున్నాయి.. తదితర వివరాలను ఉద్యానశాఖ అధికారుల నుంచి సేకరించి అందుబాటులో ఉంచుతారు. కొన్ని రైతుబజార్లలో దళారులు చేరి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సర్కారు పంటలు పండించిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలనే ఆకాంక్షతో అన్ని వివరాను బయోమెట్రిక్‌ ద్వారా ఆన్‌లైన్‌ చేయనుంది.  పంటలు సాగుచేయని వారి గుర్తింపు  పత్రాలను రద్దుచేసే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. ఇది దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి దోహదం చేస్తుందంటున్నారు. కొన్ని రైతుబజార్లలో స్టాళ్లను కేటాయించడంలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులకు సైతం అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఆ ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని దుకాణాల ఎంపికకు సంబంధించి  డ్రాతీసే ప్రక్రియను కూడా ఇకపై ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. వారానికి ఒకసారి ఆన్‌లైన్‌లో డ్రా తీస్తామని, స్టాళ్ల నంబర్లతో కూడిన షీటు వస్తుందని, దానికి అనుగుణంగా రైతులకు స్టాళ్లను కేటాయిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.  రైతుబజార్‌లో కూరగాయల ధరలపై ఎప్పటికప్పుడు సమీక్ష   నిర్వహించేవిధంగా అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ధరల వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఆయా రైతుబజార్ల ధరల్లో హెచ్చుతగ్గులపై నిశిత పరిశీలన ఉంటుంది. వ్యత్యాసాలను అందరూ గమనించేలా ఈ విధానాన్ని అమలుపరచనున్నారు. ప్రతి రైతుబజార్‌లోనూ డిజిటల్‌ బోర్డును ఏర్పాటుచేశారు. ఆ బోర్డులపై ఎప్పటికప్పుడు ధరల వివరాలు కళ్ల ఎదుటే ప్రత్యక్షమవుతున్నాయి. ఈ ప్రక్రియ అంతా మార్కెటింగ్‌శాఖ ప్రధాన కార్యాలయం కనుసన్నల్లోనే జరుగుతుందని 
అధికారులు చెబుతున్నారు.

No comments:

Post a Comment