Breaking News

29/07/2019

ఆదుకోని పెన్ గంగ.. (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, జూలై 29  (way2newstv.in - Swamy Naidu): 
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దున ప్రవహించే పెన్‌గంగా నదిలో నీటి ప్రవాహం పెరగలేదు. వర్షాకాలం ఆరంభమై రెండు నెలలు కావొస్తున్న సమృద్ధిగా వర్షాలు కురవలేదు. ఆదిలాబాద్‌ జిల్లా నదీ పరివాహక ప్రాంతంగా ప్రసిద్ధి గాంచిన ఈ పెన్‌గంగా నదీ వానాకాలం ప్రారంభమైందంటే చాలు వరదలతో ఉప్పొంగి ప్రవహించేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఏటా నీరు పుష్కలంగా ఉండి పంటలు బాగా పండేవి. అయితే ఈ ఏడాది మాత్రం తొలకరి జల్లులకు వేసిన పత్తి విత్తనాలు మాత్రం మొలకెత్తని పరిస్థితి నెలకొంది. ఇదిలాగే ఉంటే ఎలా బతకాలో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దక్షిణ గంగగా ప్రసిద్ధి పొందిన గోదావరి ఉపనది పెన్‌గంగా జలకళ లేక చిన్నబోతోంది.
 ఆదుకోని పెన్ గంగ.. (ఆదిలాబాద్)

అన్నదాతలకు వరప్రదాయినిగా పేరొందిన ఈ ఉపనది ఇప్పుడు సహజత్వాన్ని కోల్పోతుంది. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం నుంచి మొదలుకొని కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కౌటాల మండలం వరకు దాదాపు 200 కిలో మీటర్ల మేర ప్రవహించాల్సిన పెన్‌గంగా నది ఇప్పుడు జలకళ లేక అన్నదాతలకు ఆందోళన కలిగిస్తోంది. నదీ పరివాహక ప్రాంతమంతా బండరాళ్లు తేలి దర్శనమిస్తోంది. రెండువైపులా అటూ ఇటూ ఒడ్డున సమాంతరంగా ప్రవహించే ఈ నది ఎక్కడో చోట సన్నని ధారగా వెళుతోంది. జులై మాసం ప్రారంభమైందంటే చాలు పెన్‌గంగా ఉప్పొంగి ప్రవహించేది. రెండు రాష్ట్రాల రైతులను భయాందోళనలకు గురిచేసేది. ఎప్పుడు తమ పంట పొలాలు మునిగిపోతాయో, పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళన కలిగించేది. ప్రస్తుతం దానికి భిన్నంగా ఈ ఏడాది దుర్భిక్ష పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని విదర్భలో కురిసిన వర్షాలతోనే ఆదిలాబాద్‌ ప్రాంతంలో కాస్త వాన జాడ తెలిసొచ్చేది. పెన్‌గంగా నిండుకుండలా ఉండేది.మహారాష్ట్రతో పాటు తెలంగాణ కశ్మీరంగా పేరొందిన ఆదిలాబాద్‌ జిల్లాలోనూ వాన జాడ కనిపించడం లేదు. దాదాపు 250 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 100 మి.మీ వరకు కురిసింది. సహజంగా జూన్‌ మొదటి వారంలో రైతులు విత్తనాలు వేసుకొని జులై మాసం వరకు పత్తి, సోయాతో అలరారాల్సిన క్షేత్రాలు విత్తన దశలోనే ఉండడంతో దుర్భిక్ష పరిస్థితిని చవిచూస్తోంది. ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. ఈ సమయానికి పంటలు ఏపుగా పెరిగి రైతుల కళ్లలో ఆనందం కనిపించేది. ప్రస్తుతం దానికి భిన్నంగా కనిపిస్తోంది. వరుణుడు కరుణించకపోవడంతో నదిలో నీళ్లులేక నదీ పరివాహక ప్రాంతంలోని రైతుల చేలలో విత్తిన విత్తనాలు ఎండ వేడిమికి మాడిపోతుండడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు.

No comments:

Post a Comment