Breaking News

17/06/2019

అమ్మో ఇటుక (కృష్ణాజిల్లా)

విజయవాడ, జూన్ 17 (way2newstv.in): 
సొంతంగా ఇల్లు నిర్మించుకుని పిల్లాపాపలతో కలిసి నివసించాలనేది ప్రతి పేదవాడి కల. పైసా పైసా కూడబెట్టి గూడు కట్టుకోవాలనుకునే సామాన్యుల ఆశలు ఆవిరైపోతున్నాయి. గతంలో ఇల్లు నిర్మించుకోవాలంటే ముందుగా సిమెంట్‌, ఐరన్‌ ధరలు తక్కువగా ఉన్నప్పుడు పనులు మొదలుపెట్టేవారు. ఇటుకల ధర సాధారణంగా ఉండటంతో నిశ్చింతగా నిర్మాణం పూర్తి చేసేవారు. ప్రస్తుతం ఇటుకల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులు గృహ నిర్మాణం చేపట్టాలంటే బెంబేలెత్తుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు భారంగా భావిస్తున్నారు. వెయ్యి ఇటుకల ధర రూ.ఎనిమిది వేలకు చేరడంతో గృహ నిర్మాణదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మొదలుపెట్టిన నిర్మాణాలు పూర్తి చేయలేక తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది వెయ్యి ఇటుక రూ.నాలుగు వేలు. ప్రస్తుతం ధర రెట్టింపు కావడంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇటుకల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలతో పాటు ఇతర నిర్మాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 

అమ్మో ఇటుక (కృష్ణాజిల్లా)
రెండు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలు 41 వేల పైగా నిర్మాణ దశలో ఉన్నాయి. 77,800 నిర్మాణాలు ఇంకా చేపట్టాల్సి ఉంది. రెండు జిల్లాల్లో సొంతంగా కట్టుకుంటున్న ఇళ్లు 80 వేలకు పైగా నిర్మాణ దశలో ఉన్నట్లు అంచనా.ఏటా వేసవిలో గృహ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సాధారణంగా మామూలు ఇంటికి 40 నుంచి 60 వేల ఇటుకలు అవసరమవుతాయి. ఏప్రిల్‌లో వెయ్యి ఇటుకల ధర రూ.6500 ఉండగా, ఒక్కసారిగా రూ.ఎనిమిది వేలకు పెరగడంతో గృహనిర్మాణదారులు సంశయంలో పడ్డారు. అప్పులు తెచ్చి మరీ నిర్మాణం చేపట్టిన వారు మరింత ఆర్థిక సంక్షోభంలో పడిపోయారు. ధరలు పెరిగిపోవడంతో ఇళ్ల నిర్మాణం ఎలా పూర్తి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా ఉన్న సిమెంట్‌ ఇటుక ధర కూడా భారంగా మారింది. ఒక్కో సిమెంట్‌ ఇటుక రూ.19 నుంచి రూ.22 వరకూ పలుకుతోంది.కృష్ణా జిల్లాలో గుడివాడ, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, కైకలూరు, గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ల, తెనాలి, వినుకొండ, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో ఇటుక బట్టీలు అధికంగా ఉన్నాయి. తయారీకి మట్టి, ఊక, కొబ్బరిపీచు, బూడిద, పుల్లలు, బొగ్గు అవసరమవుతాయి. బట్టీ నిర్వహణకు ఎకరం స్థలం రూ.40 వేల వరకూ లీజు ఉంటుంది. టన్ను కొబ్బరిపీచు రూ.1500, పుల్లలు రూ.2400, ఊక రూ.4 వేలు, బొగ్గు రూ.4500 వరకు వ్యయం అవుతుంది. ఒక ఇటుక తయారీకి రూ.అయిదు నుంచి రూ.ఆరు వరకు ఖర్చు అవుతోందని బట్టీ నిర్వాహకులు చెబుతున్నారు. మట్టి కొరత ఏర్పడటంతో తయారీ మందగించిందని, ఒక్కో కూలీకి రోజుకు రూ.600 పైగా చెల్లించడం ప్రతికూలంగా మారిందని వాపోతున్నారు. రవాణా ఖర్చులు కలిపితే నిర్వహణ వ్యయం మరింత పెరుగుతోందని చెబుతున్నారు. ఖర్చు పెరగడంతో వ్యాపారం గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. వర్షాకాలం ఆసన్నమవడంతో ఇక ముందు ఇటుకలు తయారు చేసే పరిస్థితి ఉండకపోవచ్చని, ధరలు కొంతమేర పెరిగిన మాట వాస్తవమేనని వివరించారు.

No comments:

Post a Comment