Breaking News

17/06/2019

సర్వేతో సరి.. (విజయనగరం)

విజయనగరం, జూన్ 17(way2newstv.in): 

భూగర్భ మురుగు కాలువల నిర్మాణం (యూజీడీ) జిల్లాలో సర్వేకే పరిమితమైంది. రెండేళ్లుగా ప్రతిపాదనల్లోనే నలుగుతూ వచ్చింది. నిధుల భారంతో ఒక్కొక్కటిగా పంచాయతీలను తగ్గిస్తూ వచ్చారు. ప్రయోగాత్మకంగా రెండు పంచాయతీలకు అంచనా వ్యయం రూపొందించి గతేడాదిలో ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పనులు కట్టబెట్టిన గుత్తేదార్లు సర్వే చేసి చేతులు దులుపుకొన్నారు. అధికారులకు నేటికీ డీపీఆర్‌ (సవివర ప్రాజెక్టు అంచనాలు)లు ఇవ్వని పరిస్థితి నెలకొంది. 2019-20 ఆర్థికంలోనైనా కార్యరూపం దాల్చే విషయమై అనుమానాలు నెలకున్నాయి.ఉపాధిహామీ పథకంలో సి.సి.రోడ్ల నిర్మాణ సమయంలో వీటి నిర్మాణాల ప్రతిపాదనను తీసుకొచ్చారు. మూడేళ్లుగా పథకం ఊరిస్తూ వస్తోంది. గతంలో రూపొందించిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. తొలుతగా 2015-16లో చీపురుపల్లిలో ఆంజనేయపురంలో నిర్మాణానికి రూ.5 కోట్లతో ప్రతిపాదన రూపొందించారు. దీనికి అప్పటి కలెక్టర్‌ ఆమోదం తెలిపారు. 


సర్వేతో సరి.. (విజయనగరం)
తరువాత చీపురుపల్లి మండల కేంద్రంలో కొంతభాగంలో ఏర్పాటు చేయాలని మార్పుచేశారు. మండలం మొత్తంగా నిర్మించాలన్న నేతల సూచనలతో నిలిచిపోయింది. 2017-18లో నియోజకవర్గానికో పంచాయతీ చొప్పున బొబ్బిలి మండలం పారాది, చీపురుపల్లి, గజపతినగరం, జి.ఎల్‌.పురం, పూసపాటిరేగ మండలం రెల్లివలస, పార్వతీపురం మండలం నర్సిపురం, సాలూరు నియోజకవర్గం మెంటాడ, ఎస్‌.కోట పంచాయతీలను ఎంపికచేశారు. ఎనిమిది పంచాయతీలకు మొత్తంగా 91.82 కిలో మీటర్ల మేర రూ.20.70 కోట్లలో ప్రతిపాదనలు పంపించారు.రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒకటి మాత్రమే ఎంపికచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నీ మరుగున పడిపోయాయి. 2018-19లో జిల్లాలో గంట్యాడ మండలం బోనంగి, గరివిడి మండలం కొండపాలెం రెండు పంచాయతీల్లో నిర్మాణాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ప్రతిపాదనల స్థానంలో వీటికి కొత్తవి అధికారులు సిద్ధం చేశారు.గంట్యాడ మండలం బోనంగి, రూర్బన్‌మిషన్‌ కింద ఎంపిక చేసిన గరివిడి కొండపాలెం పంచాయతీలకు మొత్తంగా రూ.12.45 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. బోనంగి పంచాయతీలో 4.3 కిలో మీటర్లు మేర నిర్మాణానికి రూ.3 కోట్లు, రూర్బన్‌ పథకంలో గరివిడి మండలం కొండపాలెంలో 21.4 కిలో మీటర్లకు రూ.9.45 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.యూజీడీని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు తొలుతగా ప్రతిపాదనలను రూపొందించారు. తరువాత 2018-19లో నిర్వహణ దృష్ట్యా గ్రామీణ నీటిసరఫరా విభాగానికి (ఆర్‌డబ్ల్యూఎస్‌) బదలాయించారు. ప్రస్తుతం ఎంపిక చేసిన పంచాయతీల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలోనే అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ శాఖే దీన్ని పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వం నుంచి ఆమోదం మేరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. జిల్లాలో సుప్రీం, కిరణ్‌ఇన్‌ఫ్రా సంస్థలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. వీరంతా సర్వే చేసి డీపీఆర్‌ ఇవ్వాల్సి ఉందియూజీడీ నిర్మాణం ఖర్చుతో కూడుకోవడంతో పాటు నిర్మాణాలు కష్టమే. ఇప్పటికే సి.సి.రోడ్లు నిర్మాణాలు జరగడంతో వాటిని పైప్‌లైన్ల కోసం రోడ్లు మధ్యలో తవ్వకాలు చేయాల్సి ఉంది. పైప్‌లైన్లు వేసిన తర్వాత మళ్లీ వాటిని పూడ్చాలి. ఇదంతా శ్రమతో పాటు అదనపు వ్యయం కానుందని అధికారులు పేర్కొంటున్నారు. గత ప్రతిపాదనల సమయంలో ఈ విషయాన్నే ప్రస్తావించారు. జిల్లాలో 2014-15 నుంచి ఇప్పటి వరకు సుమారు 1400 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణాలు పూర్తిచేశారు. దీంతో వీటి నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రయోగాత్మకంగానైనా వీటిని నిర్మించేందుకు పెద్దమొత్తంలో వెచ్చించనున్నట్లు అధికారులు బదులిస్తున్నారు.

No comments:

Post a Comment