Breaking News

17/06/2019

తీరాన్ని కాపాడుకోవాలి (గుంటూరు)

బాపట్ల, జూన్ 17  (way2newstv.in): 
జిల్లాలో బాపట్ల మండలం అడవిపల్లెపాలెం నుంచి రేపల్లె మండలం లంకెవానిదిబ్బ వరకు 43 కి.మీ. పొడవైన తీర ప్రాంతం ఉంది. బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లో సముద్రంలో చేపల వేటపై ఆధారపడి 21 వేల మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నిజాంపట్నం హార్బరు కేంద్రంగా పెద్దఎత్తున చేపల వేట సాగుతోంది. నిత్యం వేల సంఖ్యలో వేట పడవల్లో వెళ్లి భారీగా చేపలు, రొయ్యలను వలల్లో పట్టి ఒడ్డుకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. చేపలు చాలా బలవర్థకమైన ఆహారం. మంచి పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నాయి. సముద్రం నుంచి వచ్చే వెనుకజలాల ఆధారంగా 9 వేల హెక్టార్ల చెరువుల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏటా రూ.500 కోట్ల విలువైన చేపలు, రొయ్యల ఉత్పత్తి చేస్తున్నారు. తీర ప్రాంతంలో రొయ్య పిల్లల హేచరీలు, ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రొయ్య పిల్లలను గుజరాత్‌, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబంగకు ఎగుమతి చేస్తున్నారు. రొయ్య ఉత్పత్తులు కృష్ణపట్నం, చెన్నై నౌకాశ్రయాల ద్వారా అమెరికా, యూరప్‌, ఆసియా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 

తీరాన్ని కాపాడుకోవాలి (గుంటూరు)

రూ.వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని అర్జించి పెడుతున్నాయి.సూర్యలంక ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఎదుగుతోంది. లక్షల సంఖ్యలో పర్యాటకులు ఈ బీచ్‌లో విహారానికి వచ్చి సంతోషంగా గడుపుతున్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ప్రముఖ బీచ్‌కు ఎదిగింది. సముద్ర తీరంలో సూర్యోదయ, సూర్యాస్తమయంలో ఆహ్లాదకర దృశ్యాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తీర ప్రాంతంలో ప్రైవేటు రిసార్ట్స్‌ నిర్మాణం జోరుగా సాగుతోంది. భవిష్యత్తులో తీర ప్రాంతం పర్యాటకానికి గొప్ప కేంద్రంగా ఎదిగి అభివృద్ధికి చోదకశక్తిగా మారనుంది. ఆతిథ్య రంగంలో పరిశ్రమలను ఆకర్షించి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. సముద్రం భద్రతపరంగా కీలకపాత్ర పోషిస్తోంది.రెండు దశాబ్దాలుగా సముద్ర కాలుష్యం విపరీతంగా జరుగుతోంది. రొయ్యల చెరువులు, ఆక్వా పరిశ్రమల నుంచి ప్రమాదకర రసాయనాలు సాగరంలో కలుస్తున్నాయి. దీని వల్ల చేపలు, అరుదైన సముద్రజీవులు చనిపోతున్నాయి. జిల్లాలోని తీర ప్రాంతంలోనూ కాలుష్యం స్థాయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రొయ్యల హేచరీల నుంచి కలుషిత జలాలను ఎసీ్టీపీీ ప్లాంట్లలో పూర్తి స్థాయిలో శుద్ధి చేయకుండానే సముద్రంలోకి వదిలి పెడుతున్నారు. రొయ్యల చెరువుల నుంచి కలుషిత నీరు మురుగు కాల్వల్లో చేరి సముద్రంలోకి వెళ్తోంది. ఫలితంగా మత్స్య సంపద అంతరిస్తోంది. పర్యాటకులు ప్లాస్టిక్‌ వ్యర్థాలను తీరంలో పడేస్తున్నారు. దీని వల్ల డాల్ఫిన్లు, ఆలివ్‌రిడ్లే తాబేళ్లు, ఇతర అరుదైన జీవరాశులు చనిపోతున్నాయి. కాలుష్యం బారి నుండి సముద్రాన్ని కాపాడుకోకుంటే మానవాళి మనుగడకే పెనుముప్పు ఏర్పడే ప్రమాదముంది. పర్యాటక, వినోద రంగాలు, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలో కలవకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రమాదకర రసాయనాలను సాగరంలో కలిపే వారిపైన కఠినచర్యలు తీసుకోవాలి.

No comments:

Post a Comment