Breaking News

27/05/2019

లాంతరుకు చీకటినిచ్చిన బీహార్ వాసులు


పాట్నా, మే 27(way2newstv.in)
లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండటం, ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవడం రాష్ట్రీయ జనతాదళ్ కు తెలిసొచ్చింది. బీహార్ లో ఎన్డీయే దుమ్ము లేపింది. ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేక లాలూ లాంతరు చతికలపడింది. లాలూ యాదవ్ కుటుంబాన్ని బీహారీలు నమ్మలేదన్న విషయం మరోసారి నిజమైంది. నితీష్ కుమార్ బీజేపీతో జత కట్టినా అక్కడి ప్రజలు తప్పుపట్టలేదు. పైగా ఆశీర్వదించారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో రాష్ట్రీయ జనతాదళ్ లో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా లాలూ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వియాదవ్ అన్నీ తానై ఉప ఎన్నికల్లో వ్యవహరించారు. అక్కడ గెలవడంతో లాలూ సయితం పార్టీ పగ్గాలు తేజస్వి యాదవ్ కే అప్పగించారు. ఇక్కడ గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగడ్బంధన్ ఏర్పడింది. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ కలసి పోటీచేసి అధికారంలోకి వచ్చాయి. లాలూ యాదవ్ కుమారులిద్దరూ మంత్రి వర్గంలో ఉన్నారు. అయితే వారిపై అవినీతి ఆరోపణలు ఇబ్బడి ముబ్బడిగా రావడంతో నితీష్ కుమార్ తట్టుకోలేకపోయారు. 


లాంతరుకు చీకటినిచ్చిన బీహార్ వాసులు
మంత్రి పదవికి రాజీనామా చేయించాలని లాలూను కోరారు. లాలూ ససేమిరా అనడంతో నితీష్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత కమలం పార్టీ స్నేహ హస్తం అందించడంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ నితీష్ కుమార్ బీజేపీతో కలసి ప్రయాణం చేసి అన్ని సీట్లను కొల్లగొట్టేశారు.ఇక రాష్ట్రీయ జనతా దళ్ కూడా కూటమిని ఏర్పరచుకుంది. ఈ కూటమికి కూడా తేజస్వి యాదవ్ నేతృత్వం వహించారు. మొత్తం ఇరవై స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసింది. కాంగ్రెస్ కు తొమ్మది, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి నాలుగు, మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్థాని ఆవామీ మోర్చాకు మూడు, లోక్ తాంత్రిక్ జనతాదళ్ కు రెండు, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించారు. అయితే ఎక్కడా వీరు ప్రతిభ కనపర్చలేకపోయారు. మొత్తం 40 స్థానాల్లో 39 స్థానాల్లో ఎన్డీయే విజయకేతనం ఎగురవేసింది. తేజస్వి యాదవ్ వ్యూహం ఈ ఎన్నికల్లో తలకిందులయింది.ఆర్జేడీ పూర్తిగా నష్టపోవడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో నెలకొన్నవిభేదాలు ఒకకారణంగా చెప్పొచ్చు. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ లాలూ,రబ్రీ పేరిట కొత్త పార్టీని పెట్టి అభ్యర్థులను రంగంలోకి దించారు. దీంతో కుటుంబంలో ఉన్న విభేదాలు కొంప ముంచాయంటున్నారు. అలాగే సీపీఎం లాంటి పార్టీలను కూడా పట్టించుకోలేదు. బీహార్ లోని బెగూసరాయ్ నియోజకవర్గం టిక్కెట్ ను సీపీఎం కన్హయ్యకుమార్ కోసం అడిగినా ఆర్జేడీ అంగీకరించలేదు. అలాగే నితీష్ పాలనకు ప్రజలు ఫిదా అయినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేంద్రంలో ఏర్పడబోయే కాంగ్రెస్ సర్కార్ లో కీలకమవుదామని భావించిన తేజస్వి యాదవ్ ఆశలుపై బీహారీలు నీళ్లు గుమ్మరించారు.

No comments:

Post a Comment