Breaking News

27/05/2019

తెలంగాణ నుంచి కేబినెట్ లో దక్కేది ఎవరికి...

హైద్రాబాద్, మే 27  (way2newstv.in)
దేశంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలంగాణ నుంచి కేంద్రం మంత్రివర్గంలో ఎవరికి ప్రాతినిథ్యం లభిస్తుందన్నది ప్రస్తుతం బిజెపి వర్గాల్లో వాడివేడి చర్చ సాగుతోంది. రాష్ట్రం నుంచి నాలుగు లోక్‌సభ స్థానాల్లో బిజెపి అభ్యర్ధులు ఘన విజయం సాధించారు. వారిలో సికింద్రాబాద్ నుంచి జి. కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయంబాపురావు, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్‌లు ఉన్నారు. అయితే అందరికంటే ముందు వరసలో కిషన్‌రెడ్డి ఉన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ సికింద్రాబాద్ నుంచి విజయం సాధించిన దత్తాత్రేయకు మంత్రివర్గంలో అవకాశం దక్కేది. ప్రస్తుతం కూడా అదే సంప్రదాయం కొనసాగించే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. 

తెలంగాణ నుంచి కేబినెట్ లో దక్కేది ఎవరికి...
పైగా మొదటి సారిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన కిషన్‌రెడ్డికి పార్టీ హైకమాండ్‌లో మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఆయనను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లు కూడా మంత్రి పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. నిజమాబాద్ సిఎం కెసిఆర్ కూతురు కవితను ఓడించినందుకుగానూ పార్టీ హైకమాండ్ ధర్మపురికి కేంద్రమంత్రివర్గంలో స్థానం తప్పకుందా లభిస్తుందని ఆయన అభిమానులు, అనుచరవర్గాలు విశ్వసిస్తున్నాయి. అలాగే కరీంనగర్ నుంచి వినోద్‌పై గెలుపొందిన బండి సంజయ్ కూడా మంత్రివర్గంలో చోటు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ముగ్గురిలో ఎవరికి స్థానం లభిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. మరో రెండు, మూడు రోజులు గడిస్తే తప్ప ఎవరికి చోటు లభిస్తుందన్న అంశంపై ఒక క్లారిటి వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో మాదిరిగానే మరోసారి సికింద్రాబాద్ నుంచి గెలిచిన అభ్యర్ధికే కేంద్రమంత్రి వర్గంలో స్థానం కల్పించే సంప్రదాయాన్ని పార్టీ అధిష్టానం కొనసాగిస్తుందా? లేదా? అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment