Breaking News

20/01/2020

తెల్లబంగారానికి విత్తనాల కొరత

మహబూబ్ నగర్, జనవరి 20, (way2newstv.in)
తెల్ల బంగారం’గా రైతులు పరిగణించే పత్తిపంట తాజాగా పెద్ద సమస్యల వలయంలో చిక్కుకుంది. రైతులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడాల్సి వస్తోంది.  ఖరీఫ్  సీజన్‌లో పత్తి పంట వేసేందుకు విత్తనం కరవైంది.  గత ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణలో దాదాపు 48 లక్షల ఎకరాల్లో ఈ పంట వేశారు. ప్రతి సంవత్సరం తెలంగాణలో సాగయ్యే మొత్తం విస్తీర్ణంలో పత్తిపంట విస్తీర్ణమే దాదాపు సగం వరకు ఉంటోంది. ఈ ఏడాది విత్తనం దొరికితే 40 లక్షల ఎకరాల్లో పత్తివేసే అవకాశాలున్నాయి. ఇంత విస్తీర్ణంలో పత్తి వేయాలంటే కనీసం కోటి ప్యాకెట్ల పత్తివిత్తనం కావాలి. మార్కెట్లో విక్రయించే పత్తి విత్తనం ప్యాకెట్లు రెండు లేదా మూడు అయితే ఒక్కో ఎకరానికి సరిపోతుంది. ఈ లెక్కన 40 లక్షల ఎకరాల్లో పత్తి వేసేందుకు కోటి ప్యాకెట్ల విత్తనం అవసరం అవుతుంది. ఈ సంఖ్య కొద్దిగా ఇటూ అటూ కావచ్చు. మార్కెట్లో ప్రస్తుతం ఏ రకమైన పత్తివిత్తనం లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 
తెల్లబంగారానికి  విత్తనాల కొరత

తెలంగాణలో  దశాబ్దకాలంగా రైతులు బిటి-1 (బిజి-1), బిటి-2 (బిజి-2) పత్తి వేస్తూ వస్తున్నారు. బిజి-1 ఇప్పుడు మార్కెట్లో లేదు. ఈ స్థానం బిజి-2 ఆక్రమించింది.  ఖరీఫ్ సీజన్‌లో బిజి-2 పత్తివిత్తనమే 48 లక్షల ఎకరాల్లో వేశారు. బోల్‌వార్మ్‌ను తట్టుకునే శక్తి ఈ విత్తనానికి ఉందన్న ఉద్దేశంతో రైతులంతా ఇదే విత్తనాన్ని వేశారు. అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థ అయిన ‘మోన్‌శాంటో’ మాత్రమే బిజి-2 టెక్నాలజీని అభివృద్ధి చేసింది. భారత్‌లోని ‘మహికో’ అనే సంస్థతో మోన్‌శాంటో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పత్తిపంటకు తెగులు సోకకుండా జన్యుపరమైన సాంకేతిక విజ్ఞానాన్ని మహికోకు అందచేస్తోంది. ఈ విజ్ఞానమే భారత్‌లోని వివిధ విత్తన కంపెనీలు ఉపయోగించి బిజి-2 విత్తనం ఉత్పత్తి చేయించి విక్రయిస్తున్నాయి. దాదాపు 20 కంపెనీల వరకు మహికో నుండి సాంకేతిక పరిజ్ఞానం తీసుకుంటున్నాయి. ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నందుకు మోన్‌శాంటోకు డబ్బు చెల్లిస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రైతులు ఖరీఫ్‌లో వేసిన బిజి-2 విత్తనం విఫలమైంది. అంతకు ముందు నాలుగైదు సంవత్సరాల నుండి కూడా ఈ విత్తనం వేస్తున్నప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున విఫలం కాలేదు. గులాబిరంగు పురుగు బిజి-2 పంటలపై దాడి చేయడంతో పంట బాగా దెబ్బ తిన్నది. పత్తిపంటకు ఏ పురుగు రాకుండా బిజి-2 రకం నివారిస్తుందని మార్కెట్లో ప్రవేశపెట్టారో అదే పురుగు బిజి-2 పంటలపై దాడి చేసింది. దాంతో పత్తి ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. రైతులు తీవ్రమైన నష్టానికి గురయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం విత్తన కంపెనీలపై వివిధ రూపాల్లో వత్తిడి తీసుకువచ్చి, బిజి-2 పత్తివేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించింది. తెలంగాణలో మాత్రం రైతులకు ఎలాంటి పరిహారం అందలేదు. ఇక్కడ సమగ్ర విత్తన చట్టం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పత్తి వేసే రైతులు ఒక్కో ఎకరాపై 25 వేల రూపాయల వరకు పెట్టుబడి పెడతారు. దిగుబడి బాగా వస్తే ఒక్కో ఎకరాలపై పెట్టుబడి పోను, 25 వేల నుండి 30 వేల రూపాయల వరకు లాభం ఉంటుంది

No comments:

Post a Comment