వరంగల్, జనవరి 20,(way2newstv.in)
ఒక చదరపు గజం స్థలం ధర అక్షరాల రూ.10వేలు. ఇది భూమి కొనుగోలు రేటు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సమ్మక్కసారలమ్మ మహాజాతర సమయంలో నెలరోజులు వినియోగించుకోవడానికి చదరపు గజం స్థలానికి చెల్లించాల్సిన అద్దె మాత్రమే. జాతర సమీపిస్తుండటంతో మేడారంలో భూముల అద్దె క్రమేణా పెరుగుతున్నది. ఇప్పటికే రూ.15 వేలకు ఎగబాకింది. మరో నాలుగైదు రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. మహాజాతర ప్రారం భం కావడానికి ఒకటి రెండురోజుల ముందు ఇక్కడ కొన్ని చోట్ల చదరపు గజం స్థలం కిరాయి రూ.15 వేలకు పెరుగడం ఖాయమని వ్యాపారులు చెప్తున్నారు. మహాజాతర ప్రారంభం కావడానికి 20రోజుల ముందు నుంచే చిరువ్యాపారులు మేడారం దారిపడుతారు. సుమారు కోటి మంది భక్తులు వచ్చే ఈ జాతరలో వ్యాపారం కోసం పోటీపడతారు.
సమ్మక్క సారలమ్మ జాతరలో అద్దె 15 వేలు
కోళ్లు, బెల్లం, పసుపు, కుంకుమ, దారాలు, హోటళ్లు, బేకరీలు, కూల్‌డ్రింక్స్, మిఠాయి, కొబ్బరి, ఆటవస్తువులు, సీడీ పాయింట్లు, లిక్కర్, కంగన్‌హాల్స్, పాన్‌షాప్, జనరల్ స్టోర్స్, జ్యూస్ పాయింట్లు, కళ్లజోళ్లు, క్లాత్‌స్టోర్స్, ఫుట్‌వేర్ తదితర దుకాణాలు ఇక్కడ నిర్వహిస్తారు. ఈ దుకాణాల నిర్వహణ కోసం మేడారంలోని స్థానికుల భూములను నెల రోజుల కోసం అద్దె పద్ధతిన తీసుకుంటారు. 2016 జాతర సమయంలో ఇక్కడ చదరపు గజం స్థలం అద్దె రూ.10వేలు దాటింది. మహాజాతర ప్రారంభానికి రెండు రోజుల ముందు చదరపు గజం 12 వేల రూపాయలకు ఎగబాకింది. పదిహేను రోజుల క్రితం నుంచే వివిధ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో చిరువ్యాపారులు మేడారం చేరుతున్నారు. ఈసారి తొలుత చదరపు గజం స్థలం అద్దె రూ.6వేలు పలికింది. ప్రస్తుతం ఈ ధర రూ.8వేలకు చేరింది. మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణం నుంచి జంపన్నవాగు, రెడ్డిగూడెం, మేడారం, ఆర్టీసీ కాంప్లెక్స్, చిలుకలగుట్టకు వెళ్లే రహదారులకు రెండు వైపులా ఉన్న భూముల అద్దె మండిపోతున్నది. మరో నాలుగైదు రోజుల్లో ఈ రహదారులకు రెండు వైపులా ఉన్న భూముల అద్దె రూ.10వేలు దాటే అవకాశం ఉందని చిరువ్యాపారులు తెలిపారు. 28వ తేదీ వరకు చదరపు గజం స్థలం అద్దె రూ.15వేలు పలుకుతుందంటున్నారు. జంపన్నవాగు నుంచి మేడారంలోని గద్దెల ప్రాంగణానికి వెళ్లే ప్రధాన రహదారిలో కొద్దిదూరం వరకు చదరపు గజం స్థలం అద్దె ఇప్పటికే రూ.10వేలకు చేరినట్టు చెప్తున్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం, జంపన్నవాగు, ఆర్టీసీ కాంప్లెక్స్‌కు దూరంగా ఉన్న భూముల అద్దె చదరపు గజానికి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పలుకుతున్నది. ఇలాంటి భూములను వ్యాపారులు మ్యాజిక్ షోలు, తాత్కాలిక మినీథియేటర్, ఫొటో స్టూడియోలు, రంగులరాట్నం, సర్కస్ నిర్వహణ కోసం అద్దెకు తీసుకుంటున్నారు. వివిధ రాష్ర్టాల నుంచి ఇప్పటికే వేలాది మంది చిరువ్యాపారులు మేడారంలో దిగారు.
No comments:
Post a Comment