Breaking News

30/01/2020

షాకులిస్తున్న సైబర్ క్రైం

హైద్రాబాద్, జనవరి 30, (way2newstv.in)
డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతైతే విస్తరిస్తోందో అదే స్థాయిలో సైబర్ నేరాలు, మోసాలు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఉగ్రవాదం, తీవ్రవాదం కన్నా ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది సైబర్ నేరాలు, మోసాలే. ఆ దేశం ఈ దేశం అంటూ ఏదీ లేదు, అన్ని దేశాలకు సైబర్ క్రైం షాకిస్తోంది. ఇంటర్నెట్ ఆధారంగా సైబర్ చోరులు ఎక్కడో ఉండి, మరెక్కడి నుంచో మోసాలకు పాల్పడుతున్నారు. బాధితులు జాగ్రత్త పడేలోగా దోచేస్తున్నారు. అన్ని దేశాల్లో సంప్రదాయ నేరాలు తగ్గుతున్నా, సైబర్ నేరాలు మాత్రం ఏటేటా పుంజుకుంటున్నాయి. సంప్రదాయ నేరాలను అడ్డుకునేందుకు తగిన వ్యూహం ఆయా రాష్ట్రాల పోలీసులకు ఉన్నా సైబర్ క్రైం విషయంలో ఇంకా అంత అడ్వాన్స్ కాలేదు. సైబర్ నేరాల ద్వారా జరిగే నష్టం రానున్న 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఆరు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సైబర్ సెక్యూరిటీ విభాగాలు అంచనా వేస్తున్నాయి. 
షాకులిస్తున్న సైబర్ క్రైం

ఒక్క హైదరాబాద్ నగరంలోనే 2018-19లో రూ.14 కోట్ల మేర సైబర్ చోరులు పౌరుల సొమ్ము దోచుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్నది మాత్రం రూ.52 లక్షలే. బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలను ఖాతాదారుకు తెలియకుండా కొట్టేయడం, డెబిడ్, క్రెడిట్ కార్డుల క్లోనింగ్, ఆన్‌లైన్ విక్రయాల్లో చీటింగ్, లాటరీ తగిలిందని, పెద్ద మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయంటూ తప్పుదారి పట్టించే సమాచారం, నియామక పత్రాలు జారీ వంటి రక రకాల మోసాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంకా సోషల్ మీడియా వేదికగా అయితే అమాయకులను చాలా తేలిగ్గా మోసగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయం, వాట్సప్‌లలో చాటింగ్ ఇలా మాట్లాడే వాళ్లొకరు, కనిపించే వారొకరు ఉంటూ, రోజుకో సిమ్ కార్డు మారుస్తూ దొరికిన వారిని అడ్డంగా దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటలు ఇటీవల బాగా పెరిగాయి.అన్నీ తెలుసని చెప్పుకునే వాళ్లే సైబర్ నేరగాళ్ల చేతుల్లో అధికంగా మోసపోతున్నారు. ఇక ఆన్‌లైన్‌లో మహిళలకు వేధింపులు, సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు ఇవన్నీ కూడా సైబర్ నేరాల కిందే పరిగణిస్తున్నారు. తాజాగా బ్యాంకుల నుంచి పోన్ చేస్తున్నామంటూ అమాకులైన వారిని టార్గెట్ చేసుకుని ఎటిఎం పిన్ నెంబర్లు, బ్యాంక్ అక్కౌంట్లు, ఇంకా వీలు చిక్కితే వన్‌టైం పాస్‌వర్డ్ వంటివాటిని అడిగి మరీ బ్యాంకుల్లో డబ్బు కొల్లగొడుతున్నారు. ఇలాంటి నేరాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు ప్రత్యేక సైబర్ నేర నిరోధక విభాగాలను బలోపేతం చేసునే పనిలో ఉన్నాయి. ఇందుకు పోలీసు శాఖలు ప్రత్యేక నిధులను కేటాయించి ప్రత్యేక నిపుణుల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న దేశంగా భారత్ ఐదవ స్ధానంలో నిలిచింది. తెలంగాణ పోలీస్ తాజాగా వెల్లడించిన గణాంకాల్లో సైతం సైబర్ నేరాల శాతం పెరిగింది. సంప్రదాయ నేరాలు తగ్గాయని వెల్లడైంది. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాష్ట్రాల హోంశాఖలు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేశాయి. కేంద్ర హోంశాఖ అందిస్తున్న సహకారంతో తెలంగాణ హోంశాఖ ప్రత్యేక శిక్షణ అందించనుంది. కానిస్టేబుల్ శిక్షణ నుంచి మొదలుకుని అన్ని స్థాయిల్లో డిజిటల్ పరిశోధన, ఆన్‌లైన్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా జరిగే అక్రమాలు, మొబైల్ ఆధారంగా జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఇందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో వంటి సంస్థలు అందించే అప్లికేషన్స్‌ను ద్వారా వినియోగించుకోబోతున్నాయి. పోలీసు సిబ్బందికి ఇచ్చే శిక్షణలోనే సిసిటివిల ద్వారా నేరాలను అడ్డుకోవడం, భద్రతకు ఎలాంటి భరోసా కల్పించాలనే కోణంలో ప్రత్యేక శిక్షణ మాడ్యుల్స్‌ను రూపొందించి అమలు చేస్తున్నారు. సైబర్ క్రైం జరిగితే పరిశోధన చేసి ఆ నేరగాళ్ల ఆచూకీ తెలుసుకునేందుకే పోలీసులకు సమయం ఎక్కువ పడుతుంది. నేరగాళ్లు ఒక చోట ఉండి, నేరం మరో చోట చేస్తారు.బాధితులు మరెక్కడో ఉంటారు. ఇలా రాష్ట్రం, దేశాలు దాటి పోతున్న నేరగాళ్లకు చెక్ పెట్టడం, దోచుకున్నది వసూలు చేయడం సైబర్ పోలీసులకు కత్తిమీద సాముగా మారింది. దేశం దాటి వెళ్లిన వాళ్లను తీసుకు రావడం అసలు సాధ్యం కావట్లేదు. ఢిల్లీ, ముంబయి, గోవా, ఇలా ఎక్కడెక్కడి నుంచో ఉన్న కొందరు నైజీరియన్లు, ఇతర ఆఫ్రికన్ దేశ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి ఒక్కో సారి ఒక్కో కోణంలోనేరం చేస్తున్నారు. ఏ రూపంలో సైబర్ క్రైం జరుగుతుందో ఊహించడం కష్టమే.

No comments:

Post a Comment