Breaking News

05/12/2019

ఏపీలో పొలిటికల్ హీట్ హీట్

విజయవాడ, డిసెంబర్ 5 (way2newstv.in)
దేశంలో ఇపుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడా రాజకీయం ఉంది. కానీ ఏపీలోలా పొలిటికల్ సీన్లు అసలు లేవ‌ని అందరూ చెబుతారు. ఇలా ఎందుకు అనాల్సివస్తుందంటే ఏపీలో ఎన్నికలు ఉన్నా లేకపోయినా కూడా నాయకులు మైకులను, రోడ్లను పట్టుకుని వదలడంలేదు. పొరుగున కర్నాటకలో చూసినా, తమిళనాడులో చూసుకున్నా కూడా దేవగౌడ, కుమారస్వామి, డీఎంకే స్టాలిన్ ఇలా ఎవరూ ప్రతీ రోజూ రోడ్లను కొలవరు, మీటింగులు అంటూ జనాన్ని బోరెత్తించరు. కర్నాటకలో ఎన్నికలు ఎపుడొస్తాయో తెలియదన్న పరిస్థితి ఉంది. తమిళనాడులో చూసుకుంటే 2021లో ఎన్నికలు ఉన్నాయి. అయినా అక్కడ రాజకీయ నాయకులు ఇలా వరస టూర్లు చేయడంలేదు, వేడి రాజేయ‌డంలేదు. ఏపీలో అందుకు భిన్నం, రేపో ఎల్లుండో ఎన్నికలు అన్నట్లుగా అటు టీడీపీ, ఇటు జనసేన అధినాయకులు తెగ హడావుడి పడిపోతున్నారు.
ఏపీలో పొలిటికల్ హీట్  హీట్

 ఎక్కడికక్కడ మీటింగులు పెడుతున్నారు. ఆవేశకావేశాలు ప్రదర్శిస్తున్నారు.మంచో చెడ్డో జనం ఒక పార్టీకి ఓటేసి గెలిపించాక సహనంతో కొన్నాళ్ళు మౌనంగా ఉంటే తప్పేంటో ఈ రాజకీయ పార్టీలకు అర్ధం కావడం లేదన్న చర్చ సాగుతోంది. జగన్ నచ్చకపోయినా ఆయన్ని అయిదేళ్ళు ముఖ్యమంత్రిగా భరించాలన్న ప్రజాస్వామికమైన ఆలోచన ఉన్నట్లుగా కూడా కనిపించడంలేదని అంటున్నారు. తెల్లారి లేస్తే జగన్ మీద విమర్శలు విసుర్లు, ట్విట్టర్ లో సెటైర్లు, మీడియా మీటింగులు, ఆ మీదట మైకులు పుచ్చుకుని సదస్సుల పేరిట ఒకటే ఊకదంపుడు. దీని వల్ల వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటో ఆ పార్టీల అధినేతలే చెప్పాలి. నిజానికి క్యాడర్ కి తెలిసినంతగా కూడా నాయకులకు తెలియదేమోనని సెటైర్లు పడుతున్నాయి. ఏం చేసినా జగన్ అధికారంలోకి వచ్చారు. కొన్నాళ్ళు కామ్ గా ఉండడమే బెటర్ అని క్యాడర్ హుందాతనాన్ని ప్రదర్శిస్తోంది. . కానీ వారిని సైతం మీ వెనక మేమున్నాం, ఎవరు వస్తారో చూస్తాం బస్తీమే సవాల్ అంటూ ఈ రెచ్చగొట్టుడు ఏంటన్నదే విస్తుగొలిపే విషయమని అంటున్నారు.ముఖ్యమంత్రి జగన్ తక్కువ మాట్లాడుతారు, అది ఆయనకు మొదటి నుంచి ఉన్న అలవాటు, మీడియా ముందుకు అసలు రాని జగన్ తన భావాలను ఏదైనా ప్రభుత కార్యక్రమాల్లోనే పంచుకుంటారు. తనకు మానవత్వమే మతం, మాట తప్పకపోవడమే కులం అని జగన్ అన్నారు. తన కులం, మతం మీద రోజూ రాజకీయ రచ్చ చేస్తున్న వెకిలి రాతలకు, నేతల నోటి దూకుడుకు జగన్ ఒక్కటే మాటగా జవాబు చెప్పారు. అయినా ఏపీలో కులాల కుంపట్లు చాలవన్నట్లుగా మతాల చిచ్చు రేపాలా అని మేధావులు సైతం ఆవేదన చెందుతున్నారు. ఏపీ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం, అన్ని మతాల వారు కలసిమెలసి ఉంటున్నారు. మరి వారి మధ్య అగ్గి రాజేస్తే రేపటి రోజున జరిగే అనర్ధాలకు బాధ్యుడెవరన్నది కూడా ఆలోచించాలిగా. లౌకిక రాజ్యంలో ఏవరైనా సీఎం కావచ్చు, నాడు నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, వైఎస్సార్ అయ్యారు. నాడు లేని మతాల గొడవ ఇపుడు ఎందుకు వస్తోంది అని అన్నవారూ ఉన్నారు. ఏది ఏమైనా విపక్షాలు కాలం కాని కాలంలో రాజకీయ విమర్శలకు దిగడం, హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు పాల్పడడం చూస్తున్న జనాలకు ఏమీ తెలియవు అనుకోవడమే ఇక్కడ పొరపాటు.

No comments:

Post a Comment