Breaking News

18/10/2019

తెలుగు రాష్ట్రాల్లో ద్రవిడ రాజకీయాలు

హైద్రాబాద్, అక్టోబరు 18, (way2newstv.in)
దేశంలో రాజకీయాలు వేరు, తెలుగు రాజకీయాలు వేరు. అక్కడ ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ వేరే పార్టీకి పట్టం కట్టడం తెలుగు రాష్ట్రాలకే చెల్లింది. దీనికి ఎన్నో ఉదాహరణలు గతంలో ఉన్నాయి. 1977లో దేశమంతా జనతా ప్రభంజనం వీస్తే ఇక్కడ మాత్రం కాంగ్రెస్ జెండా ఎగిరింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత 1983లో తెలుగుదేశం రూపంలో ప్రాంతీయ పార్టీ పుట్టుకురావడానికి కూడా జాతీయ పార్టీల పట్ల వ్యతిరేకతే ప్రధాన కారణమైంది. ఇక 1984 లోక్ సభ ఎన్నికలు చూసుకుంటే దేశమంతా ఇందిరాగాంధి దారుణ హత్య సానుభూతిలో మునిగి కాంగ్రెస్ కు 400 పై చిలుకు ఎంపీలను ఇచ్చాయి. ఉమ్మడి ఏపీలో మాత్రం 35 ఎంపీ సీట్లను సాధించి తెలుగుదేశం ఏకంగా లోక్ సభలోనే అతి పెద్ద ప్రతిపక్ష హోదా సంపాదించింది.
తెలుగు రాష్ట్రాల్లో ద్రవిడ రాజకీయాలు

ఇదంతా ద్రవిడ ప్రభావంగా చెప్పుకోవాలి. ద్రవిడ ఉద్యమం తమిళ నాట 19వ శతాబ్దిలో రాజుకున్న తరువాత పొరుగున ఉన్న రాష్ట్రాలు కూడా ఆ ప్రభావానికి లోను అవుతూ వచ్చాయి. మొదట 60 దశకంలో తమిళ‌నాట ప్రాంతీయ శక్తులు రాజకీయ అధికారం సంపాదిస్తే తరువాత కాలంలో తెలుగు రాజకీయాల్లోనూ ఆ ప్రభావం జోరైంది. తెలుగులో అప్పటి ప్రముఖ నటుడు ఎన్టీయార్ పార్టీ పెట్టడానికి తమిళనాడు ఎంజీయార్ ప్రభావం గట్టిగా ఉందన్నది ఈ సందర్భంగా మరువరాదు. ఈ క్రమంలో కాంగ్రెస్ కి బలమైన కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఏపీని బద్దలు కొట్టిన ఘనత అన్న నందమూరిదేనని చెప్పాలి. ఆ ప్రభావంతో అలా తగ్గుతూ వచ్చిన కాంగ్రెస్ విభజన పుణ్యమాని ఏపీ, తెలంగాణాలలో రెండు చోట్లా దెబ్బతింది. అక్కడ టీఆర్ఎస్, ఇక్కడ తెలుగుదేశం, ఇపుడు వైసీపీ అధికారాన్ని చలాయిస్తున్నాయి, జాతీయ పార్టీలు సోదిలోకి కూడా రాని నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జెండా ఎగురవేయాలని బీజేపీ కలలు కంటోంది.ఒంటరిగా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడం ఇపుడున్న పరిస్థితుల్లో జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీకి అసలు సాధ్యపడదు అని గట్టిగా చెప్పాలి. ఎందుచేతనంటే తెలుగు రాజకీయాల్లో ప్రాంతీయ అజెండా గట్టిగా ఉందిపుడు. దేశంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ ఇక్కడ తమకు అందుబాటులో ఉండే రీజనల్ హీరోకే పట్టం కట్టాలన్న ఓ విధమైన కల్చర్ నాలుగు దశాబ్దాల కాలంలో వేళ్ళూనుకుంది. దానికి తోడు కులాలు, ప్రాంతీయ సమీకరణలు ఇలా చాలా కధ నడుస్తోంది. ప్రాంతీయ పార్టీలు వాటిని పట్టుకుని గట్టెక్కుతున్నాయి. ప్రజలు కూడా తమ ప్రాంతం, కులం అనుకుంటూ గద్దెనెక్కిస్తున్నారు. జాతీయ పార్టీలతో అది కుదిరే వ్యవహారం కాదు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చెప్పలేరు, అయినా ఎన్నాళ్ళు ఉంటారో అసలు చెప్పలేరు, ఇక ఫేస్ వాల్యూ ఉన్న నాయకులు కూడా బీజేపీలో లేరు. బీజేపీ బలం ఇప్పటికీ ఏపీలో నామమాత్రమేనని అంతా అంగీకరించే విషయం. ఈ దశలో 2014 ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లను పొత్తు ద్వారా సంపాదించి బీజేపీ పోటీకి దిగాలేమో కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను వానిష్ చేస్తామన్న బిగ్ టాస్క్ ని మాత్రం సాధించలేదన్న మాట వినిపిస్తోంది.

No comments:

Post a Comment