Breaking News

11/10/2019

ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలి

జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి
పెద్దపల్లి, అక్టోబర్ 11 (way2newstv.in):
జిల్లాలో ఖరీఫ్ 2019 కి సంబంధించిన ధాన్యాన్ని ప్రణాళిక ప్రకారం రైతుల వద్ద నుండి కొనుగోలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై శుక్రవారం ఆమె కలెక్టరేట్ లోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో 80760 హెక్టార్లలో వరి ధాన్యం రైతులు పండిస్తున్నారు అని, సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని, రైతుల వద్ద నుండి కనీస మద్దతు ధర చెల్లించి జిల్లాలో కనీసం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా పక్కా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.  
ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలి

దాన్యం కొనుగోలు చేయడానికి 48 ఐకేపీ కేంద్రాలు, 152 ప్రాథమిక వ్యవసాయ కొనుగోలు కేంద్రాలను మొత్తం 200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో అవసరమైన కనీస వసతులు సిద్ధం చేసుకోవాలని అధికారులను జాయింట్  కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, ప్రతిరోజు కొనుగోలు చేసే ధాన్యం వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని, ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్ని బ్యాగులు వివరాలు, టార్ ఫిన్ కవర్లను సిద్ధం చేసుకోవాలని, ధాన్యం నాణ్యత గుర్తించే తేమ మీటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో సరిచూసుకోవాలి అని అధికారులకు జాయింట్ కలెక్టర్ సూచించారు.  కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, రైతులకు కలిగే సమస్యలపై ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని, 08728 224117 నెంబర్ కు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఫోన్ చేసి ఫిర్యాదులను తెలియజేయ వచ్చునని జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పండే వరి ధాన్యం యొక్క నాణ్యతను వ్యవసాయ విస్తరణ అధికారులు పరీక్షించాలని, పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులకు గుర్తింపు కార్డులను వ్యవసాయ అధికారులు రైతు సమన్వయ సమితి సభ్యుల సమన్వయంతో అందించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.  రైతులంతా ఓకే కొనుగోలు కేంద్రానికి ఒక రోజు భారీ సంఖ్యలో ధాన్యం తీసుకుని రాకుండా, క్రమ పద్ధతి ప్రకారం రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకుని వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారంతో పకడ్బందీగా అమలు చేయాలని , ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా పోలీసు సిబ్బంది సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బందికి సాప్ట్ వేర్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నాణ్యమైన వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలు కనీస అవసరాలైన మంచినీరు, నీడ, టాయిలెట్స్ తదితర ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే ధాన్యం యొక్క నాణ్యత విషయంపై రైతులలో విస్తృత అవగాహన కలిగేలా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఉన్న 197 రైస్ మిల్లులో దాదాపు వెయ్యి కోట్ల విలువగల ధాన్యం దిగుబడి అవుతుందని, వాటికి సంబంధించి ఎలాంటి రుణాలు మంజూరు చేయకుండా లీడ్ బ్యాంక్ మేనేజర్ చర్యలు తీసుకోవాలని, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ నుండి నో డ్యూ సర్టిఫికెట్ ఉంటే మాత్రమే రైస్ మిల్లులకు రుణాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద  హమాలీల కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అధికారులు హమాలీల తో  సమావేశం ఏర్పాటు చేయాలని, అందులో నిబంధనలను వారికి సంపూర్ణంగా అవగాహన కలిగే విధంగా వివరించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 2.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ప్రస్తుతం నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అంచనా వేస్తున్నామని, దాదాపు ధాన్యం దిగుబడి రెండింతలు అయిందని, వీటి సేకరణకు పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని, గ్రేడ్ల వారీగా దాన్ని విభజించి రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలని, ప్రభుత్వం మద్దతు ధరను కొంత మేర పెంచింది , గ్రేడ్ ఎ రకం ధాన్యానికి రూ.1835/-, సాధారణ రకం వరి ధాన్యానికి రూ.1815/- మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.డి సి పి సుదర్శన్ గౌడ్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశం, జిల్లా సహకార అధికారి చంద్రప్రకాష్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ప్రవీణ్, ఎడిఎ కృష్ణారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాం రెడ్డి , జిల్లా రవాణా అధికారి ఆఫ్రీన్ సిద్ధికి, లేబర్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు

No comments:

Post a Comment