Breaking News

11/10/2019

విజయవాడ టూ హైద్రాబాద్ 2 వేలు

విజయవాడ,అక్టోబరు 11 (way2newstv.in):
దసరా పండుగ ఏమో కానీ ప్రయాణికులకు ప్రయాణ చార్జీల మోత మాత్రం తప్పలేదు. పండుగ రద్దీ ఒకటి ఉంటేనే చార్జీలు అమాంతం పెరిగిపోతుంటాయి. ఈ సారి టీఎస్‌ఆర్టీసీ రూపంలో ప్రయాణికులకు మరో షాక్ తగిలింది. దీంతో రైళ్లన్నీ ఫుల్‌. వెయిటింగ్ లిస్టు కూడా చాంతాడంత ఉంది. దీంతో ప్రైవేటు ఆపరేటర్లు చార్జీలను విపరీతంగా పెంచేశారు. ఇక కాస్త అదనంగా డబ్బు పెట్టుకోగలిగిన వారు విమాన ప్రయాణానికి మొగ్గుచూపారు. దీంతో పండుగ ప్రభావం విమాన చార్జీలపైనా పడింది. ప్రధానంగా ఏపీ నుంచి హైదరాబాద్‌కి వచ్చే ఫ్లైట్‌ టిక్కెట్ ధరలు ఆకాశాన్నంటాయి. విమాన ప్రయాణ చార్జీలు ఒకేసారి పది, పదిహేను రెట్లు పెరగడం గమనార్హం.రైళ్లలో బెర్తులు దొరక్కపోవడం, టీఎస్ ఆర్టీసీ సమ్మెతో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరిగింది. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే విమానాల చార్జీలు అమాంతంగా పెరిగిపోయాయి. 
విజయవాడ టూ హైద్రాబాద్ 2 వేలు

హైదరాబాద్ నుంచి ముంబై ఫ్లైట్ చార్జీ సుమారు రూ.3 వేలుగా ఉంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కూడా నాలుగు వేలలోపే విమాన చార్జీలు ఉన్నాయి. కానీ ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి మాత్రం చార్జీల ధరలు ఐదంకెలకు చేరాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖ నగరాల నుంచి వచ్చే ఫ్లైట్ చార్జీలు పది వేలకు పైనే ఉండడం గమనార్హం.దసరా సెలవులకు ఇంటికెళ్లిన తిరిగి వచ్చే ప్రయాణికులతో విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడంతో గంటగంటకూ విమాన టిక్కెట్ల ధరలు పెరిగిపోయాయి. అత్యధికంగా రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టిక్కెట్ రూ.25 వేలకు చేరింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కి టిక్కెట్ ధర రూ.18 వేలుగా నమోదైంది. అలాగే విశాఖ నుంచి రూ.12 వేలు, తిరుపతి నుంచి రూ.8 వేలు పలికింది. కొన్ని సర్వీసులకు అసలు టిక్కెట్ దొరక్కపోవడం విశేషం

No comments:

Post a Comment