చెన్నై, సెప్టెంబర్ 26, (way2newstv.in)
మరోసారి ఉప ఎన్నికల సమరంతో రాజకీయాలు తమిళనాడులో హీటెక్కాయి. ఇప్పటికే లోక్ సభ, శాసనసభ ఉప ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించిన డీఎంకే ఈ రెండు ఉప ఎన్నికల్లోనూ గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. తమిళనాడులో నాంగునేరి, విక్రంవాడి శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలూ ఈ రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపి విజయం సాధించాలని ప్రయత్నాలు ప్రారంభించాయి.ముఖ్యంగా డీఎంకే లో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఉత్సాహం అలుముకుంటోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక మినహాయిస్తే మిగిలిన అన్ని ఎన్నికల్లో డీఎంకే విజయబావుటా ఎగురవేసింది. ఈ రెండు ఎన్నికల్లోనూ గెలిచి వచ్చే శాసనసభ ఎన్నికలకు పునాదులు పటిష్టపర్చుకోవాలని స్టాలిన్ భావిస్తున్నారు.
ఉప ఎన్నికల్లో స్టాలిన్ కొడుకు పొలిటికల్ ప్రవేశం
ఇదిలా ఉండగా విక్రంవాడి నియోజకవర్గం నుంచి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.ఇప్పటికే డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఉదయనిధిని ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలని పార్టీ వర్గాల నుంచే వత్తిడి వస్తుండటం గమనార్హం. వాస్తవానికి కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూర్ నియోజకవర్గం నుంచే ఉదయనిధిని పోటీ చేయించాలని స్టాలిన్ భావించారు. కానీ అప్పట్లో అది కుదరలేదు. కుటుంబానికి తాను ప్రాధాన్యత ఇస్తున్నానన్న అపవాదు రాకూడదని స్టాలిన్ జాగ్రత్త పడ్డారు.అయితే ఈసారి పార్టీ నుంచి ఉదయనిధిని పోటీ చేయించాలని డిమాండ్ పెరుగుతంది. స్టాలిన్ రాజకీయ వారసత్వాన్ని ఉదయనిధి తీసుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరో రెండేళ్లు సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నందున అప్పటి వరకూ ఆగకుండా ఉదయనిధిని ఉప ఎన్నికల్లోనే పోటీ చేయించాలని కొందరు సీనియర్ నేతలు కూడా స్టాలిన్ కు సూచించినట్లు తెలుస్తోంది. అయితే స్టాలిన్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నియోజకవర్గంలో పార్టీ నేతల్లో అసంతృప్తి లేకుండా స్టాలిన్ ఉదయనిధిని రాజకీయంగా ఎదగనివ్వాలని భావిస్తున్నారు. మరి ఉదయనిధికి స్టాలిన్ ఈ ఉప ఎన్నికల్లో అవకాశం ఇస్తారా? లేదా? అన్నది త్వరలోనే తేలనుంది.
No comments:
Post a Comment