Breaking News

26/09/2019

యడ్డీపై అధిష్టానం గురిపెట్టిందా...

బెంగళూర్, సెప్టెంబర్ 26, (way2newstv.in)
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను పార్టీ అధిష్టానం నమ్మడం లేదా? ఆయనను విశ్వసించకపోవడానికి కారణాలేంటి…? యడ్యూరప్పకు ఇదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం. ఆయన వయసు రీత్యా చూసినా మరోసారి ఎలాంటి ముఖ్యమైన పదవి బీజేపీలో దక్కే అవకాశం లేదు. పార్టీ నియమ నిబంధనలను పక్కన పెట్టి మరీ యడ్యూరప్పను అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది దీనిని యడ్యూరప్ప దుర్వినియోగం చేసే అవకాశముందని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుందన్న వార్తలు పార్టీలో జోరుగా విన్పిస్తున్నాయి.కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ వేళ్లూనుకోవడానికి యడ్యూరప్ప చేసిన కృషి అన్నది అందరూ అంగీకరించే విషయమే. 
యడ్డీపై అధిష్టానం గురిపెట్టిందా...

లింగాయత్ వర్గ నాయకుడిగా బీజేపీని కర్ణాటకలో యడ్యూరప్ప పటిష్టం చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉంది. దీనికి పార్టీ కిందిస్థాయి క్యాడర్ తో పాటు యడ్యూరప్ప నాయకత్వం కూడా అందుకు కారణమని చెప్పక తప్పదు.అందుకే ఏడు పదుల వయసు దాటినా ఆయనకు కర్ణాటక ముఖ్యమంత్రిగా కేంద్రనాయకత్వం అవకాశం ఇచ్చింది. అయితే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యడ్యూరప్ప పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చిన చరిత్ర యడ్యూరప్పది. అయితే ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత యడ్యూరప్పపై అధిష్టానానికి మరింత అనుమానాలున్నట్లున్నాయి. మంత్రి వర్గ విస్తరణ దగ్గర నుంచి చివరకు పదవుల కేటాయింపు కూడా అధిష్టానమే దగ్గరుండి చూసుకుంటుంది. ఇక తాజాగా జరిగే అభ్యర్థుల ఎంపిక కూడా హైకమాండ్ తన చేతుల్లోకి తీసుకుంది.ముఖ్యమంత్రిగా యడ్యూరప్పతో పాటు ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను ఆయనకు చెక్ పెట్టేలా అధిష్టానం నియమించింది. ఇదిలా ఉండగానే యడ్యూరప్పను ఫాలో అవ్వడానికి, ఆయన నిర్ణయాలను ఎప్పటికప్పుడు బేరీజు వేయడానికి సంఘ్ పరివార్ కు చెందిన గణేష్ కార్నిక్ ను ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించింది. ఒక సంఘ్ నేతను సీఎం ముఖ్యసలహాదారుగా నియమించడం వెనక యడ్యూరప్ప పై నమ్మకం లేకపోవడమే కారణమంటున్నారు. ఎటువంటి అవినీతికి తావివ్వకుండా పాలన సాగించాలన్న కారణంగానే యడ్యూరప్ప పై నిఘా ఉంచడానికే ఈ నియామకం చేపట్టినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మరి డౌటు లేదంటునే అధిష్టానం యడ్యూరప్పపై నిఘా పెడుతుంది ఎందుకనేదే ప్రశ్న.

No comments:

Post a Comment