Breaking News

26/09/2019

ఆలస్యమైతే... మరింత భారం కానున్న పోలవరం

ఏలూరు, సెప్టెంబర్ 26, (way2newstv.in)
పోలవరం... ఏపీకి జీవనాడి కిందే లెక్క. గతంలో ఏళ్ల తరబడి మూలన పడిపోయిన ఈ ప్రాజెక్టు ఎలాగోలా ప్రారంభం కాగా... వైఎస్ ఫ్యామిలీ వ్యవహారం కారణంగా ఈ ప్రాజెక్టు వ్యయం అంతకంతకూ పెరిగిపోవడంతో పాటుగా అసలు భరించలేనంత భారంగా మారిపోయిందన్న వాదన కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించిన నేతగా గొప్పలు చెప్పుకున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవహారం కారణంగా పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.10 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.55 వేల కోట్లకు పెరిగిపోయింది. ఇప్పుడు వైఎస్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార సరళి కారణంగా ఆ భారం మరింతగా పెరిగిపోతోందని చెప్పక తప్పదు. టీడీపీ హయాంలో అవినీతి కారణంగా పోలవరం నిర్మాణంలో దుబారా జరిగిందని తేల్చేసిన జగన్...
ఆలస్యమైతే... మరింత భారం కానున్న పోలవరం

ఇప్పుడు రివర్స్ టెండర్లకు వెళ్లి... ఏకంగా రూ.782 కోట్లను ఆదా చేసినట్లుగా జబ్బలు చరుచుకుంటున్నారు కదా. రివర్స్ తో రూ.782 కోట్ల ఆదా కాదు కదా. ప్రాజెక్టు వ్యయం ఏకంగా రూ.7,500 కోట్ల మేర పెరుగుతోందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరే... ఈ తతంగం ఏమిటో కాస్తంత వివరంగా చూద్దాం పదండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం వద్ద గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ఉద్దేశించినదే పోలవరం ప్రాజెక్టు. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టాలెక్కింది. జలయజ్హంలో భాగంగా పోలవరం పనులను ప్రారంభించినట్టు కలరింగ్ ఇచ్చిన వైఎస్ కాలువలను మాత్రం తవ్వించారు. దీనికే వేలాది కోట్ల నిధులను వెచ్చించారు. తీరా రెండో పర్యాయం అధికారం చేపట్టిన తర్వాత వైఎస్... అప్పటిదాకా పనులు కొనసాగిస్తున్న మధుకాన్ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేయడంతో పోలవరం పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆ తర్వాత రోశయ్య గానీ, కిరణ్ కుమార్ రెడ్డి గానీ పట్టించుకోకపోవడంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి ఈ ప్రాజెక్టు వ్యయం రూ.10 వేల నుంచి ఏకంగా రూ.55 వేల కోట్లకు చేరిపోయింది. అయినా కూడా రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ఏపీకి అత్యవసరమని భావించిన చంద్రబాబు... నిధుల లేమి ఉన్నా ప్రాజెక్టు నిర్మాణానికే పూనుకున్నారు. కేంద్రం సాయం చేసినా, మొండిచేయి చూపినా చంద్రబాబు ముందుకే సాగారు. ప్రాజెక్టు పనులను నవయుగకు అప్పగించి ఇప్పటికే 63 శాతం పనులను పూర్తి చేయించారు.ఈ లోగా ఎన్నికలు రావడంతో టీడీపీ అధికారం కోల్పోగా... కొత్త సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. వచ్చీ రాగానే చంద్రబాబు తప్పులను బయటపెట్టడమే లక్ష్యంగా సాగిన జగన్... పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, దానిని వెలికి తీస్తానని ప్రకటించడంతో పాటుగా ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్న నవయుగ కంపెనీని పనుల నుంచి తప్పించేశారు. రివర్స్ టెండరింగ్ పేరిట జగన్ సర్కారు చేపట్టిన కొత్త తరహా టెండర్ల ద్వారా నిర్దేశిత వ్యయం కంటే రూ.782 కోట్ల తక్కువకు పనులను పూర్తి చేసేందుకు జగన్ సామాజిక వర్గానికి చెందిన కృష్ణారెడ్డికి చెందిన మేఘాకు పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రివర్స్ తో పోలవరంలో వందల కోట్ల మేర ఆదా చేస్తున్నామని జబ్బలు చరుచుకుంటున్న జగన్... దానిని తనకు మాత్రమే సాధ్యమైన పనిగా చెప్పుకుంటున్నారు. అయితే రివర్స్ పేరిట జగన్ సాగిస్తున్న కొత్త విధానం వల్ల పోలవరం నిర్మాణంలో ఆదా కాకుండా... జగన్ సర్కారు ఆదా అని చెప్పుకుంటున్నయ దానిని ఏకంగా పది రెట్ల మేర అదనపు భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్క ఎలాగన్న విషయాన్ని కూడా ఇంజినీరింగ్ నిపుణులు క్లియర్ గానే చెబుతున్నారు. వారి లెక్క ప్రకారం... రివర్స్ టెండరింగ్ తో పోలవరం నిర్మాణ వ్యయం రూ.7,500 కోట్ల మేర పెరుగుతుందట. ఈ మేర వ్యయం పెరగడానికి దారి తీసే కారణాలు ఏవంటే... 15 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి నష్టం రూ.6 వేల కోట్లు కాగా ఉన్నపళంగా పనుల నుంచి తప్పించిన నవయుగకు నష్టపరిహారం కింద రూ.1,000 కోట్లు చెల్లించాల్సి ఉందట. ఇక ఎత్తిపోతల కరెంట్ బిల్లు ఏడాదికి రూ.300 కోట్ల మేర ఉంటుందట. అదే సమయంలో 5 శాతంగా ఉన్న బ్యాంకు గ్యారెంటీని 2.5 శాతానికి తగ్గించడం వల్ల రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందట. వెరసి మొత్తంగా రివర్స్ టెండరింగ్ కారణంగా పోలవరం వ్యయం రూ.7,500 కోట్ల మేర పెరుగుతుందని నిపుణులు పక్కా లెక్కలతోనే చెబుతున్నారు. అంటే... నాడు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం కారణంగా పోలవరం వ్యయం రూ.10 వేల కోట్ల నుంచి రూ.55 వేల కోట్లకు పెరిగితే... ఇప్పుడు జగన్ అనుసరిస్తున్న రివర్స్ టెండరింగ్ తో పోలవరం వ్యయం రూ.7,500 కోట్ల మేర పెరుగుతుందన్న మాట. ఇక ప్రాజెక్టు నిర్మాణం ఏమాత్రం ఆలస్యమైనా ఈ నష్టం అంతకంతకూ పెరగడం ఖాయమేనని కూడా నిపుణులు డేంజర్ బెల్స్ వినిపిస్తున్నారు.

No comments:

Post a Comment