Breaking News

23/09/2019

దసరా కోసం ముస్తాబవుతున్న పర్యాటక కేంద్రాలు

విజయవాడ, సెప్టెంబర్ 22, (way2newstv.in)
దసరా ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడ వచ్చే భక్తులు నగరంలోని సందర్శనీయ ప్రాంతాలను చూసేందుకు, ఆహ్లాదం, వినోదం పొందేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక సందర్శనీయ ప్రాంతాలను తీర్చిదిద్దాలని భావిస్తోంది. దసరా ఉత్సవాలకు ఈ ఏడాది దాదాపు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు నగర పరిసరాల్లోని సందర్శనీయ స్థలాలను వీక్షించటానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అలాంటి వారి కోసం ఇక్కడి పర్యాటక విశేషాలను పరిచయం చేసేందుకు పర్యాటక శాఖ, ఏపీటీడీసీ, బీఐటీసీ తదితర శాఖల భాగస్వామ్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా పర్యాటక సంస్థ అధిపతిగా కలెక్టర్‌ ఇంతియాజ్ నిర్ణయించారు.
దసరా కోసం ముస్తాబవుతున్న పర్యాటక కేంద్రాలు

దసరా ఉత్సవాలకు వచ్చే సందర్శకులకు ఈ ఏడాది కొత్తగా కొండపల్లి అడవిలోని అందాలను పరిచయం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలోని సీతాకోక చిలుకల పార్క్‌ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు. ఇక్కడ దాదాపు 52 రకాల సీతాకోక చిలుకల జాతులను, కొండ కోనల మధ్య అందమైన జలపాతాలను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు. ఇక్కడ పర్యాటకులు సేదతీరేందుకు వీలైన ఏర్పాట్లు చేపట్టాలని కూడా నిర్ణయించారు. దసరా ఉత్సవాలకు ముందుగానే ఇందుకు ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయించారు.మూలపాడు సీతాకోక చిలుకల పార్క్‌, కొండపల్లి ఫారెస్ట్‌ జలపాతాల సోయగాలకు సంబంధించి విస్తృతంగా జరుగుతున్న ప్రచారంతో ఇటీవల సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. రాజధాని ప్రాంతంలో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా సహజ ప్రకృతి సౌందర్యంతో అలరారే వీటికి మరింత విశేష ప్రాచుర్యాన్ని కల్పించటానికి జిల్లా యంత్రాంగం దసరా ఉత్సవాలను ఒక వేదికగా చేసుకోవాలని భావిస్తోంది. స్వరాజ్య మైదానంలో భారీ ఎగ్జిబిషన్‌ నిర్వహించాలని జిల్లా యంత్రాంగం ఆలోచన చేస్తోంది. వినోదం, ఆహ్లాదాన్ని పంచేలా ఫన్‌జోన్‌, ఆసక్తికరమైన వినోద క్రీడలు, పిల్లల కోసం జెయింట్‌ వీల్స్‌, హస్త కళా దుకాణాలు, ఫుడ్‌ ఫెస్టివల్స్‌ అన్నీ ఈ మెగా ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉత్సవాల పది రోజుల పాటు భక్తులు సందర్శించటానికి వీలుగా ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు.భవానీ ద్వీపం, హరిత బెర్మ్‌పార్క్‌లలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. హరిత బెర్మ్‌పార్క్‌లో శిల్పారామం ఎగ్జిబిషన్‌ వంటివి నిర్వహించటానికి ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. ద్వీపంలో ఈ ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ద్వీపంలో ఇటీవల కొత్త అందాలు వచ్చాయి. మినీ జంగిల్‌, రోబోటిక్‌ పార్క్‌, ఓపెన్‌ జిమ్‌, ఓపెన్‌ మ్యూజికల్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌, కిడ్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ జోన్‌, మేజ్‌ గార్డెన్‌, గోల్ఫ్‌ కోర్స్‌, బర్డ్స్‌ ఎరీనా వంటివి అనేకం తీర్చిదిద్దారు.

No comments:

Post a Comment