Breaking News

23/09/2019

సీమ నుంచి కమలంలోకి వలసలు

తిరుపతి, సెప్టెంబర్ 23, (way2newstv.in)
మరో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా? అవును ఈ విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి, జీవీఎల్ నరసింహారావు చెప్పారు. జీవీఎల్ చెప్పిన మాటను తేలిగ్గా కొట్టిపారేయలేం. చాలా మంది టీడీపీ నేతలు ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకులకు టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. చివరకు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కోడెల శివప్రసాద్ సయితం బీజేపీ నేతలతో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి టీడీపీ నుంచి బీజేపీలో చేరబోయే ఆ మాజీ ఎంపీ ఎవరన్నది టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.జీవీఎల్ నరసింహారావు రాయలసీమలో ఈ ప్రకటన చేశారు. 
సీమ నుంచి కమలంలోకి వలసలు

అంటే రాయలసీమకు చెందిన టీడీపీనేతే బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ విషయానికి వస్తే ఇప్పటికే టీడీపీ తరుపున కడప ఎంపీగా పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. ధర్మవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కమలం తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జీవీఎల్ ప్రకటనతో ఆ ఎంపీ ఎవరన్న చర్చ జరుగుతోంది. అయితే రాయలసీమ నుంచి మాత్రమే టీడీపీ మాజీ ఎంపీ ఒకరు బీజేపీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇందులో రెండు పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. ఒకటి జేసీ దివాకర్ రెడ్డి. ఈయన ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. అయినా తనయుడు ఓటమితో ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఇటీవల మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. మోదీని అడ్డుకునేవారు ఇప్పట్లో లేరని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారా? ఆయన కేంద్ర నాయకులతో మాట్లాడారా? అన్న చర్చ జరగుతోంది. జేసీ మాత్రం తాను బీజేపీలో చేరేది లేదని చెబుతున్నారు.ఇక మరో మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి వరసగా రెండు సార్లు ఓటమి పాలు కావడం, ఇటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. రాయలసీమలో కోట్ల లాంటి నేత వస్తే పదవి ఇచ్చేందుకు బీజేపీ రెడీగా ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రాయలసీమ సమస్యలపై ఫోకస్ పెట్టిన బీజేపీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. మరి కోట్ల చేరతారా? జేసీ చేరతారా? అన్నది త్వరలోనే తేలనుంది. మొత్తం మీద రాయలసీమలో మరో బిగ్ వికెట్ టీడీపీ నుంచి పడటం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది.

No comments:

Post a Comment