Breaking News

23/09/2019

పురంలో నిద్రౌతున్న పురపాలన

అనంతపురం, సెప్టెంబర్ 22, (way2newstv.in)
ఓవైపు వాతావరణంలో మార్పులు మరోవైపు పెచ్చు మీరిన దోమలు. దీంతో ఎక్కడ చూసిన జ్వర పీడితులు ముక్కుతూ ములుగుతూ వైద్య సేవలు పొందుతున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్ తదితర విష జ్వరాలు అధికమవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.సెలెక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తింపు పొందిన హిందూపురంలో ఫాగింగ్ ఆనవాళ్లు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. గత కొంతకాలం క్రితం మొక్కుబడిగా మూడు రోజులపాటు ఫాగింగ్ నిర్వహించి అనంతరం చేతులెత్తేశారు. పట్టణంలో ఎక్కడ చూసినా దోమలు విపరీతంగా పెచ్చుమీరిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
పురంలో నిద్రౌతున్న పురపాలన

మున్సిపల్ అధికారులు సక్రమంగా దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్లే జ్వరాలు విజృంభిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రధాన రహదారుల పక్కన ఉన్న డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో దుర్వాసనతోపాటు దోమలు పెరిగిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కనీసం ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి దోమల నివారణ, పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాసుపత్రికి తోడు ప్రైవేటు నర్సింగ్ హోంలు, క్లీనిక్‌లు కూడా కిక్కిరిసిపోతున్నాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఔట్ షెషేంట్ విభాగంలో నమోదైన వివరాలను పరిశీలిస్తే అధిక శాతం జ్వర బాధితులు ఉండటం గమనార్హం. ఇందులో విష జ్వరాల బారిన పడ్డ చిన్నారుల సంఖ్యే అధికంగా ఉంటోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురు మాత్రమే చిన్నపిల్లల వైద్య నిపుణులు ఉండగా అధిక సంఖ్యలో వ్యాధుల బారినపడ్డ చిన్నారులు చికిత్స నిమిత్తం వస్తున్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి హిందూపురంతోపాటు మడకశిర, పెనుకొండ నియోజకవర్గాలతోపాటు సమీపంలోని కర్నాటక ప్రాంతాల నుండి కూడా రోగులు చికిత్స నిమిత్తం వస్తున్నారు. అయితే వైద్యులు కూడా సామర్థ్యానికి మించి వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా జ్వరాలు సోకిన చిన్నారుల్లో విపరీతమైన నీరసం, కాళ్లు, చేతుల నొప్పులు భరించలేకపోతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇకపోతే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యాధికారులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల విభాగంలో ముగ్గురు వైద్యులు మాత్రమే ఉండగా రోజూ దాదాపు 400 మంది దాకా వైద్య సేవలు అందిస్తున్నారు. రోగులకు వైద్య సేవలు అందించేందుకు అటు వైద్యులు, ఇటు సిబ్బంది అనేక ఇబ్బందులుపడుతున్నారు. కాగా పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రైవేటు క్లీనిక్‌లు, నర్సింగ్ హోంలలో కూడా కింద పడుకోబెట్టి వైద్య సేవలు అందించాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కొందరు చిన్నారులకు స్థానికంగా వైద్య పరీక్షల అనంతరం జ్వరాలు తీవ్రంగా ఉండటంతో హుటాహుటిన వారిని బెంగళూరు, టుంకూరు తదితర ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. కాగా ఆసుపత్రి అంటేనే పారిశుద్ధ్యం మెరుగుపై దృష్టి సారించాల్సి ఉండగా దాని గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. దీనికి తోడు దోమల సంఖ్య కూడా అధికంగా ఉంటున్నట్లు చికిత్స పొందుతున్న బాధితులు వాపోతున్నారు.

No comments:

Post a Comment