Breaking News

29/08/2019

గంటా బాటలో అవంతి

హైద్రాబాద్, ఆగస్టు 30, (way2newstv.in)
భీమునిపట్నం మంత్రుల నియోజకవర్గం. ఇక్కడ నుంచి గెలిచిన వారు మంత్రులు అవుతారు. అది కాంగ్రెస్ నుంచి వస్తున్న సంప్రదాయం. కాంగ్రెస్ జమానాలో పద్మనాభరాజు మంత్రి అయ్యారు. తరువాత టీడీపీ హయాంలో పూసపాటి ఆందగజపతిరాజు, ఆర్ ఎస్ డీపీ అప్పలనరసింహరాజు. గంటా శ్రీనివాసరవు, వైసీపీ ఏలుబడిలో అవంతి శ్రీనివాసరావు మంత్రులుగా ఉన్నారు. అయితే గతంలో మంత్రులుగా పనిచేసిన వారంతా లోకల్ క్యాండిడేట్లు అయితే గంటా, అవంతి వరకూ వచ్చేసరికి మాత్రం నాన్ లోకల్ ఎంట్రీ ఇచ్చినట్లైంది. అప్పట్లో మంత్రులుగా చేసిన వారు తమ నివాసంలోనే క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని నిరంతరం పార్టీ నాయకులకు, ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవారు. వారు మంత్రులైనా సరే భీమిలీలోనే నివాసం ఉండేది. 
గంటా బాటలో అవంతి

మరి గంటా వంటి హైటెక్ మంత్రి జమానాలో మాత్రం మంత్రులు విశాఖలో కాపురం ఉంటూ రాజధానికి తిరుగుతూ ఉంటే వారికి బదులుగా ఇంచార్జుల పాలనని తీసుకువచ్చారు. రాజ్యాంగంలో ఈ వెసులుబాటు ఉందో లేదో తెలియదు కానీ గంటా అయిదేళ్ళ పాలనంతా ఇంచార్జిని భీమిలీలో పెట్టి కధ నడిపించారు.ఆ విధంగా తీసుకుంటే గంటా మంత్రిగా ఉన్నపుడు మొదటి మూడేళ్ళు ఆయన దగ్గర చుట్టం పరుచూరి భాస్కరరావు ఇంచార్జిగా ఉంటూ చక్రం తిప్పారు. ఆయనే అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించేవారు. అదే విధంగా ప్రారంభోత్సవాలు కూడా కొన్ని చేశారు. ఇక ఆయన్ని తప్పించి తన మేనల్లుడుని చివరి రెండేళ్ళు ఇంచార్జిగా గంటా పెట్టుకున్నారు. ఆయన సైతం ఇదే విధంగా డిఫ్యాక్టో ఎమ్మెల్యేగా మంత్రిగా రాజ్యం చేశారు. దాంతో గంటాకు జనంతో డైరెక్ట్ కాంట్రాక్టులు లేకుండా పోయాయి. మరో వైపు అనుచరుల భూ దందాలు, అవినీతి ఆరోపణలు మంత్రిగారికి చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి అది చివరికి ఎంతవరకూ వచ్చిందంటే దాదాపుగా నలభై వేల మెజారిటీతో గెలిపించిన భీమిలీని గంటా విడిచివెళ్ళేంతవరకూ సాగింది. ఇక గంటా సహచరుడైన అవంతి శ్రీనివాసరావు టీడీపీ నుంచి వైసీపీలోకి దూకి ఎమ్మెల్యేగా నెగ్గారు. కోరుకుంటున్నట్లుగా మంత్రి కూడా అయ్యారు. ఇక ఇపుడు భీమిలీలో మరో ఇంచార్జి పాలన మొదలైంది. మంత్రి అవంతి తరఫున ఆయన చుట్టం ముత్తంశెట్టి మహేష్ ని ఇంచార్జిగా తాజాగా నియమించారు. ఆయన పార్టీని, పాలనను రెండూ చూసుకోవాలన్నమాట. ఓ విధంగా మంత్రి ఎక్కడో ఉండి రిమోట్ కంట్రోల్ చేస్తారు. ఆయన ఎక్కడో ఉంటూ భీమిలీకి రావడం తగ్గించేస్తారన్న మాట. ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించిన ప్రజలకు ఇంచార్జిల పాలన ఇవ్వడం ఎంతవరకూ సబబు అని టీడీపీ అనలేని పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీ కూడా అదే చేసింది కనుక. ఇక ఇంచార్జిలను నియమించడం వల్ల వారు హక్కుగానే అన్నీ తీసుకుంటారు. బాధ్యతలు పట్టించుకోరు. పైగా వారికి తోచినట్లుగా వ్యవహరిస్తూ మంత్రికే చెడ్డ పేరు తెస్తారు.అధికార దుర్వినియోగం బాగా జరుగుతుంది. చివరికి మంత్రికే ఎక్కడ లేని చెడ్డ పేరు వస్తుంది. గంటా ఎపిసోడ్ ని చూసి అయినా అవంతి జాగ్రత్త పడితే బాగుండేది అంటున్నారు. మంత్రి గారి ఇంచార్జి పేరు మీద కూడని పనులు ఏవి చేసినా కూడా బాధ్యత వహించాల్సింది అవంతి మాత్రమే. అవంతి తాను జనాలకు అందుబాటులో ఉంటే బాగుండేది అన్న మాట వైసీపీ వర్గాలలో నుంచే వస్తోంది. మరి ఈ కొత్త మంత్రి గారి కొత్త ఇంచార్జి పాలన ఎలా సాగుతుందో చూడాలి.

No comments:

Post a Comment