నిజామాబాద్, జూలై 25, (way2newstv.in)
రాష్ట్ర వ్యవసాయ రంగం కూలీల కొరతను తీవ్రంగానే ఎదుర్కొంటోంది. ఒక గ్రామంలోని రైతులు చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి అధిక కూలీ చెల్లించిమరీ కూలీలను తెచ్చుకుంటున్నారు. దీనికి అవసరమైన రవాణా వ్యయం కూడా సంబంధిత రైతులే భరిస్తున్నారు. వారికోసం ట్రాక్టర్ లేదా ఆటోలు మాట్లాడి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ వేతనం ఇచ్చినా కూలీలు దొరకడం కష్టమవుతోంది. ఒకరోజు కాకపోయినా మరొక రోజైనా కూలీలు దొరుకుతారేమోనని వ్యవసాయదారులు ఆశాభావంతో ఉన్నారు. అయితే ఆలస్యమైతే పంటలు చెడిపోతాయేమోనన్న ఆందోళన కూడా వెంటాడుతోంది. అందుకే ఎక్కువ కూలీ వెచ్చించేందుకూ వెనకాడటం లేదు. విత్తనాలు, ఎరువులు, పొలం దున్నడానికయ్యేదానికంటే ఎక్కువగా కూలీలకే ఖర్చవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కూలీలు దొరక్క రైతుల ఇబ్బందులు
వానాకాలం సాగు, వరినాట్లు, పత్తి, కంది పంటలలో కలుపు తీస్తున్న సందర్భంగా ‘మన తెలంగాణ’ ప్రతినిధి మెదక్, సిద్ధిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లగా రైతులు తాము సాగు చేస్తున్న పంటలకు ప్రధానంగా కూలీల కొరతను ఎదుర్కొంటున్నట్లు కూలీల సమస్య ప్రధానంగా పత్తి, వరి, కంది సాగు చేసే ప్రాంతాల్లో ఉంది. పత్తి విత్తడానికి, అందులో కలుపు తీయడానికి, ఎరువు వేసేందుకు, నాట్లు వేసేందుకు కూలీల అవసరం పడుతోంది. రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే పంటలలో పత్తి ఒకటి. ఇప్పటికే 39 లక్షల ఎకరాల్లో సాగు నమోదైంది. ఇక వరి విషయానికొస్తే నారు ఎవరికి వారే తీసుకుంటుండగా, నాట్లు వేయడానికి మూడు, నాలుగు రోజుల ముందే కూలీలకు అడ్వాన్సులు ఇచ్చి పొలానికి తెచ్చుకోవాల్సి వస్తుందని పలువురు రైతులు వాపోయారు.వ్యవసాయంలో కూలీల కొరత ఏర్పడటానికి కారణాలపై రైతులతో మాట్లాడగా ‘ఈ తరం వాళ్లెవరూ నాట్లు వేసేందుకు, కలుపు తీసేందుకు ముందుకు రావడం లేద’ని బదులిచ్చారు. చాలా వరకు పట్టణాలకు, గ్రామా ల చుట్టు పక్కల ఉండే కంపెనీలలో పనులకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. సాధారణంలో సీజన్‌లో ఒక్క మహిళ కూలీకి రూ. 250 నుంచి రూ. 300 వరకు చెల్లిస్తున్నారు. ఖచ్చితంగా కూలీలు వెంటనే కావాల్సి వస్తే మాత్రం రూ. 400 వరకు చెల్లించక తప్పడంలేదు. ఏం చేస్తే కూలీల కొరత తీరుతుందనుకుంటున్నారని పలువురు రైతులను ప్రశ్నించగా, ‘ట్రాక్టర్ల లాగే కలుపు తీసేందుకు, ఎరువు వేసేందుకు మిషన్లు రావాలని కోరుకుంటున్నా’మన్నారు. అలాంటి మిషన్లు కూడా వస్తే స్థానికంగా కొందరు ఉపాధి కోల్పోతారు కదా అంటే ‘ఇంకా నాలుగైదు ఏండ్లు అయితే వ్యవసాయ పనులకు ఎవరూ వచ్చేలా లేరు. మొత్తం మిషన్‌లతోనే కదా చేసేది’ అని అంటున్నారు.
No comments:
Post a Comment