కరీంనగర్, జలై 25 (way2newstv.in):
ఉమ్మడి జిల్లాలో మొత్తం కుటుంబాలు 12,35,838 ఉండగా, 8,02,499 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 96 గ్యాస్ ఏజెన్సీలు సేవలందిస్తున్నాయి. కొత్త కుటుంబాలు ఏర్పడటం, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వలసవచ్చిన వారు ఉండటం, విద్యార్థులు, ఆయా రంగాల వారికి సిలిండర్ తప్పనిసరి. ఈ క్రమంలో కొత్త కనెక్షన్‌కు గ్యాస్ ఏజెన్సీలను సంప్రదిస్తే కనెక్షన్ అప్పుడే ఇస్తుండగా పాస్‌బుక్, కాగితాలు ఇచ్చేందుకు రోజుల తరబడి జాప్యం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్త కనెక్షన్‌కు రూ.1450 డిపాజిట్, రూ.150 రెగ్యులేటరీ డిపాజిట్, గ్యాస్ బండ రూ.709, పాస్‌బుక్‌కు రూ.60, స్టవ్ లేకుండా అయితే రూ.350 ఛార్జీ ఇవ్వాలి. ఇవన్నీ కలిపి రూ.2560 కాగా రూ.3500ల నుంచి రూ.5వేలు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అదనపు సిలిండర్ కావాలంటే రూ.2700ల నుంచి రూ.3వేలు లాగుతున్నారు. రూ.1450 డిపాజిట్, రూ.709 గ్యాస్ ధర, ఛార్జీ రూ.30 మొత్తంగా రూ.2190 తీసుకోవాలని చమురు కంపెనీల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
రాయితీ గ్యాస్ కు రెక్కలు (కరీంనగర్)
వినియోగదారు గోదాంకు వెళ్లి సిలిండర్ తీసుకుంటే రసీదులో ఉన్నదాని కన్నా రూ.19.50 మినహాయించి తీసుకోవాలి. కానీ ఇదెక్కడ అమలుకావడం లేదు. రెగ్యులేటర్ రీప్లేస్ చేసినపుడు ఉచితంగా ఇవ్వాలి. ఎన్నిసార్లు రీప్లేస్ చేసిన ఉచితంగా ఇవ్వాల్సిందే. కానీ రూ.200ల నుంచి రూ.300 వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇతర ప్రాంతాలకు బదిలీ, వలస వెళ్లినవారు తమ కనెక్షన్‌ను బదిలీ చేసుకునేందుకు చేతి చమురు సమర్పించాల్సిందే. రెగ్యులేటర్, స్టవ్ వినియోగదారే ఏజెన్సీకి వెళ్లి ఇస్తుండగా రూ.100 నుంచి రూ.200లు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడే వినియోగదారుని ఇంటికి వెళ్లి తెచ్చుకుంటే రూ.100 తీసుకోవాలి.ప్రతి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు పక్కా సమాచారం. ప్రతి 6 నెలలకోసారి సంఘం నేత పేరిట ఒకరు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా రూ.10లక్షల వరకు వసూలు చేసి పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి అందిస్తున్నట్లు చెబుతున్నారని ఓ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు ‘న్యూస్‌టుడే’కు వివరించారు. ఒకవేళ పత్రికల్లో కథనాలు వస్తే అరకొర దాడులు చేస్తుండగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల్లో బడా వ్యక్తుల జోలికి వెళ్లిన దాఖలాలే లేవు.గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో వినియోగదారులకు కనిపించేలా సేవల వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. ఏ సేవలు ఉచితం.. కనెక్షన్‌కు తీసుకునే మొత్తం.. అదనపు గ్యాస్ బండకు తీసుకునే మొత్తం వంటి వివరాలను సమగ్రంగా పేర్కొనడంతో పాటు ఫిర్యాదు నంబర్, సదరు చమురు కంపనీ సేల్స్ అఫీసర్ ఫోన్‌నంబర్ వంటి వివరాలుండాలి. కానీ వివరాలు అరకొర గ్యాస్ ఏజెన్సీల్లో తప్ప 80శాతం కనిపించవు. కనెక్షన్లు ఎన్ని ఇచ్చారు.. పాస్‌బుక్‌లు ఇచ్చారా.. తదితర వివరాలను ఎప్పటికప్పుడు పౌరసరఫరాల అధికారులు తనిఖీలు నిర్వహించాలి. కార్యాలయాల్లో సిలిండర్లు ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు. కానీ ఎప్పుడూ కనిపిస్తుంటాయి.
No comments:
Post a Comment