విజయవాడ, జూలై 9, (way2newstv.in)
రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్య కోరల్లోకి నగరం మరింతగా చిక్కుకుంటోంది. కాలుష్యం అధికంగా ఉన్న నగరాల జాబితాలోకి మన విజయవాడ కూడా చేరిపోయింది. దేశ వ్యాప్తంగా 102 నగరాలు కాలుష్య నగరాలుగా ఉంటే వాటిలోకి విజయవాడ కూడా చేరింది. తాజాగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన కాలుష్య నగరాల జాబితాలో మన విజయవాడ పేరు కూడా చేరిపోయిందని కేంద్రం ప్రకటించింది. 10 లక్షలు దాటిన జనాభా కలిగిన నగరాల్లో కాలుష్యం అధికంగా ఉంటుందని చెప్పిన కేంద్రం కాలుష్య రహితంగా మార్చేందుకు చర్యలు ప్రారంభించింది. గాలి నాణ్యత సమాచారం, శబ్ధ కాలుష్య సమాచారం, ప్రపంచ బ్యాంకు నివేదికతో పాటు పలు సంస్థల సర్వేల ఆధారంగా రాష్ట్రంలో 5నగరాలను కాలుష్య నగరాలుగా ఎంపిక చేశారు.
కాలుష్య నగరాల్లో బెజవాడ
ఇందులో విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు నగరాలు ఉన్నాయి. ప్రమాద స్థాయికి చేరుకుంటున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎంపిక చేసిన నగరాలకు ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్ల సహాయాన్ని అందించనుంది. ఈ నగరాలను కాలుష్య రహిత నగరాలుగా మార్చే క్రమంలో ఆయా నగరాల్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌లను చేపట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక నివేదికను కూడా సమర్పించడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దానిని ఆమోదించింది. దీనిలో భాగంగా రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యపై నగర వాసులకు ముందుగా అవగాహన కల్పించనున్నారు. అలాగే కాలుష్య నివారణకు సంబంధించి పలు యంత్రాలను వినియోగించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని కూడా చేపట్టాల్సి ఉంటుంది. అలాగే కాలుష్యాన్ని తగ్గించే అన్ని చర్యలు ప్రణాళిక బద్ధంగా అమలు చేయాల్సింది. దీనిలో భాగంగా త్వరలోనే నగరంలో కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
No comments:
Post a Comment