Breaking News

28/06/2019

ఊరించి..ఊసూరుమనిపిస్తున్న వానలు


విశాఖపట్టణం, జూన్ 28, (way2newstv.in)
జూన్‌ ప్రారంభమవగానే వాతావరణంలో మార్పులు వచ్చి మేఘాలు కమ్మడంతో రైతుల ముఖంలో ఆనందం వెల్లువిరిసింది. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు నిలువలేదు. ప్రతి ఏటా జూన్‌ రెండోవారం వచ్చేసరికి వరిసాగుకు రైతులు దుక్కులు సిద్ధంచేసుకుంటూ హడావుడిలో ఉంటారు. ప్రస్తుతం మండలంలో అలాంటి పనులే కనబడడంలేదు.జూన్‌ ఆఖరుకి వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతుండడంతో ఖరిఫ్‌ సాగుకు సన్నద్దమవుతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్‌ ప్రారంభం నుండి తేలిక పాటి వర్షాలు అక్కడక్కడా పడుతూ రైతులను ఊరిస్తున్నాయే తప్పా భారీస్థాయిలో మండలంలో ఎక్కడా వర్షాలు పడలేదు. దీంతో నేలలు సాగుకు అనుకూలంగా లేక కనీసం దుక్కులు దున్నుకునే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిస్తే సీజన్‌ గట్టుక్కినట్టేనని లేకుంటే కరువు తప్పదని వారు వాపోతున్నారు. 

ఊరించి..ఊసూరుమనిపిస్తున్న వానలు

మొట్ట ప్రాంతమైన టి.నరసాపురం మండలంలో ప్రతిఏటా ఖరీప్‌ సీజన్‌లో సుమారు 7,500 ఎకరాల్లో రైతులు పలురకాల వరి వంగడాలని సాగుచేస్తుంటారు. ఈ ఏడాది కూడా 7,500 ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే సాగుకు సన్నద్దమవుతున్న రైతుల్లో వర్షాల బెంగ పట్టుకుంది. ప్రతి ఏటా ఈ పాటికే రైతులు దుక్కులు దున్ని నారుమళ్లు సిద్దం చేసుకుంటుంటారు. ఈ ఏడాది మండలంలో మొత్తం 400 ఎకరాల్లో నారుమళ్లు పోయాల్సి ఉండగా ప్రస్తుతానికి కేవలం 40 ఎకరాల్లో మాత్రమే రైతులు ఆకు మడులు పోశారంటేనే సాగుకు సన్నద్దం రైతులు ఎంత వరకు సిద్దపడుతున్నారో అర్దమవుతుంది. ప్రస్తుతం ఆకుమడులు సిద్ధం చేసుకుంటేనే జులై నెల ఆఖరు నుండి వరినాట్లు ప్రారంబించే అవకాశముంటుంది. ఆకుమడులు ఆలస్యమయ్యే కొలది వరినాట్లు కూడా ఆలస్యమవుతాయని దీంతో దిగుబడి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. జూన్‌ మొదటి వారం వచ్చే సరికి మండలంలో ప్రతిఏటా వర్షపాతం అధికంగానే నమోదవుతుంది. మొదటివారంలో కురవకపోయినా కనీసం రెండో వారంలోనైనా కురుస్తుంటాయి. కానీ ఈ ఏడాది జూన్‌ నెల ముగుస్తున్నా సాగుకు కావాల్సినంత వర్షపాతం నమోదు కాలేదు. ఈనెలలో రెండో వారంలో రుతుపవనాలు వచ్చాయి వర్షాలు బాగా కురుస్తాయి అనుకుంటున్న తరుణంలో 10న వాన కురిసింది అయితే 60 ఎం.ఎం మాత్రమే వర్షపాతం, 21న 21శాతం ఎంఎం వర్షపాతం మాత్రమే నమోదయిందని అధికారులు తెలిపారు. సాధారణంగా నమోదవ్వాల్సిన వర్షపాతం 123ఎంఎం. నమోదైన వర్షపాతం సాగుకు ఏమాత్రం అనుకూలంగా ఉండదని అధికారులు చెబుతున్నారు.మండలంలో అధికంగా బోరు బావులు ఉన్నప్పటికీ సుమారు ఆరువందల ఎకరాల వరకు వర్షాదారమే. ఈ క్రమంలో ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు ఒక్క చెరువులో కూడా చుక్కనీరులేదు. మండలంలో ప్రధాన చెరువులు మక్కినవారిగూడెంలోని జమ్చిచెరువు, టి.నరసాపురంలో నందమూరు విజయసాగర్‌ చెరువు, తిరుమలదేవిపేట, అప్పలరాజుగూడెం తదితర గ్రామాల్లో పెద్ద చెరువులు ఉన్నాయి. వర్షాలు బాగా కురిసి ఈ చెరువులన్నీ నిండితేనే ఆ చెరువుల కింద సుమారు 600 ఎకరాలు సాగు అవుతుంది. వర్షాలు పడకపోతే చెరువులు నిండకపోతే ఇక ఆ నేలల్లో సాగు కష్టమేనని, సాగు చెయ్యకపోతే తమ కుటుంబాలు జీవనం కష్టమేనని కొందరు రైతులు వాపోతున్నారు. గత ఏడాది వర్షాలు తక్కువగా ఉండడంతో సాగు ఆలస్యమైందని ఈ ఏడాదైనా వర్షాలు అధికంగా కురుస్తాయని తమపంటలు బాగా పండుతాయని ఆశిస్తున్నామని అన్నారు. కానీ తేలికపాటి జల్లులు మాత్రమే పడుతున్నాయని ఈ క్రమంలో సాగు కష్టమేనేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే దుక్కులు సిద్దం చేసుకుని ఆకుమడులు కూడా పోసుకుని సిద్ధంగా ఉండాలని వర్షాలు బాగానే కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

No comments:

Post a Comment