Breaking News

07/06/2019

అవినీతి అంతం అంత తేలికైన పనా


విజయవాడ, జూన్ 7 (way2newstv.in)
‘జగన్ అనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవినీతి లేని పాలన అందిస్తాను.’ అని ప్రమాణస్వీకారం రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. సీఎంగా తన తొలి ప్రసంగంలోనే తనపై, తన కుటుంబంపై జరిగిన కుట్ర, అవినీతి ఆరోపణలను శాశ్వితంగా తొలగించుకునే దిశగా పరిపాలన ఉండబోతున్నదన్న సంకేతాలు స్పష్టంగా ఇచ్చేశారు. రాజకీయ నేతలు, అధికారవర్గాల్లో వేళ్లూనుకుని ఉన్న అవినీతిని జగన్ ఎలా అంతం చేస్తారు? ఈ తరుణంలో అవినీతి నిరోధక శాఖ మీద ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. వైఎస్ జగన్ తన టీమ్‌లో భాగంగా కొత్త ఏసీబీ డీజీగా విశ్వజిత్‌ను కూడా నియమించారు. స్వాభావికంగా విశ్వజిత్ మృధుస్వభావి. గతంలో ఏసీబీ లో అదనపు డైరెక్టర్ హోదా లో పని చేసిన అనుభవం ఉంది. ఈ శాఖకు ఒక ప్రత్యేకత ఉంది. అవినీతి నిరోధక శాఖను నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూ చేయగలరు. హోంమంత్రి గానీ మరే ఇతర శాఖల అధికారులు గాని ఏసీబీకి ఆదేశాలు ఇవ్వలేరు. సీఎం కనుసన్నల్లో గల స్వయం ప్రతిపత్తి గల శాఖ ఏసీబీ. అవినీతిపరులను వేటాడే విషయంలో సాధ్యమైనంత కఠినత్వం అవసరం.


అవినీతి అంతం అంత తేలికైన పనా
కానీ డీజీ విశ్వజిత్ ఈ పోస్ట్ కి సరితూగడనే విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. ఏసీబీ అంటే పోలీస్ శాఖలోని ఒక అంతర్భాగం. అందులో పనిచేసేవారిలో ఆ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారే ఉంటారు.ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొందరు సీఐ, డీఎస్పీ, ఐపీఎస్‌లు వంద కోట్ల సంపాదన దాటిపోయారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక సభ్యులను ధన, అంగ, కుల బలాలతో ప్రభావితం చేస్తున్న విషయం బహిరంగ సత్యం. ఓ సందర్భంలో రాజధాని జిల్లా అర్బన్ ఎస్పీగా పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారి.. తమ రోజువారీ సెట్ కాన్ఫరెన్స్‌లో భాగంగా.. ఓ డీఎస్పీని... ‘నీ ఆస్తి విలువ రూ.200 కోట్లు దాటిందంటగా. ఇంకా డబ్బు మీద వ్యామోహం పోలేదా?’ అని ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. ఆ కామెంట్స్‌‌తో డిపార్ట్‌మెంట్ నివ్వెరపోయింది. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే.. అది జరిగిన కొన్ని గంటల్లోనే సదరు డీఎస్పీ సాయంత్రానికి మరో చోట పోస్టింగ్ వేయించుకున్నారు. అంటే ఏ రేంజ్‌లో ప్రభావితం చేశారో అర్ధం చేసుకోవచ్చు. గుంటూరు జిల్లాలో పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఏసీబీలో పనిచేస్తున్న ఏఎస్పీ స్థాయి అధికారితో కలసి తన తండ్రి పేరుతో 350 గజాల స్థలం కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే, ఆ విషయం ఏసీబీకి తెలియడంతో డబ్బును వేర్వేరు మార్గాల్లో తరలించి లాండ్ రిజిస్ట్రేషన్ చేయించినట్టు ప్రచారం ఉంది. అంటే, చట్టం తెలిసిన వారు ఎలా తప్పించుకుంటున్నారనడానికి ఇదొక ఉదాహరణ.నెల్లూరు జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్‌‌ను ఏసీబీ పట్టుకుంది. అయితే, తాను డీఎస్పీ చెప్పినందుకే లంచం తీసుకున్నానని లిఖితపూర్వకంగా రాసిచ్చాడా హెడ్ కానిస్టేబుల్. దీనికి సంబంధించి డీఎస్పీని కనీసం విచారించకుండా డిపార్ట్‌మెంట్ క్లీన్ చిట్ ఇచ్చేసింది. అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే, అదే డీఎస్పీని ఏసీబీలోకి తీసుకున్నారు. అక్రమార్కుల పనిపట్టాల్సిన పోలీసు శాఖలోనే ఇలా అంతులేని అవినీతి రాజ్యమేలుతుంటే, జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న అవినీతి లేని పాలన సాధ్యమవుతుందా? అవినీతి లేని పాలన అంటే కేవలం టెండర్లలో మాత్రమేనా? ప్రభుత్వ అధికారుల్లో అవినీతిని తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేపడతారు? చట్టం తెలిసిన ‘నేరస్తులు’ను ఎలా కంట్రోల్ చేస్తారనేది అందరి ముందు ఉన్న ప్రశ్న.

No comments:

Post a Comment