Breaking News

07/06/2019

పోలవరం...

ముందుకు మూడడుగులు... వెనుకకు ఆరడుగులు

ఏలూరు, జూన్ 7, (way2newstv.in)
పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు డోలాయమానంలో పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం అంశంలో టిడిపి, వైసిపి పార్టీలు భిన్న వైఖరులు చేపట్టాయి. ప్రాజెక్టులో ప్రధాన భాగమైన రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మించే సమయంలో వరద ఉధృతి తప్పించుకొనేందుకు ముందు భాగంలో కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం ప్రతిపాదించబడింది. అయితే కాఫర్‌ డ్యామునే పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అడ్డదారి తొక్కుతున్నారని, ఫలితంగా మెయిన్‌ డ్యామ్‌ వెనుకబడిందని జగన్మోహన్‌రెడ్డి ఇంతవరకు ఆరోపించేవారు. మరి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ఆయన ఈ అంశంలో ఏ వైఖరి తీసుకుంటారో స్పష్టం కావాలి. దురదృష్టమేమంటే 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేంత వరకు అంటే రెండేళ్లు కాలయాపన చేసి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ఇది మొదటి శాపంగా మారింది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం విధించిన కొన్ని షరతులు ముఖ్యమంత్రి ఆమోదించడం ఎవరికీ అంగీకారం కాలేదు. 2014 మార్చి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన రూ.5,135,85 కోట్లు తిరిగి చెల్లించేందుకు కేంద్రం నిరాకరించింది. రెండవ అంశమేమంటే ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ మాత్రమే భరిస్తానని చెప్పింది. ఈ షరతులు ఆ తరువాత పలు వివాదాలకు దారి తీశాయి. 


పోలవరం...
ఆ తర్వాత 2010-11లో అంచనాల ప్రకారం భూసేకరణ వ్యయం రూ.3 వేల కోట్లుగా వుండగా ప్రస్తుతం అది రూ.32 వేల కోట్లకు చేరిందంటున్నారు. వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ నిర్మాణం కన్నా, కాలువలు తవ్వకం కన్నా నిర్వాసితులు పునారావాసమే పోలవరం ప్రాజెక్టుకు ప్రధాన సమస్యగా ఎదురౌతోంది. 2019 ఎన్నికల నాటికి ప్రధాన డ్యామ్‌ పనులు పాక్షికంగా కూడా పూర్తి కావని భావించిన చంద్రబాబు నాయుడు కాపర్‌ డ్యామ్‌తోనే 60 టిఎంసీల నీళ్లు నిల్వ చేయాలను కున్నారు. గ్రావిటీ ద్వారా నీరు తరలించి క్రెడిట్‌ కొట్టేయాలని చూశారు. అయినా తన హయాంలో కాపర్‌ డ్యామ్‌ను పూర్తి చేయలేకపోయారు. నిల్వ చేసే నీరు ఏవిధంగా వినియోగిస్తారో కూడా గాలికి వదిలేశారు. ముంపు బాధితులను అసలే పట్టించుకోలేదు. ఇది రెండవ శాపంగా మారింది. వైసిపి నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ విధానంతో తొలి నుంచి పూర్తిగా విభేదించారు. కాపర్‌ డ్యామ్‌ తోనే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చి ప్రాజెక్టు పూర్తైందని చెప్పేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమౌతున్నారని అప్పట్లో తీవ్ర విమర్శలు చేసిన ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంలో సంక్షేమ పథకాల గురించి తప్ప పోలవరం ప్రాజెక్టు భవితవ్యం గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించలేదు. ఢిల్లీ వెళ్లిన సందర్భంగా రాజధాని నిర్మాణం గురించి మాట్లాడారు కానీ పోలవరం ఊసే ఎత్తలేదు. అంతేకాదు పోలవరం నిర్మాణంలో అవినీతి వరద ఎత్తిందని తొలి నుంచి జగన్మోహన్‌రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రిగా అవినీతిపై విచారణలతో కాలయాపన చేసి ప్రాజెక్టు పురోగతిని మందగింపజేస్తారా? అవినీతిపై విచారణ, పోలవరం పనులు ఒకే సమయంలో పరిగెత్తిస్తారా? తేల్చాల్చి వుంది. అంతేకాదు, జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వచ్చారు. 'ఖడ్గ చాలనం కాదు, కరచాలనం కావాల'న్నారు. ఎంతో సంతోషించదగ్గ అంశమే. అయితే పోలవరం ప్రాజెక్టును గోదావరి ట్రిబ్యునల్‌ 35 లక్షల క్యూసెక్కుల విడుదల సామర్థ్యంతో నిర్మించాలని సూచించితే 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తున్నారని తిరిగి మొత్తం పర్యావరణ అనుమతులు పొందాలని తెలంగాణలోని నాయకులు, ప్రభుత్వం ఒక వైపు, సుప్రీంకోర్టు మరో వైపు గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ అంశంలో కెసిఆర్‌ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మేరకు రాయితీలు పొందగలుగుతారో ఆ మేరకు ప్రాజెక్టు పురోగతి సాధిస్తుంది. ఒక వైపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాలు సాగుతున్న సమయంలోనే మరో వైపు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి చెందిన అధికారులు ప్రాజెక్టు లోని వివిధ విభాగాలను నిశితంగా పరిశీలించి తుదకు ఎక్కడ పనులు అక్కడ ఆపమని సూచనలు చేయడం గమనార్హం. ఈ సూచనలు అమలు జరిగితే వచ్చే ఏడాదికి కూడా కాపర్‌ డ్యామ్‌ ద్వారా గ్రావిటీతో నీళ్లిచ్చే అవకాశాలు అంతగా లేవు. ఒక వైపు ప్రాజెక్టు పనులు సంక్షోభంలో పడుతున్నట్లు వార్తలు వస్తున్నా కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటో ఇంతవరకు వెల్లడి కాలేదు. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో చేపట్టిన విధానం ఎన్నో ఎదురు దెబ్బలు తీసింది. అధికారం చేపట్టగానే పట్టిసీమపై పడ్డారు. రాజకీయ పార్టీలే కాకుండా ఏ పార్టీకి చెందని రైతు సంఘాల నేతలు కూడా అడ్డు చెప్పారు. వెంటనే పోలవరం ప్రారంభించి పనులు ప్రారంభించాలని కోరారు. కానీ చంద్రబాబు నాయుడు చెవికి ఎక్కలేదు. పట్టిసీమపై పెట్టిన నిధులతో పాటు మరికొన్ని నిధులు సమీకరించి పోలవరం ప్రాజెక్టు పనులు 2014 లోనే ప్రారంభించి వుంటే ఆయన ఊహించినట్లు 2017 నాటికే గ్రావిటీ ద్వారా గోదావరి జలాలు ప్రవహించేవి. అంతా తలకిందులైంది. 2016లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత గానీ పోలవరం పనులు ఊపు అందుకోలేదు. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా మూడు అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. 1.ప్రాజెక్టు నిర్మాణం 2.ప్రాజెక్టు ఏ మేరకు నిర్మింపబడినా నిల్వ వుండే నీటి ద్వారా నిర్వాసితులయ్యే వారికి నష్ట పరిహారంతో పాటు పునరావాసం కల్పించడం 3.నిల్వ చేయబడే నీటిని పాక్షికంగానైనా వినియోగించుకునేందుకు బ్రాంచి కాలువలు పిల్ల కాలువల నిర్మాణం. ఆయకట్టు ఆధునీకరణ. ఇవి కీలకాంశాలు. కానీ చంద్రబాబు నాయుడు పోలవరం మెయిన్‌ డ్యామ్‌ నిర్మాణం పక్కన బెట్టారు. కాపర్‌ డ్యామ్‌లకే పరిమితమయ్యారు. మిగిలిన రెండు విభాగాలను గాలికి వదిలేశారు. పోలవరంపై ఎన్నో సమీక్షలు చేసినా నిర్వాసితులకు నష్ట పరిహారం పునరావాసం గురించి ఒక్క రోజు కేటాయించిన సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా సాగిందంటే చాలా మందికి గుర్తుండకపోవచ్చు. కడప జిల్లాలోని గండికోట రిజర్వాయరులో మొదటి సంవత్సరం ఏడు టిఎంసీల నీరు నిల్వ చేశారు. రెండవ యేడు వచ్చే సరికి 12 టిఎంసీల నీరు నిల్వ చేయగానే ఐదారు గ్రామాలు నీట మునిగిపోయాయి. వీరికెవరికీ పునరావాసం కల్పించలేదు. ఈ గ్రామాల ప్రజలు రెండు రోజుల పాటు కుటుంబాలతో సహా జలదీక్ష సాగించిన తదుపరి గానీ వారికి పరిహారం నిమిత్తం పునరావాసానికి నిధులు విడుదల కాలేదు. పోలవరం నిర్వాసితులకు పరిహారం రూపేణా పునరావాసం సక్రమంగా జరగలేదు. పోనీ ప్రస్తుతం నిర్మించిన మేరకైనా కాపర్‌ డ్యామ్‌ వుంచితే నిర్వాసితుల పునరావాసం ఎలా? అనేదానిపై మీమాంస ఏర్పడింది. గత వారం రోజులుగా ఈ అంశంపై పోలవరం అథారిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారకుండా వుంటే చంద్రబాబు నాయుడు మూర్ఖంగా వ్యవహరించి నిర్వాసితులను నీట ముంచే వారేమో! తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం జరిగినా నిర్వాసితులను గాలికి వదిలి పెట్టారు. పోలవరం అంశంలో కూడా అదే జరిగింది. విచారణకు వచ్చిన మసూద్‌ కమిటీ ప్రారంభంలోనే కొన్ని కీలకమైన ప్రశ్నలను లేవనెత్తింది. కాపర్‌ డ్యామ్‌ ద్వారా నిల్వ చేయబడే నీటిని ఏవిధంగా వినియోగిస్తారు? ఇందుకు ప్రణాళిక ఏదైనా వుందా? 60 టిఎంసీల నీరు నిల్వ చేస్తే ముంపులో మునిగే గ్రామాల నిర్వాసితుల గురించి పలు ప్రశ్నలను ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చింది. కానీ ఇవేవీ పట్టించుకున్న దాఖలా లేదు. ప్రస్తుతమిది ప్రాజెక్టు పనులనే ప్రశ్నార్థకం చేస్తోంది. గత సంవత్సరం గోదావరి నదికి 28 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహమొచ్చింది. ఈ యేడు ఎంత వస్తుందో తెలియదు. ఒకవేళ అదే ప్రవాహమున్నా రెండు మూడు విధాలుగా నష్టం జరిగే అవకాశం వుందని పోలవరం అథారిటీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మూడు రీచ్‌లుగా నిర్మింపబడుతున్న కాపర్‌ డ్యామ్‌లో రెండవ రీచ్‌లో మాత్రం 32 అడుగుల ఎత్తుకు నిర్మాణం జరిగింది. కాపర్‌ డ్యామ్‌ ద్వారా సాగుకు నీళ్లు ఇచ్చే అంశం పక్కనబెడితే ప్రస్తుతం కాపర్‌ డ్యామ్‌ నిర్మింపబడిన స్థాయి లోనే వుంటే నిల్వ చేయబడే నీటి ముంపుతో దాదాపు 10 గ్రామాలు నీట మునిగే అవకాశముందని అధికారులు గుర్తించారు. ఈ గ్రామాల వారికి పునరావాసం ఇంతవరకు పూర్తి కాలేదు. పైగా స్పిల్‌వే నుంచి నీటిని తరలించాలన్నా స్పిల్‌ ఛానల్లో గౌటింగ్‌ పనులు పెండింగ్‌లో వున్నాయని చెబుతున్నారు. కనీసం 3వ వంతు కూడా పూర్తి కాలేదంటున్నారు. గోదావరికి వరద వచ్చే లోపు ఈ గౌటింగ్‌ పనులు పూర్తవుతాయో లేదో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఈ యేడు గోదావరికి వరద వచ్చే ప్రవాహం బట్టి అన్ని అంశాలు ఆధారపడి వుంటాయి. ఒకవేళ స్పిల్‌వే నుంచి నీరు తరలించినా కాపర్‌ డ్యామ్‌ రెండవ రీచ్‌ లోనూ స్పిల్‌వే ముందు నీరు నిల్వ వుంటుందని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం 33 మీటర్ల ఎత్తుకు గోదావరి ప్రవాహం నియంత్రించినా అప్పటికీ 10 నుంచి 15 గ్రామాల ప్రజలను తరలించి పునరావాసం కల్పించవల్సి వుంటుందని పోలవరం అథారిటీ అధికారులు తేల్చారు. ఇదంతా కూడా చిక్కుముడిలాగా వుంది. ఇప్పటివరకు జరిగిన పనులు ఎక్కడికక్కడ నిలిపివేయబడినా కాపర్‌ డ్యామ్‌ ద్వారా నీట మునక తప్పనిసరి అవుతుంది. అదే సమయంలో స్పిల్‌వే గౌటింగ్‌ పనులు ఎంతవరకు పూర్తవు తాయో తెలియదు. ఏతావాతా జరగబోయే దేమంటే అధికారులు జాగ్రత్తపడితే తప్ప నదీ గర్భంలో నిర్మాణంలో వున్న పనులు వరదకు కొట్టుకుపోకుండా కాపాడలేరు. ఇవన్నీ అటుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు అంశంలో తమ వైఖరేంటో ఇంతవరకు ప్రకటించలేదు. అంతేకాదు, తిరిగి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వానికి అప్పజెబుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి, వైసిపి నేతలు మౌనం పాటిస్తున్నారు. ఇదిలా వుండగా దాదాపు రూ.55 వేల కోట్ల వ్యయానికి చేరిన ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు రూ.15 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ గణాంకాల శాతంతో ప్రాజెక్టు పురోగతి గురించి ప్రజలను మభ్య పరచినా వాస్తవాలు భిన్నంగా వున్నాయి. ఇంకా దాదాపు రూ.30 వేల కోట్లు లేనిదే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ పడుతూ లేస్తూ పూర్తి చేయవచ్చుగానీ నిర్వాసితుల పునరావాసం మాత్రం మున్ముందు జటిలంగా మారే అవకాశముంది. 

No comments:

Post a Comment