Breaking News

07/06/2019

రాయలసీమలో కరువు ముంచుకొస్తోంది...


తిరుపతి, జూన్ 7, (way2newstv.in)
చిత్తూరు జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో కరవు కష్టాలు తారా స్థాయికి చేరుకొన్నాయి, గత మూడు సంవత్సరాలుగా సక్రమంగా వర్షాలు కురవక పోవడంతో ఈ ఏడాది పరిస్థితి దయనీయంగా మారింది. ఎటు చూసినా ఎండిన చెరువులు , చుక్క నీరులేని జలాశయాలు దర్శన మిస్తున్నాయి. సక్రమంగా వర్షాలు కురవక పోవడంత మరో పక్క గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండి పోతుండటంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో తాగు నీటి కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో బిందెడు నీటి కోసం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2310 గ్రామాల్లో మంచి నీటి పరిస్థితి విషమించింది, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తాగునీటి కష్టాలు జిల్లా వాసుల్ని హడలెత్తిస్తున్నాయి. జిల్లాలో అనేక ప్రాంతాల్లో అధికారులు ట్యాంకర్లు , వ్యవసాయ బావులు అనుసంధానంతో నీటి సదుపాయం కల్పిస్తున్నా వరుణ దేవుడు కనికరించక పోవడంతో నీరు వస్తున్న బావులు బోర్లు ఎండి పోడిపోతున్నాయి. ఈ పరిస్థితిని అధిక మించడం అధికారులకు కూడా సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. 


రాయలసీమలో కరువు ముంచుకొస్తోంది...
ఎక్కడైనా నీటి వనరులుంటే ట్యాంకర్లు ద్వారా సరఫరా చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నా నీటి వనరులు లేని కారణంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరో పక్క మూగజీవుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. గ్రామాల్లోని చెరువు కుంటల్లో చుక్క నీరు లేక పోవడంతో పశుపోషణ భారంగా మారింది. జిల్లాలో జీవన నదులు అంటూ ఏమి లేక పోవడంతో ఎక్కువ మంది రైతులు వర్షాలు పై ఆధార పడి పంటలను సాగు చేస్తారు. అయితే వరుసగా మూడు సంవత్సరాలు వర్షాలు కురవకోపోవడంతో పంటలు పండక పోవడంతో రైతులు అర్థికంగా చితికి పోయారు. దీంతో రైతులకు పాడిపరిశ్రమే జీవనాధారం అయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత పాడిరైతులను పట్టి పీడిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3.80లక్షల మంది రైతులు పాడిపరిశ్రమపైనే ఆధార పడ్డారు. వర్షాలు సక్రమంగా కురిసి చెరువులు కుంటల్లో నీరు ఉంటే పశు గ్రాసంతోపాటు పశువులకు నీటి సదుపాయం ఉండేది, అయితే నేడు జిల్లాలో భిన్నపరిస్థితులు నెలకొన్నాయి, తమకు జీవనాధారం అయిన పశువులను కాపాడు కోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా పశుగ్రాసం లేక పోవడంతో పోరుగు ప్రాంతాలైన నెల్లూరు, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి ఎండు గడ్డిని తెచ్చుకుంటున్నారు. ట్రాక్టర్ ఎండు గడ్డి తొమ్మిది వేల నుంచి 12 వేల వరకు పలుకుతోంది. ఇది పాడిరైతులకు అదనపు భారంగా మారింది. ఈ ధరలు కూడా దూరాన్ని బట్టి మారుతున్నాయి. కారణంగా అయిన కాడికి పశువులను అమ్మకోలేక , వాటి పోషణ భారం కావడంతో పాడిరైతులు మదనపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విషమ పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. దీంతో పాడి రైతులు జీవితాలు వర్ణణాతీతంగా మారాయి.వరుసగా మూడు సంవత్సరాలు పాటు వరుణ దేవుడు కనె్నర్ర చేయడంతో ఈ సమస్య జఠిలంగా మారింది. రానున్న రోజుల్లో ఈ సమస్యను ఎలా నెట్టుకు రావాలన్నా ఆందోళనలో జిల్లా వాసుల్లో నెలకొంది. వరుణ దేవుడు కనికరిస్తే తప్పా జిల్లాలో నెలకొన్న ఈ సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేదు. దీంతో జిల్లా వాసులు వర్షం కోసం ఎదురు చూపుల చూస్తున్నారు. జిల్లాలో పడమటి మండలాల్లో రైతులు పశుగ్రాస సమస్య ఎదుర్కొంటున్నారు. పశువులకు మేత, తాగునీరు దొరకడం లేదు. కరవులో వ్యవసాయ పనులు లేక పాడి పరిశ్రమను నమ్ముకున్న రైతులకు పశుపోషణ భారంగా మారింది. ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్న గ్రాసం సరిపోక, పాడిపశువుల నుంచి ఆశించినంత పాలు ఉత్పత్తికాక పోవడం, పశువులను పోషించలేక సంతల్లో అమ్ముకుంటున్నారు. పెద్దమండ్యం, కురబలకోట, తంబళ్ళపల్లె, బి.కొత్తకోట, మదనపల్లె, రామసముద్రం మండలాల్లో ఎక్కువ మంది రైతులు పశుపోషణ ద్వారా జీవనం సాగిస్తున్నారు. ప్రతిరోజూ పాలు డైరీకి అమ్మి తద్వారా వచ్చే ఆదాయంతో ఎన్నో కుటుంబాలు జీవనం గడుపుతున్నారు.మామూలుగా రైతులు వరి, వేరుశనగ పంటలు సాగుచేసి పశుగ్రాసం దాచుకుంటారు. వర్షం పడినప్పుడు పచ్చికబయళ్ళలో పశువులను మేపుకోవడం జరుగుతుంది. వారికితోడు తవుడు, ఫీడు పెట్టి అధిక పాల దిగుబడి కోసం ప్రయత్నిస్తారు. కానీ మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితుల వల్ల వరి, వేరుశనగ పంటలు సాగు చేయడం లేదు. వర్షాభావం వల్ల పచ్చిక బయళ్ళు బీళ్ళుగా మారాయి. చెరువుల్లో పశువులు తాగడానికి నీరు లేవు. పెద్దమండ్యం మండలంలో 154చెరువుల్లో, తంబళ్ళపల్లి మండలంలో 8చెరువులు, ఒక పెద్దేరుప్రాజెక్టు నీరు లేక ఎండిపోయాయి. తాగునీటి సమస్య తంబళ్ళపల్లె కోసువారిపల్లి, రెడ్డికోట, కొటాల, ఆర్.ఎన్.తాండా, కోటకొండ పంచాయతీల్లో తాగునీటి కోసం సుమారు కిలోమీటరు దూరం వెళ్ళి వ్యవసాయ బోర్లవద్ద తాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అలాగే పెద్దమండ్యం మండలంలోని సి.గొల్లపల్లి పంచాయతీలో కుడమలవారిపల్లి, పసలవాండ్లపల్లి, వెలిగిల్లు పంచాయతీలో కాయలపల్లి, బి.కొత్తకోట మండలంలోని గట్టు, బీరంగి, కాండ్లమడుగు, పిటిఎం మండలంలోని బూర్లపల్లె, చౌడసముద్రం, మద్దయ్యగారిపల్లె, కాట్నగల్లు, ములకలచెరువు మండలంలో కాలువపల్లె, సోంపల్లె, మద్దినాయునిపల్లె, సోంపాళెం, ములకలచెరువు తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వుంది.

No comments:

Post a Comment