Breaking News

05/06/2019

పథకాలు పేరు మారుతున్నాయ్...


గుంటూరు, జూన్  5, (way2newstv.in)
పేర్లు మారుతున్నాయి… బోర్డులు ఛేంజ్ అవుతున్నాయి… ఇప్పుడు అన్ని రాష్ట్ర కార్యాలయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను చేపట్టిన వెంటనే త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆరు నెలల్లో ఒక మంచి ముఖ్యమంత్రిగా ప్రజల ముందు కన్పిస్తానని చెప్పిన జగన్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని తొలుత బయటపెట్టడమే పనిగా పెట్టుకున్నారు. దీనివల్ల ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తనపై ఎటువంటి విమర్శలకు దిగకుండా ముందరి కాళ్లకు బంధం వేయడమే.దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా మార్చి వేసే పనిలో ఉన్నారు. వాటి పేర్లను కూడా మారుస్తున్నారు. ఇప్పటికే వృద్ధులు, వితంతువులు, వికలాంగులుకు ఇచ్చే పింఛను పథకానికి వైఎస్సార్ పింఛను పథకంగా నామకరణం చేశారు. గతంలో దీనికి ఎన్టీఆర్ భరోసాగా అని పేరుండేది. 


పథకాలు పేరు మారుతున్నాయ్...
ఇక చంద్రన్న బీమా, చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా వంటి చంద్రబాబు పేరుతో ఉన్న పథకాల పేర్లను కూడా మార్చి వేయాలని నిర్ణయించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి మార్పులు, చేర్పులు ఉంటాయన్నది అందరూ ఊహించిందే.ఆంధ్రప్రదేశ్ లో 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి రాగానే తిరిగి ఈ పథకానికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మారుస్తున్నారు. ఇక షెడ్యూల్ కులాలు, తెగలకు, బీసీలకు, మైనారిటీలకు వివిధ కార్పొరేషన్ల ద్వారా అందించే రుణ సాయానికి వైఎస్సార్ చేయూత అని పేరుపెట్టనున్నారు. రైతుల కోసం ఇప్పటికే నవరత్నాల్లో జగన్ ప్రకటించారు.పెట్టుబడి పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. దీనికి వైఎస్సార్ రైతు భరోసాగా పేరు పెట్టనున్నారు. వెనువెంటనే చంద్రన్న పేరుతో కొనసాగుతున్న పథకాలన్నీ పేర్లను మార్చాలని అధికారులకు ఆదేశాలందాయి.ఇక గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన అన్న క్యాంటిన్లకు పేరు మారబోతుంది. రాజన్న క్యాంటిన్లుగా మారుస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెట్టాలని ఇప్పటికే వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన జలయజ్ఞం వల్లనే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగిందని, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి వైఎస్సార్ జలయజ్ఞం అని పేరు పెట్టాలని వైసీపీ నాయకులు గట్టిగా కోరుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజీవ్, ఇందిర పేర్లతో పథకాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు జగన్ తన తండ్రి రుణం తీర్చుకునేందుకు ఆయన పేరుతోనే పథకాలన్నింటీని ప్రజలకు అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment