Breaking News

05/06/2019

పాలనలో జగన్ దూకుడు


విజయవాడ, జూన్  5, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను చేపట్టి వారం రోజులు కూడా కాలేదు. గత నెల 30 వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ  వారం రోజుల్లోపే కీలక నిర్ణయాలను తీసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంకా సచివాలయంలోకి అడుగుపెట్టని జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచే పాలనను చేపట్టారు.ప్రతిరోజూ వివిధ శాఖల సమీక్షలను చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోవడంతో ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకుంటున్నారు. ఒకవైపు శాఖలో ప్రక్షాళలన దిశగా చర్యలు తీసుకుంటూనే మరోవైపు తన హామీల అమలుకు జగన్ శ్రీకారం చుట్టారు. 


పాలనలో జగన్ దూకుడు 
ఆశావర్కర్లు గత కొంత కాలంగా తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందిస్తున్న ఆశావర్కర్లకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామని ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా హామీ ఇచ్చారు.ఆ హామీ మేరకు మూడు వేల రూపాయలున్న వారి వేతనాలను పదివేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 40 వేల మంది ఆశావర్కర్లు లబ్ది పొందనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపైనే జగన్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కన్పిస్తున్నారు. ఈ మూడు రంగాలను గాడిలో పెట్టగలిగితే పాలన గాడిలో పడినట్లేనని జగన్ భావిస్తున్నారు. అందుకే వైద్య ఆరోగ్య శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశావర్కర్ల జీతాలను పెంచారన్నది సీఎం కార్యాలయ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్.ఇక వైద్యం, వ్యవసాయనికి ప్రధానమైన జలవనరుల శాఖపై కూడా సీఎం జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ శాఖలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడిటెక్ జోన్ లో జరిగిన అవకతవకలపై నివేదికను ఆ శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను ఆదేశించారు. అలాలే పోలవరం ప్రాజెక్టు పనులు ఏ మాత్రం ఆగకుండా పూర్తి చేసి, అనుకున్న సమయానికి రైతాంగానికి నీరు అందించాలని నిర్ణయించారు. వారం రోజుల్లోనే కీలక నిర్ణయాలను తీసకుంటూ పాలనను గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు నూతన ముఖ్యమంత్రి జగన్.

No comments:

Post a Comment