Breaking News

11/06/2019

తమ దారి వెతుక్కుంటున్న తమ్ముళ్లు


జేసీ బాటలో మరికింత మంది
విజయవాడ, జూన్ 11 (way2newstv.in)
తెలుగు రాష్ట్రాలో ఒకప్పుడు టీడీపీ అంటే వెర్రి వ్యామోహం. ఆ పార్టీ ఓ ఉప్పెనలా, సునామీలా వచ్చి ప్రతి తెలుగు గుండెను తాకింది. ఇది మన పార్టీ, ఇది పేదల పార్టీ అన్నంతలా ప్రతి గుడిసెలోనూ మారు మోగింది. అటువంటి టీడీపీ నుంచి అన్న నందమూరినే బయటకు పంపేశారు. ఆ తరువాత పాతికేళ్ళ జమానా బాబుగారిదే.తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా తమ రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని కొందరు ఎన్నికలకు ముందు పసుపు కండువా కప్పేసుకున్నారు. పార్టీలో ఏళ్లుగా కొనసాగుతున్న నేతలు తమకు ఈసారి పదవులు ఖాయమని లెక్కలు వేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి పాలవ్వడంతో తమ రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది.అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన స్థానంలో కుమారుడు పవన్ రెడ్డి ని పోటీకి దింపారు. అయితే తాజాగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు జేసీ ప్రకటించారు. తనకు ఇక ఏపార్టీతో సంబంధం లేదని, రాజకీయంగా తాను స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 


తమ దారి వెతుక్కుంటున్న తమ్ముళ్లు
దాదాపు దశాబ్దాల కాలంగా జేసి దివాకర్ రెడ్డి వివిధ హోదాల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన జేసీ ఈ ఎన్నికల ఫలితాలతో రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది.అయితే జేసీ దివాకర్ రెడ్డి బాటలోనే మరో సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంతటి ఘోరమైన ఓటమిని చెందుతానని కలలో కూడా ఊహించలేదు. తనతో పాటు సతీమణి కోట్ల సుజాతమ్మ కూడా ఓటమి పాలు కావడంతో ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వయసు పైబడటం కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా చెబుతున్నారు.కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి త్వరలోనే తన అనుచరులతో సమావేశమై రిటైర్మమెంట్ విషయం ప్రకటిస్తారంటున్నారు. ఇకకోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిలాగానే పార్టీలో చేరిన కిశోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మిలదీ అదే పరిస్థితిగా ఉంది. ఇప్పటికే ఐదేళ్లు పదవులకు దూరంగా ఉండటం, టీడీపీలో కొనసాగినా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో? లేదో? అన్న అపనమ్మకమే వీరిని రిటైర్మెంట్ వైపు ఆలోచింప చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఐదేళ్లు పార్టీ కోసం పనిచేయడమూ వీరికి కష్టంగా మారడంతో రాజకీయ సన్యాసమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.టీడీపీని జనసమ్మోహంగా కాకుండా తనదైన వ్యూహాలతోనే నెట్టుకువచ్చారు. ఏ ఎండకా గొడుగు పట్టేసి పార్టీని నిలబెట్టుకున్నారు. ఇపుడు అన్ని గొడుగులూ అయిపోయాయి. జనాలకూ గుట్టు తెల్సిపోయింది. దాంతో ఈసారి ఎన్నికల్లో ఏ పాచికా పారలేదు. మరే ప్లానూ సక్సెస్ కాలేదు. ఈ నేపధ్యంలో చిత్తు చిత్తుగా టీడీపీ ఓడిపోయింది. ఆ పార్టీ  పుట్టింది మొదలు జరగనంత ఘోర అవమానం జరిగిపోయింది.ఇపుడు టీడీపీ ఓటి పడవ. పూర్తిగా మునుగుతున్న నావ. మరో వైపు నాటి అన్న గారి టీడీపీలా అతి బలమైన పార్టీగా వైసీపీ దూసుకువచ్చింది. ఇప్పటి తరం ఇదే తమ పార్టీ అనుకుంటున్నారు. ఆ పార్టీకి జన సమ్మోహనమైన నేత ఉన్నారు. యువకుడైన జగన్ నాయకత్వం ఉంది. పది కాలాల పాటు గెలిచే సత్తా కూడా ఉంది. దాంతో టీడీపీలో ఇపుడు కొత్త బెంగ పట్టుకుంది.అయిదేళ్ల పాటు ఎలా అన్నదే ఓ ప్రశ్న. ఇక మళ్ళీ గెలుస్తామా అసలు టీడీపీ ఉంటుందా అన్నది అతి పెద్ద ప్రశ్న. చంద్రబాబు వయసే ఇపుడు ఆ పార్టీకి పెద్ద మైనస్. ఆయన తరువాత నాయకుడెవరు అంటే డౌట్లు ఎన్నో వస్తున్నాయి. జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్న వేళ టీడీపీ ఉనికి ఉంటుందా అన్న సందేహాలు తమ్ముళ్ళకు ఎక్కువగా కలుగుతున్నాయి. దాంతో పక్క చూపులు చూస్తున్నారు. నిజానికి టీడీపీకి ప్రత్యామ్నాయం వైసెపీనే కానీ, అక్కడ జగన్ నో చాన్స్ అనడంతో అందరి చూపు బీజేపీ మీద పడిందంటున్నారు. సరిగ్గా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుందేందుకు బీజేపీ కూడా పావులు కదుపుతోంది. ఆ పార్టీ నుంచి పెద్దలు రాయబేరాలకు దిగుతున్నారని టాక్. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్ ఇదే చెబుతోంది. ముందు ముందు జంపింగులనీ బీజేపీలోకేనంటున్నారు. అంటే టీడీపీ బీ టీమ్ ఏపీలో రెడీ అన్న మాట.

No comments:

Post a Comment