Breaking News

11/06/2019

తెలంగాణలో వైఎసీపీ జెండా ఎగిరేలా


హైద్రాబాద్, జూన్ 11(way2newstv.in)
వైసీపీ ఇపుడు ఏపీలో ఎదురులేకుండా ఉంది. ఇక్కడ క్లీన్ స్వీప్ చేసి టీడీపీకి దాని ప్లేస్ ఎక్కడో చూపించింది. 2014లో రావాల్సిన అధికారం కాస్తా ఈసారి రెట్టింపు వడ్డీతో ఏపీలో వైసీపీ వసూల్ చేసుకుంది. చంద్రబాబును నవ్యాంధ్రకు ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ మాత్రమేనని, అసలు ఆట తామే ఆడతామని జగన్ చెప్పకనే చెప్పినట్లైంది. ఇక తెలుగు రాష్ట్రాలో చూస్తే జగన్ వంటి చరిష్మా ఉన్న లీడర్ మరొకరు లేరన్నది వాస్తవం. వయసు రీత్యా కూడా చిన్నవాడు కావడం ఆయనకు అనుకూలిస్తున్న మరో విషయం. జగన్ సాధించిన అద్భుత విజయం పొరుగున ఉన్న తెలంగాణాతో సహా దేశవ్యాప్తంగా ఇపుడు చర్చకు దారితీసింది. తెలంగాణాలో ఇపుడు రెండవసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఉంది.2023 నాటికి మరో మారు ఆ పార్టీ అధికారంలోకి రావడం అంటే చాలా కష్టపడాలి. కేసీయార్ చరిష్మా బాగా తగ్గిపోతున్న చాయలు కనిపిస్తున్నాయి. 


తెలంగాణలో వైఎసీపీ జెండా ఎగిరేలా
ఇక కేటీఆర్ మాస్ లీడర్ కాదు, హరీష్ రావు ది టీఆర్ఎస్ లో పరిమితమైన పాత్ర. ఇక విపక్షం చూసుకుంటే కాంగ్రెస్ ని టీఆర్ఎస్ పూర్తిగా కలిపేసుకుని విపక్షం లేకుండా చేసేసింది. బీజేపీ గట్టి పోటీ ఇస్తుందా అంటే నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన ఆ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో చతికిలపడిపోయింది. ఈ నేపధ్యంలో వైసీపీ కనుక అక్కడ అడుగుపెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ లోని ఓ వర్గంలో పాటు, రాజకీయ పండితులు కూడా అనుకుంటున్నారు. ఇక తెలంగాణాలో వైసీపీలో చేరేందుకు బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఎస్సీలు చాలా మంది ఎదురుచూస్తున్నారు. పైగా రెడ్డి సామాజికవర్గం అక్కడ బాగా ఉంది. ఓ విధంగా చెప్పుకోవాలంటే రాజకీయ శూన్యత ఇపుడు అక్కడ ఎక్కువగా ఉంది.జగన్ ఓదార్పు యాత్రలకు, షర్మిల పాదయాత్రలకు తెలంగాణాలో జనం పోటెత్తిన సంగతి విదితమే. 2014 ఎన్నికల్లో తెలంగాణాలో ఖమ్మం ఎంపీ సీటు, మూడు అసెంబ్లీ సీట్లు వైసీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులను అంచనా వేసుకుంటే వైసీపీ జెండా అక్కడ ఎగరవేయడానికి జగన్ రెడీ అవుతారని అంటున్నారు. జగన్ ఒక పద్దతి ప్రకారం తన రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. ముందు ఏపీని కొట్టాలనుకున్నారు, ఇపుడు అది సాధించారు, కనుక ఇపుడు చూపు విస్తరణపైన కచ్చితంగా ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే 2021లో జరిగే హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల నాటికి తెలంగాణాలో వైసీపీ పోటీకి తయారవుతుందని అంటున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ కి , జగన్ కి ఉన్న బలమే ఇపుడు అండగా ముందుకుసాగుతారా.. లేదా? అన్నది చూడాలి.

No comments:

Post a Comment