Breaking News

11/06/2019

కమల్ కు కలిసిరాని కాలం


చెన్నై. జూన్ 11 (way2newstv.in)
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల్లో కొత్తగా పెట్టిన ఆ పార్టీ దారుణంగా దెబ్బతినింది. తమిళనాడు రాజకీయాల్లో శూన్యత ఉందని, జయలలిత, కరుణానిధి మరణం తర్వాత ఇక్కడ కొత్త నేతను కోరుకుంటున్నారని భావించి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్ కు ఈ ఎన్నికలు చుక్కలు చూపించాయి. కొత్తగా పెట్టిన పార్టీ ఢమాల్ మనడంతో ఆయన వెంట నడచిన వారిలో అప్పుడే సర్దుకోవడం మొదలుపెట్టేశారు. కొందరు ఇప్పటికే రాజీనామా చేశారు.తమిళనాడులో విలక్షణ నటుడు కమల్ హాసన్ లోక్ సభ ఎన్నికలకు ముందు మక్కల్ నీది మయ్యమ్ పార్టీని ప్రారంభించారు. ఆయన పార్టీ ఆవిర్భావానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. మార్పు కోసమే పార్టీని పెట్టానని, సమన్యాయం చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కమల్ హాసన్ చెప్పారు. 


కమల్ కు కలిసిరాని కాలం
రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలకు విశేష స్పందనే లభించింది.అయితే సినీ గ్లామర్ ఉండి, రాజకీయాల్లోకి వచ్చిన కమల్ ను కలుపుకునేందుకు ఏ రాజకీయ పార్టీ ప్రయత్నించలేదు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అధికార అన్నా డీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు ఇతరులతో కలసి కూటమిగా ఏర్పడినా కమల్ ను మాత్రం దూరం పెట్టాయి. అయితే ఆయన లోక్ సభ ఎన్నికల్లోనూ, శాసనసభ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశారు. అయితే కమల్ హాసన్ పార్టీ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. వారిని ప్రజలు ఆదరించలేదు.దీనిని కమల్ సీరియస్ గా తీసుకున్నారు. పార్టీలో లోపాలను సవరించుకునే ప్రయత్నంలో పడ్డారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా బాధ్యులతో ఆయన సమావేశమయ్యారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి 2016లోనే తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో జరగలేదు. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని కమల్ నిర్ణయించారు. అభ్యర్థులనుకూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారు. మొత్తం మీద కమల్ హాసన్ లో కసి కనపడుతోంది. ఎప్పటికైనా తాను లక్ష్యాన్ని చేరుకుంటానని ఆయన ధీమాతో ఉన్నారు.

No comments:

Post a Comment