Breaking News

15/06/2019

చంద్రబాబుకు తనిఖీలపై టీడీపీ ఆగ్రహం


విశాఖలో ఎమ్మెల్యేల అర్ధనగ్నంగా నిరసన 
విశాఖపట్టణం, న్యూ డిల్లీ, అమరావతి  జూన్ 15 (way2newstv.in):
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు, అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ విశాఖ నేతలు అందోళనకు దిగారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబులు టీడీపీ కార్యకర్తలతో కలిసి అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గణేశ్ కుమార్ మాట్లాడుతూ.. జగన్ పాదయాత్ర చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం పూర్తి భద్రతను కల్పించిందని గుర్తుచేశారు. చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉందనీ, ఆయనకు మావోయిస్టుల నుంచి ప్రమాదం ఉందని గుర్తుచేశారు. ఇప్పటికే వైసీపీ నేతలు ఐదుగురు టీడీపీ కార్యకర్తలను చంపారని ఆరోపించారు.చంద్రబాబు భారత రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి అనీ, ఆయన భారత ఆస్తి అని మరో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అన్నారు.


చంద్రబాబుకు తనిఖీలపై టీడీపీ ఆగ్రహం
కాబట్టి చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత దేశం, రాష్ట్రంపై ఉందని చెప్పారు. చంద్రబాబుకు ఏమైనా జరిగి ఉంటే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబుకు భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కాన్వాయ్ కు ఇప్పటికే పైలెట్ వాహనాన్ని, ఎస్కార్ట్ కారును ఏపీ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే.తనిఖీలపై స్పందించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ! ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని గన్నవరం విమానాశ్రయంలో భద్రతాసిబ్బంది తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ వర్గాలు, అభిమానులు భగ్గుమన్నారు. ఈ ఘటనపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం ముదిరింది. తాజాగా ఈ వివాదంపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ స్పందించింది.రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు మాత్రమే విమానాశ్రయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తెలిపింది. మాజీ ముఖ్యమంత్రులకు ఇలా డైరెక్ట్ ఎంట్రీ ఉండదని స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో జడ్ ప్లస్ కేటగిరి వ్యక్తులు, సాధారణ ప్రయాణికుల మధ్య తేడా ఉండదని తేల్చిచెప్పింది. విమానాశ్రయాల్లో భద్రత అన్నది కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) అధీనంలో ఉంటుందని చెప్పింది.చంద్రబాబు కాన్వాయ్ లో కోత ఫై వివరణ ఇచ్చిన ఏపీ పోలీసులు!టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని గన్నవరం ఎయిర్ పోర్టులో సాధారణ ప్రయాణికుల తరహాలో తనిఖీ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు చంద్రబాబు కాన్వాయ్ కు ఇటీవల పైలెట్, ఎస్కార్ట్ వాహనాలను తొలగించడంపై కూడా పలువురు టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న చంద్రబాబుకు భద్రతను కుదించడం సరికాదని వ్యాఖ్యానించారు.తాజాగా ఈ వివాదంపై ఏపీ పోలీసులు స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కేటాయించిన భద్రతలో ఎలాంటి మార్పులు లేవని ఏపీ పోలీసులు తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు కాన్వాయ్ లోని అడ్వాన్స్ పైలెట్ కారును మాత్రమే తొలగించామని వెల్లడించారు. రోడ్డు క్లియరెన్స్ మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో అనవసరమైన అపోహలు వద్దని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment