Breaking News

06/06/2019

మరింత పెరిగిన సన్నబియ్యం ధరలు


నిజామాబాద్, జూన్ 6, (way2newstv.in)
సన్న బియ్యానికి రెక్కలొచ్చాయి. రోజురోజుకూ వీటి ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. మూడేండ్లతో పోలిస్తే ప్రస్తుతం అత్యధిక ధర పలుకుతున్నా యి. రైతుల వద్ద ధాన్యం ఉన్న సమయంలో బియ్యం ధరలు అదుపులో ఉండగా మిల్లర్లు, దళారుల వద్దకు చేరగానే ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధాన్యం ధరల్లో పెరుగుదల లేకపోగా రకరకాల బియ్యం బజారులో అందుబాటులో ఉండటంతో ధరాభారం సామాన్యుడికి తెలియట్లేదు. అయితే నాణ్యమైన బియ్యం కోనుగోలు చేయాలంటే మాత్రం మధ్య, పేద తరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం పాతవి కిలో రూ.52 నుంచి రూ.55గా ధర ఉంది. కొత్తవి రూ.38 నుంచి రూ.45 ఉంటే.. ఇదే సందర్భంలో ధాన్యం ధరలు తక్కువగా ఉన్నాయి. వీటిని ఒకేసారి కొనుగోలు చేయాలని సామాన్యులు భావించినా అవి రైతుల వద్ద ప్రస్తుతం దొరికే పరిస్థితి లేదు. పాత బియ్యం 76 కిలోల బస్తా రూ.2400 పలుకుతోంది. కానీ ఈ బియ్యం కొందామన్నా రైతుల వద్ద లేవు. కొత్త బియ్యం 76 కిలోల బస్తా రూ.1600 నుంచి రూ.1800 పలుకుతున్నాయి. ఈ బియ్యం కొంతమేరకు ఉన్నా అవి తమ ఇళ్ళల్లో అవసరాలకు రైతులు ఉంచుకున్నారు. 


మరింత పెరిగిన సన్నబియ్యం ధరలు
పప్పుల ధరలు తక్కువగా ఉండటం పేదలకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలోనే కరీంనగర్‌ జిల్లా వరి దిగుబడిలో అగ్రగామిగా నిలిచిన చరిత్ర ఉంది. రాష్ట్ర విడిపోయిన తరువాత కూడా తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. గతేడాది వర్షాభావ పరిస్థితులుండి కొంతమేరకు సాగు విస్తీర్ణం తగ్గినా ఆ మేరకు దిగుబడులు పెరిగి ఉత్పత్తుల కొరత తీరింది. ఇది వరకు ఎన్నడూలేని విధంగా గత ఖరీఫ్‌, రబీల్లో ధాన్యం దిగుబడులు వచ్చాయి. దీంతో బియ్యం ధరలు నియంత్రణలో ఉంటాయని రైతులు, సామాన్యులు భావించారు. దానికి భిన్నంగా రైతుల వద్ద నుంచి సరకు బయటకు వెళ్లిపోగానే ధరలు అమాంతంగా పెరిగాయి. సామాన్యుడు సన్న బియ్యం కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడింది. గత జనవరిలో సన్నబియ్యం కిలో ధర రూ.40 ఉండగా ఇప్పుడు రూ.55కు చేరింది. ఈ పెరుగుదల కొనసాగుతుండడం సామాన్య, మధ్య తరగతులకు కలవరపరుస్తోంది. జిల్లా కేంద్రంలో నాణ్యమైన పాత సన్నబియ్యం 100 కిలోల బస్తా రూ.5200 నుంచి రూ.5500 పలుకుతోంది. ఇదే బియ్యాన్ని 25 కిలోల బస్తాగా తీసుకుంటే కిలోకి రూ.2 నుంచి రూ.3 అదనపు భారం పడుతోంది. కొత్త బియ్యం ధరలు కూడా మండిపోతున్నాయి. క్వింటా బస్తా రూ.4200 నుంచి రూ.4500 పలుకుతోంది. 25 కిలోల బస్తాతోపాటు కిలోల లెక్కన బియ్యాన్ని తీసుకుంటే కిలో రూ.50 వరకు చేరుతుంది బహిరంగ బజారులో బియ్యం ధరలు మోయలేని వారికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి స్టీమ్‌ బియ్యం పేరిట కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇందులో రకరకాల బియ్యం కలిసి ఉంటున్నాయి. ప్రజాపంపిణీ బియ్యాన్ని రీసైక్లింగ్‌చేసి కొంత నాణ్యమైన బియ్యం కలిపి స్టీమ్‌గా మారుస్తున్నారనే ఆరోపణలున్నాయి. పౌరసరఫరాల శాఖ, ఆహార కల్తీశాఖ దీన్ని పట్టించుకోకపోవడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఈ బియ్యం 100 కిలోల బస్తా రూ.3500 నుంచి రూ.4 వేలకు లభిస్తుంది. 25 కిలోల బస్తాతోపాటు కిలో లెక్కన విక్రయించే బియ్యం ధర కూడా తక్కువగా ఉంది. వ్యాపారులు వీటిని విక్రయించే సమయంలో స్టీమ్‌గా చెప్పట్లేదు. మంచి బియ్యంగానే వారు విక్రయిస్తున్నారు. అన్నం వండిన తర్వాత గుజ్జుగుజ్జుగా ఉండి తినేందుకు బాగోలేదని వినియోగదారులు వ్యాపారులకు ఫిర్యాదుచేస్తే అప్పుడు అవి స్టీమ్‌ అని చెబుతున్నారు. వీటిని తినడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నాసిరకం బియ్యం తినడం వల్లే జీర్ణకోశ సమస్యలు, గ్యాస్‌, ఉబకాయం, కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

No comments:

Post a Comment