Breaking News

06/06/2019

నిరుద్యోగ రాష్ట్రాల్లో తెలంగాణ


హైద్రాబాద్, జూన్ 6, (way2newstv.in)
రాష్ట్రంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతున్నది. దేశంలో అత్యధికంగా నిరుద్యోగ రేటు ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల్లో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేట్లలో 38.5 శాతం నిరుద్యోగులేనని, పీజీ.. ఆపై చదువులు చదివి ఉద్యోగం లేనివారు 43.7 శాతం మంది ఉన్నారని నేషనల్‌‌ స్టాటిస్టికల్‌‌ ఆఫీస్‌‌(ఎన్‌‌ఎస్‌‌వో) ఇటీవల విడుదల చేసిన నివేదికల్లో వెల్లడైంది. పెద్దపెద్ద చదువులు చదువుకొని కొలువులు దక్కనివారి విషయంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు తేలింది. ఉద్యోగం, నిరుద్యోగం, ఉపాధి అవకాశాలపై ఏటా ఎన్ఎస్వో శాంపిల్ సర్వే నిర్వహిస్తుంటుంది. దేశంలో అన్ ఎంప్లాయిమెంట్శాతం 2018లో 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుందని తేలింది. కేంద్ర స్టాటిస్టికల్‌‌ అండ్‌‌ ప్రోగ్రామ్‌‌ ఇంప్లిమెంటేషన్‌‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ఎస్వో దేశవ్యాప్తంగా 2017 జులై  నుంచి 2018 జూన్‌‌  మధ్య పిరియాడిక్‌‌ లేబర్‌‌ ఫోర్స్‌‌ సర్వే (పీఎల్‌‌ఎఫ్‌‌ఎస్‌‌)ను నిర్వహించి వార్షిక నివేదికను విడుదల చేసింది. 2018 అక్టోబర్‌‌–-డిసెంబర్‌‌ మధ్య కరెంట్ వీక్లీ  స్టేటస్(సీడబ్ల్యూఎస్)ను క్వార్టర్లీ బులెటిన్గా విడుదల చేసింది. 


నిరుద్యోగ రాష్ట్రాల్లో తెలంగాణ

అండమాన్‌‌ నికోబార్‌‌ దీవులు మినహా 29 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 7,024 గ్రామాలు, 5,776 పట్టణాల్లో 1,02, 113 కుటుంబాల నుంచి వివరాలు సేకరించింది. తెలంగాణ విషయానికొస్తే 200 బ్లాక్‌‌లలో 1588 కుటుంబాలకు చెందిన 5,563 మంది నుంచి శాంపిల్స్ తీసుకుంది.ఉద్యోగాల భర్తీతోపాటు స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అధికారికంగా వెల్లడించిన గణాంకాల్లో మాత్రం అది వాస్తవం కాదని తేలింది. క్వార్టర్లీ బులెటిన్‌‌లోని సీడబ్ల్యూఎస్‌‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 12.4 శాతం ఉంది. దేశవ్యాప్తంగా అత్యధిక నిరుద్యోగులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది ఆరో స్థానం అని వెల్లడైంది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ (15.8 శాతం), రెండో స్థానంలో ఒడిశా (14.2 శాతం), మూడో స్థానంలో ఉత్తరాఖండ్ (13.6 శాతం), నాల్గో స్థానంలో జమ్మూ కాశ్మీర్ (13.5 శాతం), ఐదో స్థానంలో బీహార్(13.4 శాతం) ఉన్నాయి. వార్షిక నివేదిక పీఎల్ఎఫ్ఎస్ ప్రకారం తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.5 శాతం, పట్టణ ప్రాంతాల్లో 9.4 శాతం నిరుద్యోగ రేటు ఉంది. దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఉద్యోగార్హత ఉన్న పట్టణ యువతలో 7.8 శాతం మంది నిరుద్యోగులేనని సర్వే తేల్చింది. గ్రామాల్లో 5.3 శాతం మంది నిరుద్యోగులేనని వెల్లడైంది.విద్యార్హతలవారీగా కూడా సర్వేలో వివరాలు సేకరించారు. 2017–18 వార్షిక నివేదిక ప్రకారం తెలంగాణలోని నిరక్షరాస్యుల్లో నిరుద్యోగుల శాతం 0.4 మాత్రమే ఉండగా ప్రైమరీ స్కూల్ చదువు పూర్తి చేసినవారిలో 4.0 శాతం, అప్పర్ ప్రైమరీ స్కూల్ చదువు పూర్తి చేసినవారిలో  5.9 శాతం, సెకండరీ స్కూల్ చదువు పూర్తి చేసినవారిలో 4.0, హయ్యర్‌‌ సెకండరీ చదువు పూర్తి  చేసివారిలో 15.7 శాతం, డిప్లొమా పూర్తిచేసినవారిలో 21.2శాతం, అండర్ గ్రాడ్యుయేట్లలో 38.5 శాతం నిరుద్యోగులని తేలింది. పీజీ, ఆపై చదువు పూర్తి చేసినవారిలో 43.7 శాతం నిరుద్యోగులు ఉన్నట్లు వెల్లడైంది. పీజీ, ఆపై క్వాలిఫికేషన్‌‌ కలిగినవారిలో అత్యధికంగా నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఉన్నత చదువులు చదివినవారికి తగిన  ఉద్యోగాలు లభించకపోవడం, చిన్న ఉద్యోగాలు చేయడానికి వారు ఇంట్రెస్టు చూపించకపోవడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ నివేదిక జనవరిలో లీక్‌‌ అయినప్పటికీ కేంద్రంలోని అధికార ఎన్డీయే వర్గాలు ఖండించాయి. కానీ ఈ నివేదిక  నాలుగు రోజుల క్రితం అధికారిక వెబ్‌‌సైట్‌‌లోకి రావడంతో వారి వాదన తప్పని తేలిపోయింది.

No comments:

Post a Comment