Breaking News

11/06/2019

అంచనాల్లో పాశ్వాన్ టాప్


పాట్నా. జూన్ 11 (way2newstv.in)
రామ్ విలాస్ పాశ్వాన్… దళిత నేతగా ముద్ర. బీజేపీకి, పాశ్వాన్ కు సిద్ధాంతపరంగా అనేక విభేదాలున్నాయి. అయినా కమలం గూటిలో ఆయన గత కొన్నాళ్లుగా ఒదిగిపోతూనే ఉన్నారు. అధికారంలో భాగస్వామ్యులవుతున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ బీహారీ నేత. ఆయన ఆ రాష్ట్రానికే పరిమితమయిన నేత కాదు. దేశ వ్యాప్తంగా దళితనేతగా ముద్రపడ్డారు. లోక్ జన్ శక్తి పార్టీని స్థాపించిన రామ్ విలాస్ పాశ్వాన్ గాలి ఎటువైపు ఉందో ఊహించడంలో దిట్ట.2014 ఎన్నికల్లో మోదీ వేవ్ బలంగా ఉందని గ్రహించి బీజేపీతో పొత్తుకు దిగారు. కేంద్ర మంత్రి కాగలిగారు. ఇక 2019 ఎన్నికలకు ముందు రామ్ విలాస్ పాశ్వాన్ బీజేపీతో కొంత ఘర్షణ వైఖరికి దిగారు. కేంద్రంపై వ్యతిరేకత, నోట్ల రద్దు, జీఎస్టీ అంశాలు మోదీకి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయని భావించి ఆయన కమలానికి వ్యతిరేకంగా టోన్ పెంచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమణ చేసిన జస్టిస్ ఏకే గోయల్ వ్యవహారంపై పాశ్వాన్ చిందులు తొక్కారు. 


అంచనాల్లో పాశ్వాన్ టాప్
ఏకే గోయల్ ను అప్పట్లో హరిత ట్రిబ్యునల్ ఛైర్మన్ గా నియమించడాన్ని పాశ్వాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలో నిబంధనలను సడలిస్తూ గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన ధర్మాసనంలో ఏకే గోయల్ ఉండటమే పాశ్వాన్ ఆగ్రహానికి కారణం.అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ మరోవైపు బంధాన్ని వదులుకోకపోవడం రాంవిలాస్ పాశ్వాన్ ప్రత్యేకత. దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటామని పాశ్వాన్ పదే పదే చెబుతారు. కానీ ఎన్డీఏ నుంచి వైదొలగకుండా బీహర్ లో బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడం పాశ్వాన్ కు కలసి వచ్చిందనే చెప్పాలి. 2014 లోక్ సభ ఎన్నికల్లో లోక్ జన్ శక్తి పార్టీ పార్టీ ఏడు స్థానాల్లో పోటీ చేస్తే ఆరోచోట్ల విజయం సాధించిది.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కూటమిలోని లుకలుకలను గుర్తించిన పాశ్వాన్ తిరిగి బీజేపీ వైపే మొగ్గుచూపారు. ఈసారి ఎన్నికల్లో పాశ్వాన్ పోటీ చేయలేదు. అయినా ఆయనకు కేంద్ర మంత్రి పదవి లభించింది. త్వరలో రాజ్యసభకు పాశ్వాన్ ఎన్నిక కావాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పాశ్వాన్ కుటుంబం నుంచి ఆయన కుమారుడ చిరాగ్, సోదరులు రామచంద్ర, పశుపతిలు కూడా ఎంపీలుగా గెలిచారు. మొత్తం మీద పాశ్వాన్ దళిత పార్టీ అని చెప్పుకుంటూ కుటుంబ పార్టీగా మార్చేసినా ఆయన రాజకీయం గా వేస్తున్న అడుగులు కలసి వస్తున్నాయనే చెప్పాలి. అంచనాలను కరెక్ట్ గా వేయడంతో ఆయనకు అధికారం అందుబాటులో ఉంటూ వస్తుంది.

No comments:

Post a Comment