Breaking News

24/06/2019

ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో

కలవరపెడుతున్న వానలు

కరీంగనగర్, ఖమ్మం జూన్ 24, (way2newstv.in)
ఉభయ ఖమ్మం, కరీంనగర్  జిల్లాల్లో ఖరీఫ్‌ సాధారణ సాగు లక్షల హెక్టార్లలో ఉండగా.. ఇప్పటికీ అతి స్వల్పంగానే పంటల సాగు ఉంది. వాన కలవరపెడుతోంది. ఊరిస్తూ.. అంతలోనే ఉసూరుమనిపిస్తోంది. గడిచిన రెండేళ్లుగా అరకొర వానలతో నెట్టుకొస్తున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈ ఏడాది వానలోటు దిగాలు పరుస్తోంది. కీలకమైన జూన్‌ మాసంలోనే బెంగతీరేలా వాన జోరు ఉండాలని అన్నదాతలు ఆశిస్తున్నా.. ఆ ఆశ నెరవేరడంలేదు. దీంతో రైతుతోపాటు అన్నివర్గాల్లో కలవరం పెరుగుతోంది. కార్తెలు కదులుతున్నా కలిసిరాని కాలాన్ని చూసుకుని చినుకు జాడల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నాలుగు జిల్లాల్లో నెలకొంది.కారుమబ్బులు కమ్ముకొంటున్నా అవి కరిగి.. నోళ్లు తెరిచిన భూములను తడపలేకపోతున్నాయి. ఖరీఫ్‌ కరిగిపోతోందన్న బెంగతో రైతు కంట కన్నీరొలుకుతున్నా.. వరుణుడు కనికరించడంలేదు. ఫలితంగా సాగుపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి.సాగు రంగంలో అదును (సకాలం)లో విత్తనం నాటడం ప్రధానం. ఖరీఫ్‌ ఆరంభానికి ముందే విత్తనాలు, ఎరువులు, ఇతర పనిముట్లు సిద్ధం చేసుకొని అన్నదాతలు సాగుకు సిద్ధమయ్యారు. 


ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో 
అయితే వరుణుడు ముఖం చాటేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కర్షకులున్నారు. వ్యవసాయ బావులు, బోర్లలో కావాల్సినంత నీరు లేదు. ఇప్పటి వరకు తేలికపాటి వర్షాలే కురిశాయి. కాస్తంత వర్షానికే విత్తనం వేస్తే ఖర్చు వృథా తప్ప ప్రయోజనం ఉండదని రైతులు భావిస్తున్నారు. వరుసగా భారీ వర్షాలు రెండు, మూడు సార్లు కురిస్తే.. బోర్లు, బావుల్లోకి నీరు వచ్చి  చేరుతుంది. భూభాగం చల్లబడిపోతుంది. భూమి మెత్తపడుతుంది. అపుడు విత్తనం విత్తితే మొలకెత్తుతుందన్న ఆశతో ఉన్నారు.ఖమ్మం జిల్లాలో సీజన్‌లో వివిధ రకాల పంటలు 2,30,498 హెక్టార్లలో వేయాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు వేసింది కేవలం 1,619 హెక్టార్లు మాత్రమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగు లక్ష్యం 1,18,038 హెక్టార్లు కానీ నిజ(వాస్తవ)సాగు 8,733హెక్టార్లు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 0.70 శాతం మాత్రమే విత్తనాలు వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవలం 7.3 శాతం మాత్రమే సాగులోకి వచ్చింది.రెండు రోజుల కిందట తొలకరి జల్లులు కాస్త ఊరటనిచ్చినా.. తరువాత మేఘావృతమైన ఆకాశపు జాడలేక వర్షాభావ పరిస్థితి క్రమంగా పెరుగుతోంది. నైరుతి పవనాలు ఆగమనం చేస్తాయని ఎదురుచూపులే తప్పా.. జల్లుల రూపంలో వాన జాడ పుడమిని పెద్దగా తడిపింది లేదు.  మృగశిర కార్తె ఈనెల 8వ తేదీన ప్రారంభమైంది. ఈ కార్తెతోనే వర్షాలువస్తాయని ఎదురు చూసినా రోజుల తరబడి నిరీక్షణ తప్పలేదు. విత్తును నాటేందుకు కీలకమైన తరుణంలోనే కురిసే వాన నీళ్ల కోసం కర్షకులు కొండంత అండతో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సాధారణ వర్షపాతం 477.4మి.మీ కాగా 313.1మి.మీ మాత్రమే జల్లుల ప్రభావం కనిపించింది. మొత్తం 61 మండలాలకుగానూ 45 మండలాల్లో వాన అనుకున్నదానికన్నా తక్కువగా నమోదవడం కష్టం కలిగిస్తోంది.ఉమ్మడి జిల్లాలో మొత్తం 61 మండలాలకుగానూ 2018 జూన్‌ నెలాకరు వరకు కేవలం 12 మండలాల్లోనే పంటలు వేసుకునేందుకు అనుకూలంగా వరుణుడి కరుణ కనిపించింది. 8 మండలాల్లో దుర్భరమైన స్థితిని చూపేలా వాన జాడ కరవైంది. 12మండలాల్లో తీవ్రమైన వర్షాభావాన్ని రైతులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక 29 మండలాల్లో సాధారణంగా వాన పడింది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూన్‌ చివరి వారం వరకు 59శాతం లోటు ప్రభావాన్ని ప్రజలు ఎదుర్కొన్నారు. ఈ జిల్లాలో ఉన్న 13 మండలాల్లో 8 మండలాల్లో  సాధారణ వర్షపాతంలో కనీసం 40శాతం వాన కూడా పడకపోవడంతో తీవ్రత పెరిగింది.  ఈతీరు పంటలపై విపరీత ప్రభావాన్ని చూపించింది. ఈ ఏడాదిలోనూ గతేడాది మాదిరిగానే వర్షభావపరిస్థితులు అన్నివర్గాల ప్రజల్ని ఆందోళనలోకి నెడుతున్నాయి.జగిత్యాల జిల్లాలో.. ఇబ్రహీంపట్నం(-56శాతం), సారంగాపూర్‌(-51శాతం),రాయికల్‌(-50శాతం),  మేడిపల్లి(-51 శాతం), కోరుట్ల(-54శాతం), మెట్‌పల్లి(-48శాతం), కథలాపూర్‌(-52శాతం) అత్యంత వ్యత్యాసం కనిపిస్తోంది. బీర్పూర్‌, పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్‌ మండలాల్లో మాత్రం సాధారణపు తీరు ఒకింత ఆనందాన్ని కలిగించే విషయం. ఈ జిల్లాలో మొత్తం 18 మండలాల్లో 12మండలాల్లో తీవ్రత నెలకొంది. ఒక్క కొడిమ్యాల మండలంలో సాధారణాన్ని మించిన జోరు అగుపించింది. పెద్దపల్లి జిల్లాలో మంథని మండలంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. మంథని మండలంలో(-77శాతం), ఓదెల మండలంలోనూ(-64శాతం) వాన తీవ్రమైన లోటు స్పష్టంగా కనిపించింది. కమాన్‌పూర్‌ మండలంలో మోతాదుని మించిన గణాంకాలు ఉన్నాయి. కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో సాధారణంగానే పడగా.. మిగతా 9 మండలాల్లో తీవ్రమైన లోటు ప్రభావంతో ప్రజలు అల్లాడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.కరీంనగర్‌ జిల్లాలో హుజురాబాద్‌ మండలంలో అత్యంత తక్కువగా వాన పడింది. హుజురాబాద్‌(-61శాతం) మండలంలో ఇబ్బంది ఉండగా.. గంగాధర, కొత్తపల్లి, గన్నేరువరం మండలాల్లో సాధారణ వర్షపాతం ఉన్నట్లు వాతావరణ గణాంకాలు చెబుతున్నాయి. మిగతా 10 మండలాల్లో తీవ్రత అధికంగా ఉంది. సిరిసిల్ల జిల్లాలో వేములవాడ (-60శాతం), ముస్తాబాద్‌ (-78శాతం), తంగళ్లపల్లి (-73శాతం) మండలాల్లో అత్యంత తీవ్ర ప్రభావం ఉండగా.. మిగతా 8 మండలాల్లో వర్షాభావ సమస్య తీవ్రంగా ఉంది. ఆయా మండలాల్లో 50శాతానికన్నా తక్కువగా వాన పడటం అన్నివర్గాల వారిని దిగాలు కలిగిస్తోంది. చందుర్తి(-52శాతం), సిరిసిల్ల(-59శాతం),కోనారావుపేట(-50శాతం)మండలాల్లో లోటు నెలకొంది.

No comments:

Post a Comment