Breaking News

08/05/2019

అధికార ఎమ్మెల్యేల సైలెంట్ వెనుక .....

ఏలూరు, మే 8, (way2newstv.in
ఏపీలో ఈ ఎన్నికల పర్వంలో చాలా చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. అధికార టిడిపి నుంచి పోటీ చేసిన కొంద‌రు అభ్యర్థులను తెలంగాణలో ఓ ప్రధాన పార్టీ బెదిరించిందని, ఈ క్రమంలోనే కొందరు ఎన్నికలకు ముందే వైసీపీలోకి జంప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఏపీలో దాదాపు అందరూ రాజకీయ నాయకులకు హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి. కొందరికి కోట్లాది రూపాయల విలువ ఉన్న భవనాలు, సైట్లు, ఫ్యాక్టరీలు, కంపెనీలు ఉన్నాయి. వీటి విలువ కోట్లలో ఉంటుంది. కెసీఆర్ రిటర్న్ గిఫ్ట్‌లో వైసీపీ, టిఆర్ఎస్ నాయ‌కులు కుమ్మక్కయి టిడిపి నాయకులను వేధించారని టిడిపి నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి పలువురు నేతలు వైసీపీలోకి వెళ్లడం వెనుక ఈ బెదిరింపులు ఉన్నాయని సీఎం చంద్రబాబు సైతం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా అధికార పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులను టార్గెట్‌గా చేసుకుని హైదరాబాదులో ఉన్న వారి ఆస్తులను బూచిగా చూపించి వారు ప్రచారంలో సైలెంట్ అవ్వడం లేదా… పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిళ్లు వచ్చినట్టు కూడా టిడిపి వర్గాలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే


అధికార ఎమ్మెల్యేల సైలెంట్ వెనుక .....

ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో కొందరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధులు తెలంగాణ నేతల బెదిరింపులకు లొంగార‌న్న‌ సందేహాలు టిడిపి వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో వరుసగా రెండుసార్లు గెలుస్తూ హ్యాట్రిక్‌పై కన్నేసిన ఎమ్మెల్యే తీరు సొంత పార్టీ నేతల్లోనే పలు సందేహాలను రేకెత్తిస్తోంది. పోలింగ్‌కు నాలుగు రోజులకు ముందు నుంచి ప్రచారాన్ని పూర్తిగా సైలెంట్ చేయడంతో పాటు డబ్బు పంపిణీ దగ్గరికి వచ్చేసరికి ఎంపీ అభ్యర్థి ఇచ్చిన అమౌంట్ కూడా పంచకుండా దాచుకున్నట్టు టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత రెండు ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న ఆ టిడిపి అభ్యర్థి పై వైసీపీ నుంచి ఓ యువనేత పోటీ పడ్డారు. ఆ యువ నేతగెలుపు కోసం తెలంగాణ నుంచి వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే సైలెంట్ అయ్యారు అన్న సందేహాలు టిడిపి వర్గాల్లో జోరుగా ప్రచారంలో ఉన్నాయి.సదరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అదే జిల్లాకు చెందిన మరికొంత మంది టిడిపి నేతలతో కలిసి హైదరాబాదులో భారీ నిర్మాణ‌ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు విలువ కోట్ల‌లోనే ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన బెదిరింపుల నేపథ్యంలోనే సదరు ఎమ్మెల్యే అభ్యర్థి తీరు చివరిలో మారినట్టు తెలుస్తోంది. పోలింగ్‌కు ముందు రోజు తాను డబ్బులు ఖర్చు పెట్టలేదు సరికదా… చివరకు ఎంపీ అభ్యర్థి ఇచ్చిన డ‌బ్బు సైతం బయటకు రానివ్వకపోవడంతో టిడిపి శ్రేణులు అధిష్టానానికి ఫిర్యాదు చేశాయి. గత ఐదేళ్ల పాటు సదరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇసుక దందాలతో కోట్లాది రూపాయిలు వెనవేసుకున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. రెండు జిల్లాల పరిధిలో ఉన్న ఓ లోక్‌స‌భ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. చంద్రబాబు సైతం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే చాలా పెద్ద ముదురు అని మిగిలిన ఎమ్మెల్యేల ముందు ఓపెన్‌గానే చెప్పేవారట.ఇటు రెండు జిల్లాల పరిధిలో ఉన్న ఎంపీ సీటు ఆ నియోజకవర్గంలో పార్టీకి పడిన దెబ్బతో గెలుస్తుందా ?అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలో ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీకి కొంత సానుకూలత లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆ అసెంబ్లీ సీటులో నాడు కాంగ్రెస్‌కు వ‌చ్చిన మెజార్టీతోనే ఆ ఎంపీ సీటు టీడీపీ కోల్పోయింది. ఇక ఇప్పుడు ఆ సీటుపై టీడీపీ ఆశ‌లు వ‌దిలేసుకుంది. ఇప్పుడు సదరు అభ్యర్థి చేసిన పనితో రెండో ఎమ్మెల్యే సీటు పోవడంతో పాటు ఎంపీపై సైతం ఆ ప్రభావం పడినట్టు టిడిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మరి సదరు ఎమ్మెల్యే అభ్యర్థి నిజంగానే బెదిరింపులకు లొంగారా ? లేదా ఆయన మౌనం వెన‌క‌ ఏం జరిగిందన్న దానిపై తూర్పుగోదావరి జిల్లాలో పెద్దఎత్తున చర్చలు నడుస్తున్నాయి.

No comments:

Post a Comment