హైద్రాబాద్, మే8, (way2newstv.in)
మరోసారి అదే చర్చ. 20 రోజుల్లోపు గానే కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో తెలిసిపోతుంది. త్రిశంకు సభ ఏర్పడుతుందనే అంచనాలతో ఇప్పటికే ఫ్రంట్ ల కదలిక మొదలైంది. ముందువరసలో నిలుచుని పోరాటం చేసేవారు కొందరైతే బ్యాక్ ఎండ్ ఆపరేషన్లతో ఏదో ఒక కూటమికి లాభించే విధంగా చూసేవారు మరికొందరు. తటస్థ పాత్రలో ఒక బలమైన కూటమిని ఏర్పరిస్తే గరిష్ఠ ప్రయోజనాలు సమకూరతాయని ఆశించేవారు కొందరు. ఇలా మూడురకాల పాత్ర పోషణలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తగు ప్రాధాన్యమే లభిస్తోంది. వీరిద్దరూ ఎడమొఖం పెడమొఖంగా కనిపిస్తున్నప్పటికీ ఇద్దరూ వల వేస్తున్న పార్టీలు ఒకటే కావడం విశేషం. ఆ గట్టు, ఈ గట్టు వేరు అయినప్పటికీ ఇద్దరూ తిరిగి ఒకే జట్టు కడతారా? అన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు అనే టాగ్ లైన్ ఇద్దరి వద్దా సిద్దంగానే ఉంది. అటు యూపీఏ, ఇటు ఎన్డీఏ కూటములను కట్టడి చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాలు చేతులు కలపడం చాలా అవసరమనేవారు కూడా ఉన్నారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే పెద్దగా సమస్య ఉండదు. జగన్, కేసీఆర్ ల మధ్య పొలిటికల్ కెమిస్ట్రీ చాలా చక్కగా ఉంది.
బ్యాక్ ఎండ్ ఆపరేషన్లలో చంద్రులు
ఎటొచ్చీ ఇద్దరు చంద్రులు కలిసి పనిచేయాల్సి వస్తేనే కొంత స్ట్రాటజీని వర్కవుట్ చేసుకోవాల్సి ఉంటుంది.పైకి చూస్తే చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లుగా కనిపిస్తాయి. కానీ మధ్యవర్తిత్వం నడపటానికి ఇరువురి శ్రేయోభిలాషులు సిద్ధంగానే ఉన్నారు. నిజానికి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో 40 శాతం వరకూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారే కీలక పాత్ర పోషిస్తున్నారు. టీఆర్ఎస్ తనతో కలిసి పనిచేయడానికి ముందుకు రానందునే తాను కాంగ్రెసుతో చేతులు కలిపానని చంద్రబాబు నాయుడు బహిరంగంగానే గతంలో ప్రకటించారు. మహాకూటమి కట్టి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా చాలా బలంగా పనిచేయడం వల్లనే టీడీపీపై కేసీఆర్ కినుక వహించారు. టీడీపీ సొంతంగా పోటీ చేస్తే నల్లేరుపై బండి నడక మాదిరిగా అధికారపార్టీ గెలుపు సాధ్యమవుతుందని ఆయన భావించారు. మంచి విజయమే సాధించినప్పటికీ టీఆర్ఎస్ సర్వశక్తులు ధారపోయాల్సి వచ్చింది. డబ్బు కూడా బాగానే ఖర్చయింది. చంద్రబాబు నాయుడు కాంగ్రెసుకు అనుకూలంగా భారీగానే డబ్బును వెచ్చించారనేది టీఆర్ఎస్ అధినేత విశ్వాసం. బదులుగా ప్రతీకారం తీర్చుకోవాలని భావించినప్పటికీ చివరి క్షణాల్లో విరమించుకున్నారు. బ్యాక్ ఎండ్ ఆపరేషన్లకే పరిమితమయ్యారు. జగన్ కు అవసరమైన సహాయసహకారాలు పరోక్షంగా అందించారు. ఇప్పుడు వైసీపీ విజయం సాధించకపోతే టీఆర్ఎస్ నిర్దాక్షిణ్యంగా దూరం పెడుతుంది. టీడీపీతో దోస్తీ కడితే కలిసి వస్తుందనుకుంటే అందుకు కేసీఆర్ సిద్దంగానే ఉంటారనేది రాజకీయ పరిశీలకుల అంచనా.కమలం పార్టీ రెచ్చగొడుతోంది. తమకు వ్యతిరేకంగా ఎన్నికూటములు వస్తే అంత మంచిదనే యోచనలో ఉన్నారు బీజేపీ నాయకులు. ఒకవైపు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఒక కూటమిని కొలిక్కి తెచ్చే యత్నాల్లో ఉన్నారు. మరోవైపు అదే బాధ్యతను భుజాలపై వేసుకుని కేసీఆర్ రంగంలోకి దిగారు. వీరిద్దరి టార్గెట్ తటస్థ ప్లేయర్లే. గోడమీద పిల్లిలా వ్యవహరించే ప్రాంతీయపార్టీల అల్టిమేట్ గోల్ తమ సొంత ప్రయోజనాలు. నెగోషియేషన్ లో ఎవరు బాగా చేయగలరో వారి చుట్టూనే చేరతారు. ఈ విషయంలో సీనియర్ గా ముద్ర పడిన చంద్రబాబు నాయుడు పైచేయి సాధిస్తున్నారు. అయితే విజయం ఆయన వెంట ఉన్నంతకాలమే ఈ ఆధిక్యం చెల్లుబాటవుతుంది. ఈసారి ఎన్నికల్లో ఏమాత్రం వైఫల్యం తొంగిచూసినా రాష్ట్రంలోనే కాదు, జాతీయంగానూ తన పాత్ర ను కోల్పోతారు. ప్రాధాన్యం తగ్గిపోతుంది. చంద్రబాబు నాయుడిని వెన్నాడుతున్న భయమదే. ఈసారి బాబుకు గతంలో ఎన్నడూ లేనంత బంగారు అవకాశం ఎదురుచూస్తోంది. మోడీకి, బీజేపీకి సంపూర్ణ ఆధిక్యత దక్కకపోతే చంద్రబాబు నాయుడిని భుజాలపైకి ఎక్కించుకునేందుకు చాలా పార్టీలు సిద్దంగా ఉన్నాయి. కాంగ్రెసు సైతం ఇందుకు వ్యతిరేకం కాదు.జనతాదళ్ సెక్యులర్, నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ, నేషనల్ కాన్ఫరెన్సు వంటి పార్టీలు కాంగ్రెసుకు మద్దతు దారులే. అయితే గత కొంతకాలంగా ఆ పార్టీలు చంద్రబాబు స్వరాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడితే త్రుణమూల్, వామపక్షాలు, బిజూ జనతాదళ్, డీఎంకేల మద్దతు చంద్రబాబు నాయుడు సులభంగా సాధించగలరనేది ఆయా పార్టీల నమ్మకం. మరోవైపు ఎస్పీ, బీఎస్పీల ను సైతం ఈ కూటమికి మద్దతుగా మలచగలరని విశ్వసిస్తున్నారు. ఈ సమీకరణలన్నీ బేరీజు వేసి చూస్తే .. కాంగ్రెసు ఫ్రంట్ లోని పార్టీలు, ఆ కూటమి కాతాలో చేరాల్సిన పార్టీలను చాలా తెలివిగా చంద్రబాబు ట్రాప్ చేస్తున్నారనే చెప్పాలి. అదృష్టం కలిసొస్తే తాను అందలం ఎక్కడానికి ఈ సంఖ్య, కూటమి ఉపయోగపడుతుంది. లేకపోతే కాంగ్రెసుకు అనుకూలంగా తాను చక్రం తిప్పడానికీ ఉపకరిస్తుంది. ఒకవేళ రాష్ట్రంలో అధికారం కోల్పోయి, కనీసం పదివరకూ ఎంపీలు ఎన్నికైతే ఈ కూటమి బలంతో జాతీయంగా తన పాత్రను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో చంద్రబాబు కేసీఆర్ తో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమే. తన పార్టీ ప్రాధాన్యం, తన ప్రాధాన్యం పరిరక్షించుకోవడమనేది ఇప్పుడు చంద్రబాబు ముందున్న కర్తవ్యం. కేసీఆర్ కూడా జాతీయ పాత్రలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే చాన్సు దక్కుతుంది. కచ్చితంగా ఇంకొకరు సహాయపాత్ర పోషించాల్సి వస్తుంది. రాజకీయ అనివార్యతలు అందుకు సహకరిస్తాయనే చెప్పవచ్చు.
No comments:
Post a Comment