Breaking News

27/04/2019

వినుకొండలో గెలుపుపై గురి

గుంటూరు, ఏప్రిల్ 27, (way2newstv.in)
గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాకు సరిహద్దుగా నల్లమల్లకు అభిముఖంగా ఉన్న నియోజకవర్గం వినుకొండ. ప్రాచీన‌కాలంలో విష్ణుకుండినుల రాజ‌ధానిగా ఉన్న వినుకొండ క‌మ్యూనిస్టు ఉద్య‌మాల‌కు, రాజ‌కీయ చైత‌న్యానికి, న‌క్స‌లైట్ల‌కు ఒక‌ప్పుడు కేరాఫ్‌. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ. ఆంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఈ సారి టీడీపీ వర్సెస్‌ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో సంగ్రామం సాగింది. గత రెండు ఎన్నికల్లోనూ జిల్లాలోనే భారీ మెజారిటీతో ఘన విజయాలు సాధిస్తూ వస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆంజనేయులు ఈ ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని పట్టుదలతో పోరాటం చేశారు. ఇక జీవీకి పాత ప్రత్యర్థి అయిన బొల్లా బ్రహ్మనాయుడు ఈ సారి సానుభూతితో పాటు తనకు కలిసి వచ్చిన సమీకరణలతో ఎలాగైనా వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచి తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోబోతున్నాన‌న్న ధీమాతో ఉన్నారు.


వినుకొండలో గెలుపుపై గురి

పది సంవత్సరాలుగా వినుకొండ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకుని వినుకొండలో ఎలక్షన్‌ అంటే జీవీ మెజారిటీ 20,000 పైమాటే అనే మాట తప్పా… రెండో మాట లేకుండా చేసిన జీవీకి ఈ ఎన్నికల్లో బొల్లా నుంచి గట్టి పోటీ ఎదురైంది. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్న బొల్లా గత ఎన్నికల్లో వినుకొండలో పోటీ చేసేందుకు ఇక్కడ వర్క్‌ చేసుకున్నారు. జగన్‌ చివరిలో ఆయనను పెదకూరపాడు నుంచి పోటీ చేయించారు. పెదకూరపాడులో ఓడిన బొల్లా ఇప్పుడు ముచ్చటగా మూడో సారి వినుకొండ నుంచి తన అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయినా సానుభూతితో పాటు తన డైరీ కంపెనీల ద్వారా నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న ఉద్యోగుల ఓట్లు, బంధుత్వాలు ఇవన్నీ తనకు కలిసి వస్తాయన్న ధీమాతో బొల్లా ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ బొల్లా పోటీ చేసినా అప్పుడు ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉండడం… అంతకు ముందు ఎన్నికల్లో జీవీ సతీమణి లీలావతి ఓడిపోవడంతో పాటు… ఐదేళ్ల పాటు జీవీ నిర్విరామంగా చేసిన సేవలతో ఆ ఎన్నికల్లో జీవీని ఢీ కొట్టడం ప్రత్యర్థుల వల్ల కాలేదు.అందుకే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గాలులు రాష్ట్రం అంతా వీచినా వినుకొండలో ఆయన 24,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే బొల్లాపై సానుభూతి పవనాలు తీవ్రంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉన్న ఈ నియోజకవర్గంలో మెజారిటీ వర్గం ఓటర్లు ఈ సారి బొల్లాకు ఓ ఛాన్స్‌ ఇచ్చి చూడాలని భావిస్తున్నారు. వాస్తవంగా చూస్తే నియోజకవర్గాన్ని పదేళ్ల నుంచి పాలిస్తున్న జీవీపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు. వివాదాలకు దూరం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటారు. ఇదే టైమ్‌లో ఆయనతో నియోజకవర్గంలో సొంత సామాజికవర్గంలో కొంద‌రు, పాటు టీడీపీలో కొందరు కీలక నేతలు గత ఏడాది కాలంగా అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. శావల్యాపురం, ఈపూరు, నూజండ్ల లాంటి టీడీపీకి బాగా పట్టున్న మండలాల్లో సీనియర్‌ నేతలతో ఆంజనేయులకు ఉన్న అగాధం ఓటింగ్‌ సరళిపై కొంత వరకు ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో తిరుగులేని అభివృద్ధిని చేసిన ఆయన తన సొంత ట్రస్ట్‌ అయిన లీలావతి అంజన్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మంది పేదలను ఆదుకున్నారు.
గత అక్టోబర్‌లో వినుకొండ మున్సిపాలిటీకి నీటి కొరత ఏర్పడినప్పుడు ఏకంగా 20 కిలోమీటర్ల నుంచి నాగార్జున సాగర్‌ నీటిని ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేసి పట్టణంలో పార్టీలకు అతీతంగా అందరి మనసులు గెలుచుకున్నారు. అప్పటి వరకు ఆయనపై తీవ్రంగా ఉన్న వ్యతిరేకత ఆ ఒక్క సంఘ‌టనతో చాలా వరకు పాజిటివ్‌గా మారిపోయిందన్నది వాస్తవం. ఇక ఐదేళ్ల పాటు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉండడంతో గతంలో నియోజకవర్గంతో ఉన్న అనబంధంతో పోలిస్తే ఈ ఐదేళ్లలో నియోజకవర్గంపై కాస్త కాన్‌సంట్రేషన్‌ తగ్గించారన్న చర్చ నియోజకవర్గంలో ఉంది. అయితే పార్టీ అధిష్టానం వద్ద మాత్రం ఆంజనేయులకు మంచి మార్కులే ఉన్నాయి. వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుకు సైతం నియోజకవర్గంలో మంచి వ్యక్తిగానే పేరుంది. అయితే ప్రజల్లోకి అంతగా చొచ్చుకుపోయే మనస్త‌త్వం ఉండదన్న చిన్న రిమార్క్‌ మాత్రం ఆయనపై ఉంది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న సంకల్పంతో బొల్లా సైతం జీవీకి ధీటుగా కోట్లాది రూపాయిలు ఖర్చు చేశారు. ఓట్ల కొనుగోలులో జీవీ, బొల్లా ఇద్దరూ కూడా ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో ఎవ్వరూ కూడా వెనక్కి తగ్గలేదు. ఇక నియోజకవర్గంలో వినుకొండ మున్సిపాలిటీతో పాటు ఐదు మండలాలు ఉన్నాయి. వైసీపీ లెక్కల ప్రకారం వినుకొండ మున్సిపాలిటీ, వినుకొండ రూరల్‌, బొల్లాపల్లి మండలాల్లో తమకు ఆధిక్యం వస్తుందని లెక్కలు వేసుకుంటోంది. అలాగే బొల్లా సొంత మండలం శావల్యాపురంలో గతంలో టీడీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ మండలంలో బొల్లాకు విస్తృతంగా ఉన్న బంధుత్వాలు, పరిచయాల నేపథ్యంలో శావల్యాపురం మండలంలో ఈ సారి హోరా హోరీ పోరు ఉంటుందని వైసీపీ అంచనా. ఇక నూజండ్ల, ఈపూరు మండ‌లాల్లోనూ టీడీపీకి గట్టి పోటీ ఇచ్చామని ఇక్కడ కూడా తమకే మెజారిటీ వస్తుందని తమ గెలుపు ఖాయమన్న అంచనాలో ఉంది. ఇక టీడీపీ విషయానికి వస్తే టౌన్‌లో కొద్ది రోజుల వరకు ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యే జీవీ నీటి సయస్యను పరిష్కరించి సింగిల్‌ హ్యాండ్‌తో పాజిటీవ్‌ వేవ్‌గా మార్చేశారని టీడీపీ చెబుతోంది. నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ తమకే మెజారిటీ వస్తుందనిఒక్క బొల్లాపల్లిలో మాత్రం 1000-1500 ఓట్లు కాస్త అటూ ఇటూ ఉంటాయే తప్ప మళ్లీ తాము మరో సారి భారీ మెజారిటీతో గెలవడంతో పాటు జీవీ హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారని టీడీపీ శ్రేణులు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఏదేమైనా హోరా హోరీగా జరిగిన వినుకొండ సంగ్రామంలో జీవీ హ్యాట్రిక్‌ కొడతాడా ? లేదా జీవీ జోరుకు బొల్లా చెక్‌ పెట్టి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకుంటాడా ? అన్నది మే 23న తేలిపోనుంది.

No comments:

Post a Comment