Breaking News

27/04/2019

రాయితీలు లేకుండానే యంత్రాలు ఎస్కార్ట్స్‌ కంపెనీ

కాకినాడ, ఏప్రిల్ 27, (way2newstv.in
రైతులకు రాయితీపై యంత్రాలను అందించేందుకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ప్రైవేటు భాగస్వామ్యంతో సీహెచ్‌సీ కేంద్రాలను ఏర్పాటు చేసినా దానికి అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయక పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలో 20 చోట్ల సీహెచ్‌సీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించినా కేవలం ఆరు చోట్ల మాత్రమే వీటిని నెలకొల్పారు. మిగిలిన ప్రాంతాల్లో ఈ కేంద్రాల ఏర్పాటుకు ఏ కంపెనీ ముందుకు రాకపోవడంతో లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎస్కార్ట్స్‌ కంపెనీ ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని యంత్రాలకు సైతం రాయితీ అందక పోవడంతో వీటి నిర్వహణ కూడా ప్రశ్నార్థకంగా మారింది. తమకు రాయితీని అందిస్తే యంత్రాలను రైతులకు అందుబాటులో ఉంచుతామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వ్యవసాయ పనులకు కూలీలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే వారు యాంత్రీకరణ వైపు మొగ్గుచూపుతుండడంతో యంత్రాలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం రబీ మాసూళ్లు జరుగుతున్న తరుణంలో కొందరు దళారులు వరి కోత యంత్రాలను తీసుకొచ్చి రైతుల నుంచి భారీగా అద్దె వసూలు చేస్తున్నారు. 


రాయితీలు లేకుండానే యంత్రాలు ఎస్కార్ట్స్‌ కంపెనీ 

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏదో విధంగా పంటను ఒబ్బిడి చేసుకోవాలన్న ఆతృతతో రైతులు వారు అద్దె ధరను చెల్లిస్తున్నారు. ఇటీవల రాజోలులో సీహెచ్‌సీ కేంద్రానికి చెందిన వరికోత యంత్రంతో పనిచేస్తుండగా కొందరు దళారులు హడావుడి సృష్టించారు.గంటకు రూ.1,850 అద్దెతో వరి పంటను ఎలా కోస్తారని ప్రశ్నిస్తూ యంత్రం తాళాలను తీసుకెళ్లి రెండు రోజుల వరకూ ఇవ్వలేదు. ఈ పరిస్థితిలో సీహెచ్‌సీ సెంటర్లకు రాయితీని విడుదల చేసి ఈ యంత్రాలను విస్తృతంగా అందుబాటులోకి తేవాల్సిన అవసరముంది.ఎస్కార్ట్స్‌ క్రాప్‌ సొల్యూషన్స్‌ కంపెనీ సుమారు రూ.3 కోట్లతో యంత్రాలను కొనుగోలు చేసి సీహెచ్‌సీ సెంటర్ల ద్వారా అందుబాటులో ఉంచింది. దీనికి 50 శాతం రాయితీ ప్రకారం రూ.1.50 సంబంధిత కంపెనీకి అందజేయాల్సి ఉంది. గత ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రైతులకు ఈ యంత్రాలను అందించడంతో రైతులకు కొంత మేరకు ప్రయోజనం చేకూరింది. రబీకి సంబంధించి వరి మాసూళ్లు ప్రారంభమైన తరుణంలో వరికోత యంత్రాలకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ట్స్‌ కంపెనీకి రావాల్సిన రాయితీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ అందలేదు. దీంతో రైతులకు రాయితీపై యంత్రాలను అందించలేమని సంస్థ చేతులెత్తేసింది. ఫలితంగా రైతులు అధిక అద్దెలు చెల్లిస్తూ ప్రైవేటు యంత్రాలను వినియోగిస్తున్నారు. సీహెచ్‌సీ కేంద్రాల ద్వారా వరి కోత యంత్రాన్ని గంటకు రూ.1,850 అద్దెకే అందించే వారు. కానీ ప్రస్తుతం ప్రైవేటు యంత్రాల నిర్వాహకులు గంటకు రూ.2,300 నుంచి రూ.2,400 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు ఎకరాకు రూ.600 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అసలే పెట్టుబడులు భారీగా పెరిగి అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు రాయితీతో యంత్రాలు వినియోగించుకునే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

No comments:

Post a Comment