Breaking News

21/03/2019

సరిహద్దుల్లో నిఘా (పశ్చిమగోదావరి)

ఏలూరు, మార్చి 21 (way2newstv.in):  
సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయంతో ముందుకు సాగేలా ఆంధ్ర- తెలంగాణా పోలీసులు పక్కా ప్రణాళికలతో విధులు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక సమరానికి ఎన్నికల  సీజన్ కావడంతో రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది. జిల్లాలో చింతలపూడి, కుక్కునూరు, వేలేరుపాడు, టి.నరసాపురం, జీలుగుమిల్లి మండలాలతో తెలంగాణా రాష్ట్ర సరిహద్దు ఉంది. ఈ ప్రాంతాలకు తెలంగాణా నుంచి నిత్యం వందలాది మంది వివిధ వ్యాపార పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో అసాంఘిక శక్తులు రెండు రాష్ట్రాల మధ్య సంచరించే ప్రమాదం కూడా ఉంది. వచ్చే నెల 11వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఉండటంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. నేరాల నియంత్రణ, అక్రమ రవాణా నిరోధం తదితర అంశాలలో రెండు రాష్ట్రాల పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రం సత్తుపల్లికి చెందిన డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాలకు చెందిన పోలీసులు విడతల వారీగా సమావేశాలు ఏర్పాటుచేసి ఎన్నికల ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా మద్యం, నగదు, నాటుసారా, స్పిరిట్, మత్తు పదార్థాలు, ఓటర్లను ఆకట్టుకునేందుకు వచ్చే తాయిలాల రవాణాను అడ్డుకొనేందుకు ఈ సమావేశాల్లో సంకల్పించారు.


సరిహద్దుల్లో నిఘా (పశ్చిమగోదావరి)


తెలంగాణాలో ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికలకు జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంత పోలీసులు పూర్తి సహకారం అందించారు. చెక్‌పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి మద్యం, నగదు సరఫరా జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేసి సత్ఫలితాలు సాధించారు. ఇరు రాష్ట్ర పోలీసులు ప్రధానంగా సమన్వయంతోపాటు ఎన్నికలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. శాఖల వారిగా ఒకరికొకరి పరిచయాలు, సహాయ సహకారాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో కొన్ని కేసుల విషయంలో సరిహద్దు ప్రాంత పోలీసులకు సరైన సమన్వయం లేక కేసుల పరిష్కారం సమస్యగా మారేది. ఏదైన కేసు ఇరు రాష్ట్రాలకి సంబంధించినది అయితే పరస్పర సహకారంతో సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంతోపాటు, సకాలంలో కేసులు చేధించాలని పోలీసులు అంగీకారానికి వచ్చారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు సరిహద్దు పోలీసులు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంతో పాటు చెక్‌పోస్టుల నిర్వహణ పటిష్ఠపరచాలని నిర్ణయించారు.
తెలంగాణా సరిహద్దు ప్రాంతాలైన చింతలపూడి మండలం గురుభట్లగూడెం, అల్లిపల్లితోపాటు జీలుగుమిల్లి మండలంలో ఒక చెక్‌పోస్టు, టి.నరసాపురం మండల సరిహద్దు ప్రాంతంతో పాటు కుక్కునూరు మండలంలో వేలేరు, ఇసుకపాడు ఇంకా వేలేరుపాడులలో సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో పోస్టుల వద్ద అదనంగా ఎస్సైలను, కానిస్టేబుల్స్‌ను కేటాయించాలని పోలీసుశాఖ నిర్ణయించింది. తెలంగాణా ప్రాంతం నుంచి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు, మద్యం, నగదు సరఫరా జరగకుండా ఇక్కడి సిబ్బంది 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా చాట్రాయి, విస్సన్నపేటలు తెలంగాణా రాష్ట్రంతోపాటు చింతలపూడి మండలంతోనూ సరిహద్దు కలిగి ఉండటంతో ఈ ప్రాంతాల్లోనూ నిఘా పటిష్ఠం చేశారు.
ఎన్నికలు అనగానే మద్యం సరఫరా సర్వసాధారణం. అక్రమ, కల్తీ మద్యం సరిహద్దు దాటుతుంటాయి. అక్రమ రవాణా, అక్రమ నిల్వలు సరిహద్దుల్లో పట్టుకోవడం పరిపాటి. అయితే ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని మోహరిస్తున్నారు. తెలంగాణా ఎక్సైజ్‌శాఖతో కలిసి రెండు, మూడు రోజుల్లో సంయుక్త సమావేశం నిర్వహించేందుకు ఎక్సైజ్‌శాఖ సన్నద్ధమవుతోంది. ఎక్సైజ్‌శాఖతోపాటు సంయుక్తంగా దాడులు చేసి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఇరు రాష్ట్రాల పోలీసులు అంగీకారానికి వచ్చారు. మరి కొద్దిరోజుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు సైతం మరోమారు సమావేశమై ఎన్నికల నిర్వహణ ప్రణాళిక రూపొందించనున్నారని సమాచారం.

No comments:

Post a Comment