Breaking News

21/03/2019

అడవిలో దాహం కేకలు (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, మార్చి 21 (way2newstv.in): 
వేసవి పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి.. దీనికి తోడు భూగర్భ జలాలు పడిపోయాయి.. అటవీ ప్రాంతాల్లో జంతువుల దాహార్తి తీర్చే చెక్‌డ్యామ్‌ల్లో నీరు ఇంకిపోయింది.. దీంతో అటవీ ప్రాంతాల్లో ఉండే జంతువుల పరిస్థితి దయనీయంగా ఉంది.. గండీడ్‌ మండలం మహ్మదాబాద్‌ అటవీ ప్రాంతంలో సోలార్‌ బోర్ల ద్వారా నీరు వస్తున్నప్పటికి ఇతర ప్రాంతాల్లో మాత్రం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.. రానున్న రోజుల్లో ఇంకా సమస్యలు పెరుగుతుందని భావిస్తున్న అధికారులు ముందస్తుగానే అప్రమత్తం అయ్యారు.
అటవీ ప్రాంతాల్లోని చెక్‌డ్యామ్‌లలో గతంలో ఏప్రిల్‌ మాసం వరకు నీరు ఉండేది. కాని ఈసారి మార్చి మాసం ప్రారంభంలోనే నీటి చుక్క లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడే ఎండలు ఎక్కువగా ఉండటం, అటవీ ప్రాంతంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. 


అడవిలో దాహం కేకలు (మహబూబ్ నగర్)

నీరు లేక అటవీ ప్రాతాల్లోని జంతువులు సమీప గ్రామాల్లోకి రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఏర్పాటు చేసిన సాసర్లలో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. అటవీ ప్రాంతాల్లో జంతువుల తాగునీటి సమస్యను తీర్చేందుకు నిర్మించిన చెక్‌డ్యామ్‌లలోనూ నీరు లేకుండాపోగా కోయిలకొండ మండల పరిధిలోని భవానిసాగర్‌తోపాటు అయ్యవార్‌పల్లి చెక్‌డ్యామ్‌లలో మాత్రం ఎంత వేసవిలోనైనా నీరు ఉండటం కొంత ఊరటనిచ్చే విషయంగా అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ రాత్రి సమయాల్లో జంతువులు వచ్చి నీరు తాగి వెళ్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. చెక్‌డ్యామ్‌లు ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టారు.
మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం మహ్మదాబాద్‌ అటవీ ప్రాంతంలో గతేడాది అధికారులు సోలార్‌ బోర్లను ఏర్పాటు చేశారు. విద్యుత్తు లేకున్నా పనిచేసే ఈ బోర్ల ద్వారా వచ్చే నీరు చిన్న చిన్న గుంతలు, చెక్‌డ్యామ్‌లు, సాసర్లలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. మహబూబ్‌నగర్‌, పేట జిల్లాల్లో మహ్మదాబాదే దట్టమైన అటవీ ప్రాంతం కాగా, జంతు సంపదా అక్కడ ఎక్కువే. చిరుతలతోపాటు ఇతర జంతువులు ఎక్కువగా ఈ అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. మూడు సోలార్‌ బోర్లు ఇప్పటికే ఉన్నప్పటికి మరొకటి ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మిగతా అటవీ ప్రాంతంలో మాత్రం నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

No comments:

Post a Comment