Breaking News

08/03/2019

ధర్మపురి కి సన్ స్ట్రోక్...?

నిజామాబాద్, మార్చి 8, (way2newstv.in)
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరిగా చెలామణి అవుతూ, తనదైన శైలిలో ఆధిపత్యం చాటుకున్న రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ ప్రతిష్ట మసకబారడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయన చిన్న తనయుడు ధర్మపురి అరవింద్ వ్యవహారశైలి కారణంగా నిలిచిందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తపరుస్తున్నారు. సాక్షాత్తూ డీఎస్ పెద్ద కుమారుడు, నిజామాబాద్ నగర మాజీ మేయర్ డీ.సంజయ్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. దాదాపు నలభై ఏళ్లకు పైబడిన రాజకీయ పయనంలో అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, డీఎస్ వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలిగారని గుర్తు చేస్తున్నారు. అలాంటిది చిన్న తనయుడు అరవింద్ బీజేపీ పార్టీలో చేరిన మీదట, ఎకాఏకిన తనకు ఎనలేని గుర్తింపు దక్కాలనే తాపత్రయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అయిన నిజామాబాద్ ఎం.పీ కల్వకుంట్ల కవితను లక్ష్యంగా చేసుకుని ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఈ పరిణామం కాస్త డీఎస్ రాజకీయ ప్రతిష్టను మసకబారేలా చేసిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అరవింద్ దూకుడు కనబర్చిన నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాకు చెందిన తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా డీఎస్‌పై తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన విషయం విదితమే. 


ధర్మపురి కి సన్ స్ట్రోక్...?

డీఎస్ సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, అరవింద్‌కు మద్దతు కూడగడుతున్నారని ఆరోపిస్తూ తెరాస అధినేత కేసీఆర్‌కు క్రమశిక్షణ చర్యలకై సిఫార్సు చేశారు. అప్పటి నుండి డీఎస్ తెరాస పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. తన అనుచరులందరినీ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చినప్పటికీ, రాజ్యసభ పదవిని కోల్పోయే ప్రమాదం ఉండడం వల్ల సాంకేతిక కారణాలతో డీఎస్ తెరాస పార్టీకి రాజీనామా చేయకుండా స్తబ్ధంగానే ఉండిపోతున్నారు. 2009 ఎన్నికల వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో మూడు పర్యాయాలు టీ.పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేసులో కొనసాగిన డీఎస్, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కేటాయించలేదనే కారణంగా, అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న దిగ్విజయ్‌సింగ్ వైఖరిని తూర్పారబడుతూ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గులాబీ గూటిలోకి ఆయనను సాదరంగా స్వాగతించిన కేసీఆర్, రాజ్యసభ పదవిని కేటాయించి తగిన గౌరవం సైతం కల్పించారు. కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల పాటు కొనసాగినప్పటికీ నెరవేరలేకపోయిన ఎం.పీ కలను డీఎస్ తెరాసలో చేరడం ద్వారా ఈడేర్చుకోగలిగారు. తెరాసలోనూ ఆయనకు సముచిత ప్రాధాన్యం దక్కిందని అనుచరులు ఊరట చెందుతున్న తరుణంలోనే, ఆయన చిన్న తనయుడు అరవింద్ రూపంలో డీఎస్‌ను రాజకీయ కష్టాలు వెంటాడాయనే అభిప్రాయాలు సర్వత్రా నెలకొని ఉన్నాయి. డీఎస్ తెరాస తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, అరవింద్ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతోనే సరిపెట్టుకోకుండా దూకుడు వైఖరిని ప్రదర్శించడం పరోక్షంగానైనా డీఎస్ రాజకీయ ప్రతిష్టకు ఎసరు పెట్టినట్లయ్యిందని పరిశీలకులు సైతం విశే్లషిస్తున్నారు. నిజానికి 2009 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2010లో నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో డీఎస్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా, ఆయనను గెలిపించుకోవాలనే తాపత్రయంతో అరవింద్ ఆ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించినప్పటికీ డీఎస్ వరుస ఓటములను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అలాంటిది అరవింద్ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయిస్తూ తనకు మొదటి నుండీ బీజేపీ పార్టీ అంటే ఎంతో ఇష్టమని, ప్రధాని నరేంద్రమోడీ పట్ల ఎనలేని అభిమానాన్ని కురిపిస్తూ కాషాయ పార్టీలో చేరిపోయారు. ఎలాగైనా నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో దూకుడు వైఖరిని ప్రదర్శిస్తున్నారు. అయితే అరవింద్‌కు పోటీగా బీజేపీలో మరికొందరు క్రియాశీలక నేతలు ఎం.పీ టిక్కెట్ కోసం గట్టిగానే పావులు కదుపుతున్నారు. దీంతో వ్రతం చెడ్డా ఫలితమైనా దక్కేనా? అన్న చందంగా అరవింద్ పరిస్థితి మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

No comments:

Post a Comment